God father Movie OTT release date: మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ బంపర్ హిట్ కొట్టి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. అయితే సినిమా హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా సినీ అభిమానులు నేటి ఈ ఓటీటీ కాలంలో కొత్త మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తారు. గాడ్‌ఫాదర్ మూవీ కోసం కూడా అంతే ఆసక్తి నెలకొంది.
గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ రూ. 57 కోట్లు చెల్లించి తీసుకుందని టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గాడ్‌ఫాదర్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. నవంబరు 19నే గాడ్‌ఫాదర్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.
గాడ్‌ఫాదర్ మూవీ గురించి
ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చింది. చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. అలాగే సత్యదేవ్ కూడా ఇందులో కనబరిచిన నటనకు అటు అభిమానుల నుంచి ఇటు చిరంజీవి లాంటి మెగాస్టార్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.
మలయాళంలో లూసిఫర్ పేరుతో 2019లో వచ్చిన మూవీని తెలుగులో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ మూవీస్ సంస్థలు నిర్మించాయి.
ఇక కథ విషయానికి వస్తే అధికార జన జాగృతి పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పీకేఆర్ మరణిస్తారు. పీకేఆర్ కూతురును పెళ్లి చేసుకున్న జైదేవ్ (సత్యదేవ్) సీఎం పీఠం మీద కన్నేస్తాడు. డ్రగ్ మాఫియా, హవాలా స్కాములతో సంబంధం ఉన్న జైదేవ్‌కు సీఎం పీఠం దక్కకూడదని గాడ్‌ఫాదర్‌గా పేరున్న బ్రహ్మ అడ్డుకుంటాడు. ఈ మొత్తం కథలో అనేక మలుపులు ప్రేక్షలను కట్టిపడేస్తాయి. ఆచార్య వైఫల్యం తరువాత మెగాస్టార్‌కు మంచి విజయాన్ని ఇచ్చిన గాడ్‌ఫాదర్ తప్పక చూడాల్సిన మూవీ.
చిత్రంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్‌లతోపాటు తాన్యా రవిచంద్రన్, మురళీ వర్మ, సునీల్, షఫీ, సముద్రకని, మురళీ మోహన్, బ్రహ్మాజీ, దివి, సాయాజీ షిండే, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు.
అక్టోబరు 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిందీలో కూడా రిలీజైంది. ఇక అక్టోబరు 14న తమిళ్‌లో కూడా రిలీజైంది.
గాడ్‌ఫాదర్ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. మొత్తంగా రూ. 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.