బ్రెగ్జిట్ (Brexit).. ఈ మధ్య కాలంలో ఓ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసిన పదం మరొకటి ఉండదేమో. ఏకంగా ముగ్గురు ప్రధానులను గద్దె దింపిన చరిత్ర ఈ బ్రెగ్జిట్‌ది. యురోపియన్ యూనియన్ నుంచి యూకే వెళ్లిపోవడాన్నే బ్రెగ్జిట్‌గా పిలుస్తున్నారు. బ్రిటిష్ ఎగ్జిట్‌కు ఇది సంక్షిప్త రూపం.
దాదాపు మూడేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది. ముగ్గురు ప్రధానులు తమ పదవులు కోల్పోయారు. ఈ ఏడాది అక్టోబర్ 31 అర్ధరాత్రి యురోపియన్ యూనియన్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ విడిపోవాల్సి ఉంది.
అయితే అసలు ఏంటి ఈ బ్రెగ్జిట్? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? యురోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ ఎందుకు నిర్ణయించింది? బ్రెగ్జిట్ డీల్ కుదరకుండా ఇన్నాళ్లూ సాగుతూ ఉండటానికి కారణం ఏంటి?
బ్రెగ్జిట్ వల్ల యూకే, ఈయూ, ఇతర ప్రపంచ దేశాలపై పడే ప్రభావం ఏంటి? అసలు బ్రిటన్‌లో ఏం జరుగుతోంది? ఈ అంశాలపై డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న సమగ్ర కథనం ఇది.
బ్రెగ్జిట్ ఎక్కడి నుంచి వచ్చింది?
యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోవడాన్నే సంక్షిప్తంగా మనం బ్రెగ్జిట్ అంటున్నాం. కానీ తొలిసారి ఈ పదాన్ని వాడింది ఎవరో తెలుసా? ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం.. ఈ పదం సృష్టికర్త పీటర్ వైల్డింగ్. బ్రిటిష్ ఇన్‌ఫ్లుయెన్స్ అనే మేధావుల సంఘాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఈయన.
యూకే ఎట్టి పరిస్థితుల్లోనూ యురోపియన్ యూనియన్‌తో కలిసి ఉండాలని గట్టిగా కోరుకున్న వ్యక్తి. ఈయూ నుంచి యూకే విడిపోవాలా వద్దా అన్నదానిపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని 2012లో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ నిర్ణయించారు.
దీనికి ఎనిమిది నెలల ముందే వైల్డింగ్.. బ్రెగ్జిట్ అన్న పదాన్ని తొలిసారి వాడారు.
బ్రెగ్జిట్ ఎందుకు?
యురోపియన్ యూనియన్ అన్నది 28 దేశాల సమూహం. ఈ దేశాల్లోని ప్రజలు ఏ దేశం నుంచి ఏ దేశానికైనా స్వేచ్ఛగా వెళ్లి రావచ్చు. ఓ దేశ పౌరుడు.. మరే దేశంలోనైనా పని చేయొచ్చు. ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కూడా జరుగుతుంది.
ఈ సమూహంలో యూకే 1973లో చేరింది. అయితే ఈయూలో చేరడం వల్ల యునైటెడ్ కింగ్‌డమ్‌కు నష్టమే తప్ప లాభం జరగలేదని అక్కడి పౌరులు భావిస్తున్నారు. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఇతర యురోపియన్ యూనియన్ దేశాల పౌరుల వలస ఎక్కువైంది. ఇక్కడి ఉద్యోగాలన్నీ వాళ్లే ఎగరేసుకుపోతున్నారని యూకే ప్రజలు భావించడం మొదలుపెట్టారు.
దీంతో బ్రెగ్జిట్‌పై నిర్వహించిన రెఫరెండమ్‌లో.. ఈయూ నుంచి విడిపోవాలని కోరుకున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. 52 శాతం మంది అంటే.. కోటి 74 లక్షల మంది బ్రెగ్జిట్‌కు అనుకూలంగా.. 48 శాతం మంది అంటే కోటి 26 లక్షల మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.
2016, జూన్ 23న ఈ రెఫరెండమ్ నిర్వహించారు. బ్రెగ్జిట్ వద్దని కోరుకున్న అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రజాభిప్రాయాన్నిగౌరవిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన తర్వాత థెరెసా మే ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
ఇంకా ఎందుకు విడిపోలేదు?
యురోపియన్ యూనియన్‌లో చేరిన ఏ దేశమూ ఇప్పటి వరకు విడిపోలేదు. ఒకవేళ బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయితే.. ఈయూ నుంచి బయటకు వచ్చేసిన తొలి దేశంగా యూకే నిలుస్తుంది. రెఫరెండమ్ తర్వాత 2017లోనే అప్పటి ప్రధాని థెరెసా మే ఈ విడిపోయే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
లిస్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50 ప్రకారం ఈ విడిపోయే ప్రక్రియ జరుగుతుంది. ఇది మొదలైన తర్వాత సరిగ్గా రెండేళ్లకి సదరు దేశం ఈయూ నుంచి విడిపోవాలి. ఈ గడువు ఐదు నెలల కిందటే ముగిసినా యూకే మాత్రం ఇంకా విడిపోలేదు.
ఎందుకంటే ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఈయూకి, యూకేకి మధ్య ఓ ఒప్పందం కుదరాలి. ఇప్పటికే ఆ ఒప్పందం కుదిరింది. కానీ బ్రిటన్ పార్లమెంట్ దానిని మూడుసార్లు తిరస్కరించింది.
ఏంటా ఒప్పందం?
ఈయూ నుంచి బ్రిటన్ అధికారికంగా విడిపోవడానికి చేపట్టాల్సిన ప్రక్రియ, విడిపోయిన తర్వాత యూకే, ఈయూ మధ్య సంబంధాలపై ఈ ఒప్పందం జరిగింది. ఇందులో ఇంకా చాలా అంశాలే ఉన్నాయి.
-
యూకేలోని ఈయూ పౌరుల హక్కులు.. అలాగే ఈయూలో ఉన్న బ్రిటన్ పౌరుల హక్కులను కాపాడాలి.
-
యురోపియన్ యూనియన్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఎంత డబ్బు చెల్లించాలి?
-
ఐరిష్ బోర్డర్‌లో బ్యాక్‌స్టాప్
ఈ ఒప్పందంలోని చివరి అంశంపైనే యూకే పార్లమెంట్ అభ్యంతరం చెబుతోంది. ఇటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలైనా, అటు ప్రతిపక్ష డెమొక్రటిక్ యూనియన్ పార్టీ ఎంపీలైనా ఈ బ్యాక్‌స్టాప్‌కు అడ్డు చెబుతున్నారు. ఈ అంశంపైనే అధికార కన్జర్వేటివ్ ఎంపీ ఫిలిప్ లీ.. ప్రతిపక్ష పార్టీలో చేరారు. దీంతో ప్రభుత్వం మెజార్టీ కోల్పోవాల్సి వచ్చింది.
అసలేంటీ బ్యాక్‌స్టాప్
అసలు సమస్యకు కారణమైన ఈ బ్యాక్‌స్టాప్ ఏంటో ఓసారి చూద్దాం.. ప్రస్తుతం బ్రిటన్ ఆధీనంలో ఉన్న నార్తర్న్ ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ సరిహద్దుల మధ్య ఎలాంటి చెక్‌పోస్టులూ లేవు. ఈ సరిహద్దు పొడువు 310 మైళ్లు. యూకేని, ఇతర ఈయూని కలిపే ఏకైక భూ సరిహద్దు ఇదే. ఇప్పుడు యూకే, ఐర్లాండ్ రెండూ ఈయూలో ఉండటం వల్ల ఈ రెండు దేశాల మధ్య ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం కూడా జరుగుతోంది. కానీ ఒకసారి ఈయూ నుంచి యూకే విడిపోతే ఈ పరిస్థితి ఉండదు. నార్తర్న్ ఐర్లాండ్‌కు పూర్తిగా భిన్నమైన నిబంధనలు ఉంటాయి.
అప్పుడు యూకే నుంచి ఐర్లాండ్‌కు, ఐర్లాండ్ నుంచి యూకేకు వస్తువుల రవాణా జరగాలంటే సరిహద్దులో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుంది. ప్రస్తుతం ఈయూలో లేని నార్వే, ఈయూలో ఉన్న స్వీడన్ మధ్య ఇలాంటి చెక్ పోస్ట్‌లు ఎన్నో సమస్యలకు దారి తీస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఐరిష్ బోర్డర్ బ్యాక్‌స్టాప్‌కు బ్రిటన్ ప్రభుత్వం, ఈయూ నేతలు తెరతీశారు. దీని ప్రకారం.. యూకే, ఈయూ మధ్య శాశ్వత వాణిజ్య ఒప్పందం కుదిరే వరకు.. సరిహద్దులో ఎలాంటి చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దీనిపైనే అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు తాత్కాలికమే అని చెబుతున్నా.. భవిష్యత్తులో యూకేను పూర్తిగా ఇందులో ఇరికిస్తారేమోనని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందం కుదరకే ఇంతకుముందు పీఎం థెరెసా మే పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె తర్వాత ప్రధాని పీఠం ఎక్కిన బోరిస్ జాన్సన్.. ఈ సమస్యకు టెక్నాలజీ పరిష్కారం ఉందని చెబుతున్నారు. భౌతికంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకుండా.. సరిహద్దు దాటే రవాణా వాహనాలకు మైక్రోచిప్‌లు ఏర్పాటు చేయడం, ఇతర మొబైల్ టెక్నాలజీ సాయంతో వాటిపై ఓ కన్నేసి ఉంచవచ్చని జాన్సన్ సూచించారు.
ఒప్పందం లేకుండా సాధ్యమేనా?
యూకే, ఈయూ మధ్య ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా.. 2019, అక్టోబర్ 31న బ్రిటన్ విడిపోవాల్సిందేనని ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ అంటున్నారు. అది జరగాలంటే బ్యాక్‌స్టాప్‌ను ఒప్పందం నుంచి తీసేయాలి. కానీ దీనికి ఈయూ అంగీకరించడం లేదు.
ఎలాంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్‌కు తాత్కాలికంగా కొంత కాలం వరకు ఇబ్బందులు ఎదురవుతాయి. నిత్యావసర వస్తువులు కూడా ఆగిపోతాయి.
బ్రిటన్ వస్తువులు ఈయూలోకి వెళ్లాలంటే తనిఖీలు పూర్తి చేసుకోవాలి. దీనివల్ల రవాణా ఆలస్యమవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుంది. ఇందుకు అన్ని విధాల సిద్ధపడి నో డీల్ బ్రెగ్జిట్‌కు ముందడుగు వేయాల్సి ఉంటుంది.
దీనికోసం అవసరమైన నిధులను సిద్ధంగా ఉంచి నో డీల్ బ్రెగ్జిట్‌కు వెళ్లాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు. కానీ ఎంపీలు మాత్రం అలా కుదరనే కుదరదని తేల్చి చెబుతున్నారు. అవసరమైతే బ్రెగ్జిట్‌ను రద్దు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. దీంతో యూకేలో ఏం జరుగుతుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఇవి కూడా చదవండి