Home న్యూస్ పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు వివాదాస్పదమైంది?

పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు వివాదాస్పదమైంది?

citizenship ammendment act
దేశ సరిహద్దుకు ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్)  వివాదాస్పదమై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అసలు ఈ చట్టం ఎందుకు వివాదాస్పదమైంది? దీనిపై వచ్చిన విమర్శలు ఏంటి? ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వంటి అంశాలను సులువుగా ‘డియర్‌ అర్బన్‌ డాట్‌ కామ్‌’ మీకు అందిస్తోంది.

పౌరసత్వ సవరణ చట్టం అంటే

  • భారత పౌరసత్వ చట్టం –1955ని సవరిస్తూ పార్లమెంటు తెచ్చిన చట్టం ఇది.
  • పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి వచ్చే హిందు, క్రిస్టియన్, జైన్, బుద్దిస్ట్, సిక్, పార్శీ మతాల వారు (ముస్లింలను మినహాయించి) ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వచ్చి భారత దేశ పౌరసత్వాన్ని కోరితే వారికి మన దేశ పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన చట్టం ఇది.
  • అక్రమంగా వలస వచ్చిన వారు ఆరేళ్లపాటు ఇక్కడ నివసిస్తే వీరికి పౌరసత్వం ఇస్తారు. డిసెంబరు 31, 2014లోపు ఇలా వచ్చినవారందరికీ పౌరసత్వం ఇచ్చే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తుంది.
  • గతంలో ఉన్న నిబంధనల ప్రకారం 12 ఏళ్ల వ్యవధిలో చివరి 11 నెలలు భారతదేశంలోనే నివసించాలి. మొత్తంగా 11 ఏళ్లు భారతదేశంలో నివసించి ఉండాలి. కానీ ఇప్పుడు ఈ తాజా చట్ట సవరణ వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుంచి వచ్చే హిందు, క్రిస్టియన్, జైన్, బుద్దిస్ట్, సిక్, పార్శీ మతాల వారికి ఈ 11 ఏళ్ల నిబంధనను ఆరేళ్లకు కుదించారు.
  • తాజా పార్లమెంటు శీతాకాల (2019) సమావేశాల్లో పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారింది.
  • ఇది బిల్లు రూపంలో ఉన్నప్పుడు దీనిని సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు(సీఏబీ లేదా క్యాబ్‌)గా పిలిచారు. చట్టరూపం దాల్చిన తరువాత దీనిని సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌(సీఏఏ)గా పిలుస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం ఏమంటోంది?

’పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ ఈ మూడూ ఇస్లామిక్‌ దేశాలు. ఆయా దేశాల్లో ముస్లింలు మెజారిటీ మతస్తులు. ఇక్కడ మైనారిటీలు మతపరమైన వివక్షకు, హింసకు, దాడులకు గురవుతున్నారు. వారు అక్కడ జీవించలేని పరిస్థితుల నేపథ్యంలో భారత దేశానికి వలస వచ్చి జీవిస్తున్నారు. మనం వారికి పౌరసత్వం ఇవ్వాలి..’ అనేది కేంద్ర ప్రభుత్వ వాదన.

దీనికి తోడు ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద హిందూ దేశంగా ఉన్నందున ఈ మూడు ఇస్లామిక్‌ దేశాల్లో ఉన్న వారు భారదేశానికి రాకుండా ఇంకెక్కడికి వెళ్లగలరని హిందూ ధార్మిక సంస్థల వాదన. అలాగే దేశ విభజన జరిగిన నాడు హిందువులు, సిక్కులు పాకిస్తాన్‌లో ఉండగా.. వారు ఎంచుకున్న దేశం వారికి రక్షణ కల్పించలేదని, వారి దేశంలోనే వారు శరణార్థులుగా ఉండిపోయే పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ చట్టం తెచ్చామని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

సీఏఏపై విపక్షాల విమర్శలు ఏంటి?

  • ఆపదలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించడంలో మతాన్ని ప్రాతిపదికగా ఎలా ఎంచుకుంటారు? అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంపై మత వివక్ష ముద్ర పడదా?
  • ఈ చట్టం ద్వారా హిందు, క్రిస్టియన్, జైన్, బుద్దిస్ట్, సిక్, పార్శీ మతాల వారికి మాత్రమే పౌరసత్వం కల్పించనున్నారు. కానీ ముస్లింలకు పౌరసత్వం కల్పించరు. దీనినే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
  • శ్రీలంకలో ఉన్న హిందువులను ఎందుకు అనుమతించరు? అక్కడ తమిళులు వారి హక్కుల కోసం చేసిన పోరాటంలో ఊచకోతకు గురయ్యారు. వారికి కూడా పౌరసత్వం ఇవ్వొచ్చు కదా?
  • అలాగే మయన్మార్‌లో బౌద్ధులు మెజారిటీలు. అక్కడ రోహింగ్యాలు మైనారిటీలు. రోహింగ్యాలు దాడులకు గురయ్యారు. మరి వారిని ఎందుకు అనుమతించరు?
  • కేంద్రం చెబుతున్న ఇస్లామిక్‌ దేశాల్లో కూడా బోహ్రా, అహ్మదీయ తదితర ముస్లిం మతస్తులు కూడా మైనారిటీలుగా ఉన్నారు. వారిని ఎందుకు అనుమతించరు?అని బీజేపీయేతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
  • బంగ్లాదేశ్‌ నుంచి గతంలో ముస్లింలు కూడా పలు దాడులకు గురై మన దేశానికి వలస వచ్చారు. శ్రీలంక నుంచి పలు మతాల ప్రజలు మన దేశానికి వలస వచ్చారు. అందువల్ల వలసలను మతపరంగా చూడరాదని, ఇతర దేశాల్లో ప్రభుత్వాలు రక్షణ కల్పించలేని పరిస్థితిని మాత్రమే చూడాలని విపక్షాలు చెబుతున్నాయి.
  •  అన్ని మతాలను సమానంగా చూడాలన్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించడమే అవుతుందన్నది ఈ వర్గాల వాదన.
  •  భారతదేశం నుంచి వలస వెళ్లే హిందువులకు క్రైస్తవ మెజారిటీ దేశాలైన అమెరికా వంటి దేశాలు పౌరసత్వం నిరాకరిస్తే ఏంటి పరిస్థితి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ చట్టంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం రోజులుగా ఇక్కడ తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాల వాదన ఏంటంటే అసలు ఏ మతస్తులైనా ఇక్కడికి అనుమతించవద్దని చెబుతున్నాయి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా.. ఎవరూ కూడా వద్దని ఆక్షేపిస్తున్నాయి. ఇక్కడి హిందువులు కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం వల్ల పెద్ద ఎత్తున సాగే వలసలను తాము భరించజాలమని చెబుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో పొందుపరిచిన నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకూ ఈ చట్టం అనుమతించదు. అందువల్ల ఈ షెడ్యూలు ప్రాంతాల్లో అల్లర్లు లేవు. కానీ మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన అసోం గణ పరిషత్తు(ఏజీపీ) కూడా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది.

ఇవి కూడా చదవండి

యూకే స్టూడెంట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి?

ఎన్పీఆర్ అంటే ఏంటి?

Exit mobile version