స్పేస్‌ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ ప్రాజెక్టు ద్వారా ఇండియాలో కూడా 2022 నుంచి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్‌నెట్ సేవలు అందించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఫైబర్ ఆప్టికల్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలు అందుతున్నాయి. అయితే ప్రపంచంలో ఒక మూల నుంచి ఇంకో మూలకు డేటా చేరాలంటే 70 మిల్లీ సెకెండ్స్ వ్యవధి పడుతుందని, స్టార్‌లింక్ ఇంటర్‌నెట్ ద్వారా ఈ లేటెన్సీ 30 మిల్లీ సెకెండ్స్‌కు తగ్గుతుందని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్టార్ లింక్ ప్రాజెక్టు వెనక ఎలన్‌మస్క్ ఆలోచన ఇది..
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్ సిగ్నల్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన ఇంటర్‌నెట్ సేవలను అందించడమే స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్ ఆలోచన. ఇంటర్‌నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో లో లేటెన్సీ కనెక్టివిటీ అందించాలన్నది ఆయన సంస్థ లక్ష్యం.
లేటెన్సీ అంటే డేటా ఒక చోట నుంచి మరొక చోటకు బదిలీ అయ్యేందుకు పట్టే సమయం. దీనిలో సమయాన్ని తగ్గించడాన్నే లో లేటెన్సీ అంటారు.
అలాగే తక్కువ ధరలో నాణ్యమైన ఇంటర్‌నెట్ సేవలు అందించడం, కేవలం ఒక పిజ్జా బాక్స్ సైజ్‌లో ఉండే యాంటెన్నా సహాయంతో వినియోగదారులు ఇంటర్‌నెట్ డేటా పొందే వీలు కల్పించడం ఎలన్ మస్క్ ఆలోచనలు.
సరికొత్త ఇంటర్‌నెట్ విప్లవం..
ఇంటర్‌నెట్ కనెక్టివిటీ లేని మారుమూల గిరిజన ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో సైన్యానికి, సాధారణ ప్రజలకు ఇంటర్‌నెట్ సేవలు అందితే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అయినా, ప్రభుత్వ సేవలు అందడమైనా సులువవుతుంది. ఒకప్పుడు టెలిఫోన్ కావాలంటే ఏళ్లు తరబడి చూడాల్సిన రోజుల నుంచి.. ఇప్పుడు రెండు గంటల్లో మొబైల్ కనెక్షన్ చేతులోకి వచ్చేలా సాంకేతిక విప్లవం వచ్చింది. ఇక ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఇంటర్‌నెట్ సదుపాయం ఉంటే అనేక మౌలిక వసతుల కొరతను తీర్చినట్టవుతుంది.
మారుమూల పల్లెల్లో ఉండి కూడా ఐటీ జాబ్ చేయడం తేలికవుతుంది. మారుమూల పల్లెల్లో ఉండి కూడా స్టాక్‌మార్కెట్లో రియల్‌టైమ్ ట్రేడ్ చేయొచ్చు. ఆన్‌లైన్ వైద్యసేవలు అందించొచ్చు. ఒక్కటేంటి? ఊహకందనివి కూడా నిజమవుతాయి. దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు రూపొందుతోంది. ఫలితం కూడా అలాగే ఉండబోతోంది. మన దేశంలో పదేళ్ల కింద మొదలుపెట్టిన ఆప్టికల్ ఫైబర్‌నెట్ ఇప్పటికీ పూర్తికాకపోవడం గమనించాల్సిన అంశం.
స్టార్ లింక్ ప్రాజెక్టు ఇలా మొదలైంది..
2015లో స్పేస్‌ఎక్స్ కమ్యునికేషన్ శాటిలైట్ నెట్‌వర్క్ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఇందుకోసం వాషింగ్టన్‌లోని రెడ్‌మాండ్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేసింది. శాటిలైట్ల తయారీ, పరిశోధన ఇక్కడి నుంచే మొదలుపెట్టింది. తొలుత 2016లోగా రెండు ప్రొటోటైప్ శాటిలైట్లను ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాలనుకుంది.
2020లోగా శాటిలైట్ల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి బ్రాడ్‌బాండ్ సేవలు అందించాలని ప్రణాళిక రూపొందించింది. అయితే వినియోగదారులు ఇంటర్‌నెట్ సేవలు రిసీవ్ చేసుకునేందుకు సులువుగా ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వీలుండి, తక్కువ ఖర్చు అయ్యే రిసీవర్‌ను రూపొందించడం ఆలస్యమైంది. దీంతో 2018 వరకు రెండు ప్రోటోటైప్ శాటిలైట్లను లాంచ్ చేయలేకపోయింది.
ఆర్బిట్‌లోకి ప్రొటోటైప్ శాటిలైట్లతో మొదలు..
2018లో టిన్‌టిన్–ఏ, టిన్‌టిన్–బి ప్రొటోటైప్ శాటిలైట్లను ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. తద్వారా స్పేస్ ఎక్స్ తమ శాటిలైట్ల డిజైన్‌లో మార్పులు చేసుకునేందుకు వీలు కలిగింది. అయితే దీనిపై స్పేస్ ఎక్స్ ఎక్కడా నోరు విప్పలేదు. 2018 నవంబరు 19న యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నుంచి స్పేస్ ఎక్స్ కు అనుమతి లభించింది. మొత్తం 7,500 శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు అనుమతి దక్కింది.
స్టార్‌లింక్ లో మైలు రాయి..
స్పేస్ ఎక్స్ 2019 మే 24న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. ఆకాశంలో రాత్రిపూట ఓ ట్రైన్ వెళుతున్నట్టుగా ఈ శాటిలైట్ల ప్రయాణం కనిపించింది. మార్చి 1, 2021 వరకు దాదాపు 1200 లకు పైగా శాటిలైట్లను ఆర్బిట్‌లోకి పంపించింది. పదేళ్లకాలంలో 12 వేలకు పైగా శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపించాలని ప్లాన్ చేస్తోంది. భూమి నుంచి 550 కి.మీ. ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ)లో శాటిలైట్స్‌ను ఆపరేట్ చేసతారు. ఇంటర్‌నెట్ నెట్‌వర్క్ లో లేటెన్సీ ఉండేందుకు, కింద ఎక్కువ వైశాల్యంలో రిసీవ్ చేసుకునేందుకు వీలుగా ఇలా లో ఎర్త్ ఆర్బిట్‌లో శాటిలైట్స్‌ను ఆపరేట్ చేస్తారు.
కమ్యునికేషన్ శాటిలైట్ ఎలా ఉంటుంది?
శాటిలైట్ తేలికగా ఉండేలా, కేవలం 260 కేజీల బరువు ఉండేలా రూపొందించారు. పరిమాణం కూడా స్మార్ట్‌గా, కాంప్యాక్ట్‌గా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ శాటిలైట్‌లో అమర్చిన 4 యారె యాంటెన్నాలు ఇంటర్‌నెట్ సేవలు అందించేందుకు తోడ్పడుతాయి. ఓ సింగిల్ సోలార్ యారే, అయాన్ ప్రొపల్షన్ సిస్టమ్, నావిగేషన్ సెన్సర్స్, డెబ్రిస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఈ శాటిలైట్‌లో ఉంటాయి.
శాటిలైట్ ఎలా పనిచేస్తుంది?
భూమి నుంచి అందే ఇంటర్‌నెట్ సంకేతాలను శాటిలైట్ రిసీవ్ చేసుకుంటుంది. సంకేతాలు రిసీవ్ చేసుకునే శాటిలైట్ తన నెట్‌వర్క్‌లోని శాటిలైట్స్‌కు లేజర్ లైట్ ద్వారా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్ నుంచి డేటా చేరవేస్తుంది. ఆ శాటిలైట్స్ ఇక్కడ భూమిపై ఉన్న ఇంటర్‌నెట్ యాంటెన్నాలకు సిగ్నల్ అందిస్తుంది. ఇప్పటికైతే150 ఎంబీపీఎస్ వేగంతో అందిస్తామని, నెట్‌వర్క్ వృద్ధి చెందుతున్న కొద్దీ ఈ వేగం రెట్టింపు అవుతుందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఇటీవలే ట్వీట్ చేశారు.
శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుతం ఎక్కడెక్కడ పనిచేస్తోంది?
స్టార్‌లింక్ ప్రాజెక్టు ద్వారా నార్త్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా తదితర ప్రాంతాల్లో టెస్ట్ సిగ్నల్స్ అందుతున్నాయి. స్టార్‌లింక్ ఇంటర్‌నెట్ కోసం ఆయా ప్రాంతాల్లో 499 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలనెలా 99 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కేవలం కిట్ కోసం మాత్రమే అక్కడ 499 డాలర్లు తీసుకుంటోంది.
ఇండియాలో స్టార్‌లింక్ సేవలు ఎప్పుడు?
ఇండియాలో స్టార్‌లింక్ ఇంటర్‌నెట్ సేవలు 2022లో ప్రారంభమవుతాయని ప్రకటించిన స్పేస్‌ఎక్స్ ఇప్పటికే ప్రీబుకింగ్ ప్రారంభించింది. ఏయే ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలంటే స్టార్‌లింక్ వెబ్‌సైట్ సందర్శించాలి. మీరుండే ప్రాంతంలో ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులో ఉన్నట్టు వెబ్‌సైట్ సూచిస్తే 99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా మన దేశంలో స్టార్‌లింక్ బ్రాడ్‌బాండ్ సేవలకు అనుమతులు రావాల్సి ఉంది.