Home న్యూస్ జార్జిరెడ్డి ఎవరు? సినిమా కథాంశంగా ఎలా అయ్యారు?

జార్జిరెడ్డి ఎవరు? సినిమా కథాంశంగా ఎలా అయ్యారు?

george reddy
Picture Credit: http://georgereddyamarrahe.blogspot.com

ఎంత‌టి చురుకైన విద్యార్థికైనా భ‌యం పుట్టించేవి.. ఒక ప‌ట్టాన అర్ధం కానివి ఫిజిక్స్ ఫార్ములాలు. వాటిని చాలా సింపుల్‌గా ప్రొఫెస‌ర్లు సైతం ఊహించ‌నంత సులువుగా అత‌ను సాల్వ్ చేశాడు. ఆ జ‌వాబులు చూసి ఆ పేప‌ర్ దిద్దే ప్రొఫెస‌ర్ ఆశ్చ‌ర్య‌పోయాడు. అత‌నిని చూసేందుకు బొంబాయి (ఇప్ప‌టి ముంబై) నుంచి హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ ఛాంబ‌ర్‌కు అత‌నిని పిలిపించుకున్నాడు. ఫిజిక్స్‌లో భార‌త‌దేశానికి నోబెల్ బ‌హుమ‌తి తెచ్చే విద్యార్థి మీ యూనివ‌ర్సిటీలో ఉన్నారంటూ వైస్ ఛాన్స‌ల‌ర్‌కు చెప్పారు. అంతటి ప్రతిభ కలిగిన ఆ విద్యార్ధే జార్జిరెడ్డి.

అత‌ను మ‌రి కొన్నాళ్లు బ‌తికి ఉంటే ఆ బొంబాయి ప్రొఫెస‌ర్ చెప్పిన మాట‌లు నిజ‌మ‌య్యేవేమో. కానీ విద్యార్థి సంఘం ముసుగులోని విచ్ఛిన్న‌క‌ర‌, అరాచక శ‌క్తుల దాడిలో ఆ మేధావి ప్రాణాలు కోల్పోయాడు. కానీ నోబెల్ బ‌హుమ‌తికి ఆద్యుడైన అల్‌ఫ్రెడ్ నోబెల్ క‌నిపెట్టిన డైన‌మెట్ల‌ను అరాచక శ‌క్తుల గుండెల్లో పేల్చిన ఘ‌నుడు జార్జిరెడ్డి. ఇంత‌కీ ఎవ‌రీ జార్జిరెడ్డి… ఆయన జీవిత చరిత్ర సినిమా కథాంశంగా ఎలా మారింది?

జార్జిరెడ్డి నేపథ్యం ఇదీ..

చిత్తూరు జిల్లాకు చెందిన చ‌ల్లా ర‌ఘునాథ‌రెడ్డి, కేర‌ళ పాల‌క్కాడ్‌కు చెందిన లీలావ‌ర్గీస్‌లకు 1947 జనవరి 15న నాలుగో సంతానంగా జార్జిరెడ్డి జన్మించాడు. రఘునాథరెడ్డి, లీలావర్గీస్ చెన్నై ప్రెసిడెన్సీ కాలేజ్ లో కలుసుకున్నారు. తదుపరి వివాహం చేసుకున్నారు. రఘనాథ్ రెడ్డి బీఏ హానర్స్ చేసి ఎంఏ కోసం ప్రెసిడెన్సీ కాలేజ్ వచ్చారు. లీలా వర్గీస్ కెమిస్ట్రీలో డిగ్రీ చేసి పీజీ కోసం ప్రెసిడెన్సీ కాలేజ్ వచ్చారు. వీరికి ఐదుగురు సంతానం. పెద్దబ్బాయి డాన్ రెడ్డి బీఈడీ చేసి ఒడిసాకు వెళ్లిపోయారు. రెండో సంతానం కార్ల్ రెడ్డి ఐఏఎస్. మూడో సంతానం అమ్మాయి. పేరు జాయ్ రెడ్డి. ఎంఎ లింగ్విస్టిక్స్ చేశారు. మైసూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైసూర్ లో పనిచేశారు. నాలుగో సంతానం జార్జిరెడ్డి. ఐదో సంతానం అబ్బాయి సిరిల్.

తండ్రి ఉద్యోగ‌రీత్యా పాల‌క్కాడ్‌, వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్ వంటి ప‌లుచోట్ల జార్జిరెడ్డి చ‌దువుకున్నాడు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య చెన్నై, బెంగళూరు నగరాల్లో సాగగా.. హైస్కూల్ విద్యను కాజీపేటలోని సెయింట్ గాబ్రియెల్ హైస్కూల్, హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ స్కూల్ లో పూర్తిచేశాడు. నిజాం కళాశాలలో ప్రీయూనివర్శిటీ (పీయూసీ) పూర్తిచేశాడు. 1971లో భౌతిక శాస్త్రంలో ఎంఏ చేయడానికి ఉస్మానియా యూనివర్శిటీలో చేరాడు. పీహెచ్డీ ప్రోగ్రామ్ లో చేరాడు.

జార్జిరెడ్డి పుస్త‌కాల పురుగు. కిక్‌బాక్సింగ్‌, చైన్ పోరాటాల్లో హీరో. కాలేజీ చ‌దువుల నాటికి కుటుంబం హైద‌రాబాద్‌లో ఉండ‌డంతో నిజాం క‌ళాశాలలో చేరాడు. అక్క‌డి నుంచి పీజీకి ఉస్మానియా యూనివ‌ర్సిటీలో చేరాడు. అప్ప‌టికే స్వాతంత్ర్యం వ‌చ్చి ఇర‌వై ఏళ్లు అయింది. కానీ దేశ ప‌రిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దేశంలో నాటి అల‌జ‌డి, అసంతృప్తి, అంత‌ర్మ‌థ‌నాల నుంచి  వెలుగులోకి వచ్చిన శ‌క్తే జార్జిరెడ్డి.

1967.. క్యాలెండ‌ర్‌లో ఓ సంవ‌త్స‌రం కావ‌చ్చు. కానీ ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు, భార‌త‌దేశ చ‌రిత్ర‌ను మ‌లుపుతిప్పిన అనేక ఘ‌ట‌న‌లు, ప్ర‌తిఘ‌ట‌నోద్య‌మాల‌కు పురుడుపోసిన సంవ‌త్స‌రం. తెల్ల‌వాడి పాల‌న నుంచి బ‌య‌ట‌ప‌డి 20 ఏళ్లు గ‌డిచినా స్వేచ్చా ఫ‌లాలు పేద‌వాళ్ల‌కు అంద‌లేదు. దోపిడీ మ‌రింత పెరిగింది.

న‌ల్ల దొర‌ల దురాగ‌తాలు తెల్ల దొర‌ల‌ను మించిపోయాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగానూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్న కాలమ‌ది. చిట్టెలుక లాంటి వియ‌త్నాం ప్రపంచ శ‌క్తిగా మారిన అమెరికాను చిత్తు చేస్తున్న స‌మ‌యం. ఆ స్పూర్తి అనేక దేశాల్లోని యువ‌త‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ప‌శ్చిమ బెంగాల్‌లోని న‌క్స‌ల్బ‌రీలో సాయుధ పోరాటానికి అంకురార్ప‌ణ జ‌రిగింది. శ్రీ‌కాకుళం గిరిజ‌న సాయుధ పోరాటం మొద‌లైంది. ఇవ‌న్నీ యువ‌కునిగా ఉన్న జార్జిరెడ్డిపై పెను ప్ర‌భావం చూపాయి. తొలి నుంచి ప్ర‌గ‌తిశీల ఆలోచ‌న‌లు ఉన్న జార్జిరెడ్డిని ఇవి మ‌రింత‌గా ప్ర‌భావితం చేశాయి.

చెరగని ముద్ర వేసిన సాహిత్యం

చురుకైన చూపులు.. లోతైన అధ్య‌య‌నం. అద్భుత‌మైన తెలివితేట‌లు.. అంత‌కుమించిన ధైర్యం. చూడ‌గానే క‌ట్టిప‌డేసే చురుకైన క‌ళ్లు. అన్యాయాన్నిఅక్ర‌మాల‌ను స‌హించ‌ని వ్య‌క్తిత్వం.. ఈ త‌త్వ‌మే ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఓ గొడ‌వ‌లో జార్జిరెడ్డిని ఇరుక్కునేలా చేసింది. ఫ‌లితం అప్ప‌టికే జార్జిరెడ్డి తీరుతో వెన‌క‌డుగు వేసిన విచ్ఛ‌న్న‌క‌ర శక్తులకు, వారికి అండ‌దండ‌లు అందిస్తున్న కొంద‌రు ప్రొఫెస‌ర్ల‌కు అవ‌కాశం చిక్కింది. త‌మ ప‌లుకుబ‌డితో యూనివ‌ర్సిటీ నుంచి ఏడాది పాటు ర‌స్టికేట్ చేశారు.

పుస్త‌కాల పురుగైన జార్జిరెడ్డి ఆ ఏడాదిలోనే  మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల‌కు సంబంధించిన ఎన్నో క‌ఠిన సూత్రాల‌ను సులువుగా మార్చి నోట్స్ రాశాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆ కాలంలోనూ, అంత‌కు ముందు పెను ప్ర‌భావం చూపిన నోమ్‌ఛామ్‌స్కీ, ఫ్రెడ‌రిక్ హెగెల్స్‌, అలెక్స్ హేలీ (ఈయ‌న రాసిన రూట్స్  గ్రంథం అనువాదం ఏడు త‌రాలుగా తెలుగులోనూ ఉంది.), లియో ట్రాట్‌స్కీ, ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారి ర‌చ‌న‌ల‌తో పాటు విశ్వ విప్ల‌వ ధ్రువ‌తార చే గువేరా ర‌చ‌న‌లను చదివాడు. క్యూబా, బొలివియా పోరాటాల్లో భాగ‌స్వామి అయిన చే గువేరాను జార్జిరెడ్డి విప‌రీతంగా ఆరాధించాడు. ఆయ‌న తెగువ‌, సాహ‌సం.. విప్ల‌వంపై చేగువేరా అంకిత‌భావం జార్జిరెడ్డి మ‌న‌స్సుపై చెర‌గ‌ని ముద్ర‌వేశాయి.

మార్క్సిజం వైపు అడుగులు

ఏడాది ర‌స్టికేష‌న్ అనంత‌రం తిరిగి యూనివ‌ర్సిటీకి హాజ‌రై ప‌రీక్ష‌లు రాశాడు. అప్పుడే ఫిజిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చింది. అప్పుడు రాసిన ప‌రీక్ష పేప‌ర్లు చూసే బొంబాయి ప్రొఫెస‌ర్ హైద‌రాబాద్ వ‌చ్చారు. అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేని జార్జిరెడ్డిలో విప‌రీత‌మైన పుస్త‌క అధ్య‌య‌నంతో మార్స్కిజం వైపు మ‌న‌సు మ‌ళ్లింది. నాడు అధికార కాంగ్రెస్‌లో యువ నేత‌లుగా ఉన్న చంద్ర‌శేఖ‌ర్ (మాజీ ప్ర‌ధాన‌మంత్రి), కృష్ణ‌కాంత్ (మ‌న ఉమ్మ‌డి రాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్‌, మాజీ ఉప రాష్ట్రప‌తి), మోహ‌న్ ధారియాలు యంగ్ ట‌ర్క్‌లుగా ప్ర‌సిద్ధులు. కాంగ్రెస్ పాత వాస‌న‌లు వీడాల‌ని, సోవియ‌ట్ ర‌ష్యాలో మాదిరే ప్ర‌భుత్వ రంగాన్ని బ‌లోపేతం చేయాల‌ని, పేద ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాటి ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీతో వాదిస్తుండేవారు. త‌న అభిప్రాయాలు పేద ప్ర‌జ‌ల ప‌క్ష‌మే కావ‌డంతో జార్జిరెడ్డి ఈ యంగ్ ట‌ర్క్‌ల వైపు ఆక‌ర్షితుడ‌య్యాడు.

కానీ కాంగ్రెస్‌లోని పాత నేత‌ల‌కు ఎస‌రు పెట్ట‌డానికి ఇందిరా గాంధీ సృష్టించిన ఓ వర్గం ఈ యంగ్‌ట‌ర్క్స్ అని తరువాత జార్జిరెడ్డి భావించాడు. మార్స్కిజం వైపు మ‌రింత‌గా ఆక‌ర్షితుడ‌య్యాడు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో మార్స్కిజం-లెనినిజం ఆలోచ‌న‌ల‌ను వ్యాప్తి చేయ‌డం ప్రారంభించాడు. ఈ క్ర‌మంలో ప‌ల్లెల నుంచి వ‌చ్చిన యువ‌కుల‌ను కూడ‌గ‌ట్ట‌డం, యూనివ‌ర్సిటీలో పెత్తందారీ పోక‌డ‌ల‌ను వ్య‌తిరేకించ‌డం, పాల‌క‌వ‌ర్గాల తీరును ఎండ‌గ‌ట్ట‌డం ప్రారంభించాడు. ఇది ప్రత్యర్థులకు కంట‌గింపుగా మారింది.

చావుతో చెల‌గాటం..

1967 నాటికి ప‌ల్లెల నుంచి వ‌చ్చిన యువ‌త ఉస్మానియా యూనివ‌ర్సిటీకి చ‌దువుల‌కు చేర‌డం ప్రారంభ‌మైంది. అయితే అప్పటికే సమాజంలో పలుకుబడి, రాజకీయ ప్రాబల్యం కలిగి యూనివర్శిటీల్లో చదువుతున్న వారి చేతుల్లో సాధారణ పల్లె యువత అవమానాలకు గురైంది. ప‌ల్లెల నుంచి చ‌దువుకోవ‌డానికి వ‌చ్చిన రైతు కుటుంబాలు, వెనుక‌బ‌డిన కులాలు, ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల‌ను, అప్పుడ‌ప్పుడే చ‌దువుకు ముందుకు వ‌చ్చిన అమ్మాయిల‌ను హేళ‌న చేయ‌డం, అవ‌మానించ‌డం.. ఎదురుమాట్లాడితే చిత‌క‌బాదుతూ ఈ పలుకుబడి వర్గం ఇష్టారాజ్యంగా ప్ర‌వ‌ర్తించేది.

వీరికి యూనివ‌ర్సిటీ పాల‌క‌వ‌ర్గ స‌భ్యులు, అభ్యుద‌య వాస‌న‌లు గిట్ట‌ని ప్రొఫెస‌ర్లు వ‌త్తాసుగా నిలిచేవారు. అన్యాయాన్ని స‌హించ‌ని జార్జిరెడ్డి వీటికి వ్య‌తిరేకంగా ఉద్య‌మించ‌డం మొద‌లుపెట్టాడు. అద్బుత‌మైన వాగ్ధాటి, అత్యంత ధైర్య‌సాహ‌సాలు క‌ల్గిన జార్జిరెడ్డి త‌మ ముందు నిల‌వ‌డంతో పలుకుబడి వర్గం, విద్యార్థి సంఘాల ముసుగులో ఉన్న విచ్చిన్నకర శక్తులకు కంట‌గింపుగా మారింది.

లొంగని జార్జిరెడ్డి

తొలుత వారంతా జార్జిరెడ్డిని కులం పేరుతో, అగ్ర‌వ‌ర్ణాల సెంటిమెంట్‌తో లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశారు. కులం, మ‌తాల‌ను ఏ మాత్రం విశ్వ‌సించ‌ని జార్జిరెడ్డి ఆ ప్ర‌య‌త్నాన్ని తోసిపుచ్చాడు. వారు భౌతిక దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. కానీ కిక్‌బాక్సింగ్‌, చైన్ పోరాటంలో ఆరితేరిన జార్జి ఆ దాడుల‌ను తిప్పికొట్టాడు. జార్జిరెడ్డిపై దాడి చేసి త‌ప్పించుకోవ‌డం సాధ్యంకాద‌నే విష‌యం వారికి అర్ధ‌మైపోయింది. మ‌రోవైపు జార్జి  యూనివ‌ర్సిటీలో ఆగ‌డాల‌ను ఎదురించే క్ర‌మంలో ప్ర‌గ‌తిశీల ప్ర‌జాస్వామ్య విద్యార్థులు (పీడీఎస్‌) పేరుతో ప‌లు ఆందోళ‌న‌లు చేశాడు. ప‌లు క‌ర‌ప‌త్రాలు ప్ర‌చురించేవాడు.

పేద ప్రజల సమస్యలపై పోరాటం

త‌ర్వాత త‌న ఆందోళ‌న‌ల‌ను న‌గ‌రంలోని పేద ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల వైపు మ‌ళ్లించాడు. దాంతో యూనివ‌ర్సిటీలో ప్ర‌త్య‌ర్ధి శక్తులకే కాక నాటి హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాజ‌కీయ శ‌క్తుల‌కు సింహ‌స్వ‌ప్నంగా మారాడు. ఈ క్ర‌మంలోనే ఉస్మానియా యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ ఎన్నిక‌ల్లో జార్జిరెడ్డి బ‌ల‌ప‌ర్చిన విద్యార్థి సంఘం ఘ‌న విజ‌యం సాధించింది.

ఆ త‌ర్వాత ఇంజినీరింగ్ క‌ళాశాల ఎన్నిక‌లు వ‌చ్చాయి. దాంట్లోనూ జార్జిరెడ్డి ప్రభావం కనిపించే సూచ‌న‌లు స్పష్టమవడంతో జార్జిరెడ్డి వ్యతిరేక శక్తులు అతడిని ఖ‌తం చేయాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాయి.

ఈ క్ర‌మంలోనే 1972 ఫిబ్ర‌వ‌రి ఏడున హైద‌రాబాద్‌లోని డీడీ కాల‌నీలో ఒక‌సారి ప‌దుల సంఖ్య‌లో వ్యతిరేక శక్తులు జార్జిపై మూకుమ్మ‌డిగా దాడి చేశాయి. త‌న కిక్‌బాక్సింగ్ పంచ్‌లు, త‌న వ‌ద్ద ఉన్న ఆరు అంగుళాల క‌త్తితో ప‌దుల సంఖ్య‌లో ఉన్న వారిని జార్జి ఎదుర్కొన్నాడు. దాడికి వ‌చ్చిన వారంతా పారిపోయారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఒంట‌రిగా వెళ్లొద్ద‌ని స్నేహితులు జార్జికి సూచించారు. వాటిని జార్జి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ప్రాణాలు విడిచేంతవరకు పొడిచి చంపారు

కొద్దిరోజుల త‌ర్వాత (ఏప్రిల్ 14) యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోని ఓ చెట్టు కింద ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న‌జార్జి వ‌ద్ద‌కు ఓ యువ‌కుడు ప‌రుగెత్తుకొని వ‌చ్చాడు. అత‌ను జార్జి మ‌ద్ద‌తు ఇచ్చిన విద్యార్ధి సంఘం త‌ర‌పున ఇంజినీరింగ్ కాలేజీ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డిన వ్యక్తి. ఇంజినీరింగ్ కాలేజీ వెనుక 30 మందికిపైగా రౌడీలు ఉన్నార‌ని… ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకోమ‌ని బెదిరించార‌ని చెప్పాడు. ఆ వెంట‌నే జార్జి ఇంజినీరింగ్ క‌ళాశాల వెన‌క్కు వెళ్లాడు. వారితో ఆ విష‌య‌మై చ‌ర్చించాల‌నేది అత‌ని ఉద్దేశం. కానీ అప్ప‌టికే అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న ఆ రౌడీలు, వ్యతిరేక శక్తులు రాడ్ల‌తో జార్జిపై దాడికి దిగారు.

చాలాసేపు ఒంట‌రిగా ఎదురించిన జార్జి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. జార్జి ప్రాణాలు విడిచేంతవరకు పొడిచి వారంతా పారిపోయారు. జార్జి హ‌త్య‌తో హైద‌రాబాద్ న‌గ‌రం మొత్తం క‌దిలిపోయింది. విద్యార్థులు హింస‌కు దిగుతార‌నే భ‌యంతో పోలీసులు క్యాంప‌స్‌ను చుట్టుముట్టారు. నాయ‌కులు, నేత‌లు షరామామూలుగా నివాళులు అర్పించారు.

నోబెల్ సాధిస్తాడ‌నుకున్న ఓ మేధావి విచ్ఛిన్న‌క‌ర శక్తుల అరాచ‌కానికి అలా బ‌లైపోయాడు. ఇందులో కొస‌మెరుపు ఏమిటంటే జార్జి ఇంజినీరింగ్ క‌ళాశాల ఎన్నిక‌ల్లో నిలిపిన విద్యార్ధే ప్ర‌త్య‌ర్ధుల‌కు లొంగిపోయి న‌మ్మ‌క ద్రోహిగా మారిపోయాడ‌నే భావ‌న నాటి విద్యార్థుల్లో బ‌లంగా ఉంది. అత‌నే న‌మ్మించి జార్జిరెడ్డిని రౌడీల వ‌ద్ద‌కు తీసుకెళ్లాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. జార్జిరెడ్డి హ‌త్య క్యాంప‌స్‌లోని పోలీస్ క్యాంప్ స‌మీపంలోనే జ‌రిగినా పోలీసులు స్పందించ‌లేదని, కోర్టులో ప్రాసిక్యూష‌న్ బ‌ల‌మైన ఆధారాలు చూప‌లేదని అప్పటి విద్యార్థులు భావించారు. ఆయన హత్యోదంతంపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్, సీపీఐ, సోషలిస్టు నేతలు, పదుల సంఖ్యలో ఎంపీలు, అప్పటి ప్రధాన మంత్రిని అభ్యర్థించారు. వేలాది సంఖ్యలో యువత జంటనగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.

47 ఏళ్లు అయినా…

జార్జి రెడ్డి హ‌త్య జ‌రిగి 47 ఏళ్ళు అయినా ఇప్ప‌టికీ ప్ర‌గతిశీల పోరాటాల‌కు చుక్కానిగానే ఉన్నాడు. చేగువేరాను అభిమానించిన జార్జిరెడ్డిని హైద‌రాబాద్ చేగువేరాగా నాటి విద్యార్ధులు పిలిచేవారు. జార్జిరెడ్డి ప్రారంభించిన ప్ర‌గ‌తిశీల ప్ర‌జాస్వామ్య విద్యార్థుల బృంద‌మే త‌ర్వాత ప్ర‌గ‌తిశీల ప్ర‌జాస్వామ్య విద్యార్థి సంఘానికి (పీడీఎస్‌యూ)కు పునాది అయింది. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్ర‌గ‌తిశీల పోరాటాల‌కు నిల‌యంగా మార‌డానికి జార్జిరెడ్డి ఆలోచ‌న‌లు.. ఆయ‌న పోరాటాలే కార‌ణం.

జార్జిరెడ్డి జీవితం స్ఫూర్తిగా ఇప్పటికే పలు సినిమాలు, పుస్తకాలు వెలువడ్డాయి. పబ్లిషర్ గీతా రామస్వామి ’జీనా హైతో మర్ నా సీకో: ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జిరెడ్డి‘ పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. ’జీనా హై తో మర్ నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్ నా సీకో..‘ ఈ నినాదం జార్జిరెడ్డిదే. ప్రతి ప్రగతి శీల ఉద్యమంలో వినిపించే నినాదం.

తాజాగా ఆయన పేరుతోనే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రాబోతున్న నేపథ్యంలో జార్జిరెడ్డి గురించి పాటకులకు అందిస్తున్న కథనం ఇది..

– డియర్అడ్మిన్ బ్యూరో 

ఇవి కూడా చదవండి

Exit mobile version