ఆపద వచ్చినప్పుడు షాక్‌లో ఉండిపోతాం. ఏం చేయాలో పాలుపోదు. 108 అంబులెన్స్ అప్పట్లో వైఎస్సార్ హయాంలో ఒక పెద్ద అండ. డయల్ చేయగానే ప్రాణాలు నిలిచినంత హామీ. క్రమంగా అన్ని రాష్ట్రాలు దానిని అమలు చేసినా.. ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలు నిర్వహణ భారం పేరుతో మూలన పడేశాయి.
కానీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌కు తెలియని వీధి ఏముంది? తెలియని బాధ ఏముంది? వినని గోడు ఏముంది? నేను విన్నాను.. నేనున్నాను.. అంటూ వచ్చిన తొలి ఏడాదిలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన పెద్ద మనసు. ఎన్నికల వరకు వెయిట్ చేయించిన రాజకీయ నాయకుడని అందరూ అనుకున్నారు. హా.. డబ్బులే లేవు కదా.. ఇవన్నీ నెరవేరేనా అన్న పెదవి విరుపులు.
సంక్షేమ బాట చూపిన వైఎస్సార్ వారసుడిగా.. పేదల కష్టం తెలిసిన పెద్దన్నగా జగన్ మళ్లీ 108, 104 వాహనాలను ఏకాదశి పండగ రోజున రోడ్డుపైకి తెస్తున్నాడు. ఓదార్పు యాత్రలో, పాదయాత్రలో జగన్ ప్రతిసారి గుర్తు చేసిన మాట కుయ్..కుయ్…కూత. ఇప్పుడు ఆ వాహనాలకు కొత్త హంగులతో, ఆధునాతన సౌకర్యాలతో తెస్తున్నాడు.
పట్టణమైతే 15 నిమిషాలు, పల్లె అయితే 20 నిమిషాల్లో 108 వాహనం ఆపదలో ఉన్న వారి వద్దకు చేరుకోవాలన్నదే టార్గెట్. ఏజెన్సీ ప్రాంతాలైతే గరిష్టంగా అరగంటలో చేరేలా ప్లాన్ చేశారు. ఒకేసారి 1068 ఆంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ప్రారంభించనున్నారు. ప్రతి మండలంలో ఒక 108, ఒక 104 అంబులెన్సు సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
కొత్తగా సిద్ధం చేసిన 412 వాహనాల్లో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్‌ఎస్)కు సంబంధించినవి. మరో 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టు (ఏఎల్‌ఎస్)తో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
108 లో అత్యాధునిక వెంటిలేటర్లు కూడా..
బీఎల్‌ఎస్ అంబులెన్సులలో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఏఎల్‌ఎస్ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇక నియో నేటల్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు.
వేగంగా ట్రాక్ చేసేలా
ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేశారు. ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రతి అంబులెన్సులో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునేలా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
104 సర్వీసులు సరికొత్తగా..
కొత్తగా 656 మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం హెల్త్ కేర్ డెలివరీ విధానంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి 656 సర్వీసులను సిద్ధం చేశారు.
మందులు ఉచితం..
ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎంతో పాటు, ఆశా వర్కర్ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో అనుసంధానమై పని చేసే ఎంఎంయూలు మారుమూల గ్రామాలలో సైతం శరవేగంగా వైద్య సేవలందించనున్నాయి. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సదుపాయాలు కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు.
ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఏర్పాటు చేశారు. ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, ఇంకా రోగులకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగులకు సంబంధించి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు (ఈహెచ్‌ఆర్) జనరేట్ అవుతుంది.
20 రకాల సేవలు
మాతా శిశు మరణాలు నివారించడంతో పాటు, చిన్నారుల ఆరోగ్యం కాపాడడం, వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడడం, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని సీజన్లలో ప్రబలే అంటువ్యాధులు నివారించడం, కుగ్రామాలలో నివసించే వారికి కూడా అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తూ, మొత్తం 20 రకాల సేవలందించడం కోసం 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ, ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, ఈ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఏయే సర్వీసులు ఎన్నెన్ని?
108, 104 సర్వీసులు మొత్తం 1068 వాహనాల కోసం ప్రభుత్వం రూ. 200.15 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్సులతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ. రూ. 318.93 కోట్లు ఖర్చు కానుంది. మొత్తం 744 మంది వైద్యులు 104 వాహనాలు సేవలు అందిస్తారు. 104 సర్వీసులు మండాలనికొకటి చొప్పున 676 అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రతి రోజూ 40,560 మందికి సేవలు అందిస్తాయని, ఏటా ఏకంగా 1.45 కోట్ల రోగులకు వైద్య సేవలందిస్తాయని అంచనా.
డాక్టర్ వైయస్సార్ రహదారి భద్రత – 108 సర్వీస్ ద్వారా
108 అంబులెన్సు సర్వీసులకు కొత్తగా ప్రారంభిస్తున్న డాక్టర్ వైయస్సార్ రహదారి భద్రత కార్యక్రమాన్ని లింక్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి దీని ద్వారా ఆస్పత్రులలో ఉచితంగా వైద్య సేవలందిస్తారు. రెండు రోజుల పాటు లేదా గరిష్టంగా రూ. 50 వేల వ్యయం వరకు ఆ వైద్య సేవలందిస్తారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.