Akshaya tritiya: అక్షయ తృతీయ 2022 మే 3న వస్తోంది. అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుతారు. దీనిని అఖా తీజ్‌తో సహా రకరకాల పేర్లతో పిలుస్తారు. ‘అక్షయ’ అంటే క్షయం లేనిది, అంతం లేనిది అని అర్థం. కాబట్టి, అక్షయ తృతీయ 2022 ప్రతి ఒక్కరికీ శాశ్వతమైన శ్రేయస్సు, ఆశీర్వాదం, ఆనందం, విజయాన్ని ఇస్తుంది.
Akshaya tritiya: అక్షయ తృతీయ రోజు ఏం చేస్తారు?
అక్షయ తృతీయ రోజు దానాలు, యజ్ఞం తదితర శుభ కార్యాలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు పొందుతాడని నమ్ముతారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో శ్రేయస్సు, ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు. లక్ష్మీ దేవి తన ఆశీర్వాదాలను కూడా అందిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు.
Akshaya tritiya muhurtam: అక్షయ తృతీయ ముహూర్తం.. పూజావిధానం
అక్షయ తృతీయను వైశాఖ మాసం తృతీయ తిథి పూర్వాహన్ కాల సమయంలో జరుపుకుంటారు. తృతీయ తిథి వరుసగా 2 రోజులు ఉంటే.. రెండో రోజు పండగ జరుపుకొంటారు. రోహిణి నక్షత్రంతో పాటు సోమవారం లేదా బుధవారం తృతీయ సంభవించినట్లయితే శుభఫలితాలు అపారంగా ఉంటాయని విశ్వసిస్తారు.
ఈ పండగ రోజు పూజ చాలా సులువుగా చేయొచ్చు. ఆ రోజు ఉపవాసం పాటించేవారు ఉదయాన్నే పసుపు రంగు దుస్తులు ధరించి సిద్ధంగా ఉండాలి. ఇంట్లో విష్ణువు విగ్రహాన్ని గంగాజలంలో స్నానం చేయించి, తులసి, పసుపు పూల మాల లేదా పసుపు పువ్వులను సమర్పించాలి. ధూపం, నెయ్యి వత్తి దీపం వెలిగించి కూర్చోవాలి. విష్ణు సహస్రనామం, విష్ణు చాలీసా వంటి విష్ణువుకు సంబంధించిన గ్రంథాలను పఠించాలి. పూజతోపాటు దానాలు చేస్తే లేదా అవసరమైన వారికి ఆహారం అందిస్తే అది గొప్ప ఫలితాలను ఇస్తుంది.
పురాణాల ప్రకారం నర-నారాయణుడు, పరశురాముడు, హయగ్రీవుడు ఈ రోజు అవతరించారు. అందుకే కొంతమంది ఈ దేవుళ్లకు గోధుమలు లేదా బార్లీ, నానబెట్టిన శనగ పప్పును సమర్పిస్తారు.
Akshaya tritiya significance: పురాణం అక్షయ తృతీయ గురించి ఏం చెబుతోంది?
యుధిష్ఠిరుడు పండగ ప్రాముఖ్యతను తెలుసుకోవాలనుకుంటున్నట్లు శ్రీకృష్ణుడిని కోరుతాడు. ఇది చాలా పవిత్రమైన రోజు అని కృష్ణుడు చెబుతాడు. ఈ రోజు మధ్యాహ్నానికి ముందు స్నానమాచరించి జప, తప, హోమ, యజ్ఞ, శాస్త్రాధ్యయనం, పితృ తర్పణం, దానాలు మొదలైనవి చేస్తే మహత్తరమైన పుణ్యఫలం లభిస్తుందని చెబుతాడు. పూర్వకాలంలో దేవతలపై విశ్వాసం ఉన్న ఒక పేదవాడు, ధర్మవంతుడు ఉండేవాడు. పేదరికంలో ఉన్నందున అతడి ఆందోళన చూసి ఓ వ్యక్తి ఈ పండగ రోజు వ్రతం చేయాలని సూచిస్తాడు. దీంతో ఈ వ్రతాన్ని చాలా ఆచారబద్ధంగా ఆచరించాడు. ఈ వ్యక్తి తరువాతి జన్మలో కుశావతికి రాజు అయ్యాడు.
Akshaya tritiya importance: అక్షయ తృతీయ పండగ ప్రాముఖ్యత ఏంటి?
సంవత్సరంలో మూడున్నర శుభ ముహుర్తాలుగా పరిగణించే రోజుల్లో ఈ పండగ కూడా ఒకటి. గంగాస్నానానికి కూడా ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగాస్నానం చేసిన వ్యక్తికి ప్రతికూలతలు తొలగుతాయి. ఈ రోజున పితృ శ్రాద్ధం చేయవచ్చు. బార్లీ, గోధుమలు, శనగలు, పెరుగు, బియ్యం, పాలతో చేసిన వస్తువులు మొదలైన వాటిని పూర్వీకుల పేరిట దానం చేయాలి. ఆ తర్వాత పూజారికి ఆహారం అందించాలి. ఈ రోజు బంగారం కొనడం శుభప్రదమని కూడా కొందరు నమ్ముతారు. పరశురాముడు, హయగ్రీవుడు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగం కూడా అదే రోజున ప్రారంభమైందని చెబుతారు. ఇదే రోజు బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ పండుగ చాలా పవిత్రమైనదిగా, ఫలవంతమైనదిగా పరిగణిస్తారు.