Home న్యూస్ కల్లు గీత కార్మికులకూ రూ. 5 లక్షల బీమా సాయం.. కేసీఆర్ నిర్ణయం

కల్లు గీత కార్మికులకూ రూ. 5 లక్షల బీమా సాయం.. కేసీఆర్ నిర్ణయం

kcr
కల్లు గీత కార్మికులకు బీమా

రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తద్వారా.. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సిఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

మంగళవారం నాడు డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం లో ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వూహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నదని సిఎం అన్నారు.

ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమౌతున్నదని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా టైపులోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న, గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం అన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version