Home లైఫ్‌స్టైల్ భోగి భోగభాగ్యం .. సంక్రాంతి సందడి.. కనుమ కృతజ్ఞత

భోగి భోగభాగ్యం .. సంక్రాంతి సందడి.. కనుమ కృతజ్ఞత

Bhogi Rangavallulu
Rangoli created bye D.Pushpa Kumari

నం భోగి పండగ, మకర సంక్రాంతి, కనుమ పండగలను విశేషంగా జరపుకొంటాం. సంక్రాంతి విశిష్టత, భోగి పండగ విశిష్టతల గురించి పెద్దలు చాగంటి కోటేశ్వర రావు ఈ పండగల గురించి ఇలా ప్రవచించారు. ధనుర్మాసంలో ఉండే ఆధ్యాత్మిక వాతావరణానికి ఈ మూడు పండగలు తోడై తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తెచ్చి పెడతాయి.

’భోగం అనుభవించడం అంటే సుఖం అనుభవిచండం. శరీర పోషణ కోసం కావాల్సిన పంటను, సుఖం అనుభవించడానికి కావాల్సిన ధనాన్ని చేకూర్చే రోజులు అయినందున దానిని భోగి పండగ అని పేరొచ్చింది. భోగి పండగ వచ్చే సమయానికి వ్యవసాయదారులు పంటలు కోత కోస్తారు. పంట ఇంటికొస్తుంది. ఆ ధాన్యాన్ని నిల్వ చేసుకుని కొంత కుటుంబ పోషణకు, కొంత ధాన్యాన్ని అమ్మి ధనంగా మార్చుకుని సుఖాలను అనుభవిస్తారు..’ అని చాగంటి వివరిస్తారు.

’దక్షిణాయనంలో ఒక ఇబ్బంది ఉంటుంది. శరద్‌ రుతువు తరువాత వచ్చే హేమంత రుతువు అనారోగ్యకారకమైనది. ఈ రుతువు అనంతరం వచ్చేది వసంత రుతువు. ఇది ఆరోగ్యకారకమైనది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ సూచికగా వచ్చే భోగి పండగ కూడా. దక్షిణాయన పుణ్యకాలం చిట్ట చివరిరోజు. మకర సంక్రాంతికి ముందు రోజు ఉండేది భోగి పండగ. దక్షిణాయన పుణ్యకాలంలో చేసిన ఉపాసన ఫలితాలు ఉత్తరాయణ పుణ్యకాలంలో సిద్ధిస్తుంది..’ అని చాగంటి వారు ప్రవచించారు.

భోగి మంటలు ఎందుకు వేస్తారు?

లౌకిక కోరికలకు దూరంగా ఉంటూ ఆంతరమున భగవంతుడిపై ప్రేమ పెంచుకుంటామని చెప్పేందుకు సూచనగా భోగి మంటలు వేస్తారని చాగంటి గారు ప్రవచించారు. పిడకలు, కట్టెలు వేసి భోగి మంటలు మండిస్తారు. లౌకిక కామం కాలిపోయి మోక్ష సిద్ధి కలుగుతుందని అంటారు.

bhogi
Photo by Cullan Smith on Unsplash

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి వచ్చిందని, భోగం అంటే సుఖమని పెద్దలు చెబుతారు. శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగం పొందిందని, ఇందుకే భోగి పండగ ఆచరిస్తారని అంటారు.

ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహం రేగు పండులోకి ప్రవేశిస్తుంది. అందుకే చిన్నపిల్లలకు ఏవైనా జాతయ దోషాలు ఉంటే పోవాలని వారికి రేగు పళ్లను భోగిపళ్లుగా పోస్తారు.

రేగుపళ్లు, కొబ్బరి ముక్కలు, నాణేలు, బంతి పూలు, చెరకు ముక్కలు తదితర పదార్థాలు కలిపి వారి తల మీది నుంచి కిందకి పడిపోతే భోగి పీడ పోతుందని, వారి అనారోగ్యాలు తొలగిపోతాయని, వారు సంతోషంగా గడపడానికి దోహదం చేస్తుంది. శాస్త్రీయంగా చూస్తే ఇది చలికాలం. చలి నుంచి రక్షించుకోవడానికి కూడా భోగి మంటలు కాగుతారు.

మకర సంక్రాంతి విశిష్టత

సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశిస్తాడు. తిరిగి కర్కాటక రాశిలోకి ప్రవేశించేంతవరకు ఉన్న కాలం ఉత్తరాయణ పుణ్యకాలం. దక్షిణాయనంలో చివరి మాసం ధనుర్మాసం. ధనుర్మాసం పూర్తవగానే సంక్రాంతి వస్తుంది.

ఈ కాలం ప్రారంభం కాగానే ప్రయత్న పూర్వకంగా మకర స్నానం చేసి దానధర్మాలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త అల్లుళ్లను ఇంటికి పిలిచి నూతన వస్త్రాలు అందించి విందు ఇస్తారు. రంగ వల్లులతో అలంకరించుకుంటారు.

ఆవు పేడతో గొబ్బిళ్లు చేసి, వాటికి బంతి పూలు అలంకరిస్తారు. వాటి చుట్టూ కన్నె పిల్లలు తిరుగుతూ పాటలు పాడుతారు. ఆవు పేడలో ఆవాహన చేసిన అమ్మవారి అనుగ్రహం పొందుతారు. ఈ పండగ కొత్త శోభను తెచ్చి పెడుతుంది.

ఇక స్వయంగా పరమశివుడికి వాహనంగా ఉండే ఎద్దును ప్రత్యేకంగా అలంకరించి గంగిరెద్దును ఊరేగిస్తారు. గంగిరెద్దుల వారు పాడే ఆశీర్వచనాలకు గంగిరెద్దులు తల ఊపితే రైతులకు మేలు చేకూరుతుందంటారు. అలాగే హరిదాసు చిరుతలు వాయిస్తూ హరినామ సంకీర్తన చేస్తారు.

’ఉత్తరాయణం సమస్త భూతములకు సంతోషాన్ని తెస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సూర్యకాంతి విశేషంగా భూమిపై ప్రసరించడం ద్వారా అన్ని ప్రాణులకు ఆరోగ్యం సమకూరుతుంది..’ అని చాగంటి వారు ప్రవచనంలో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

sankranthi time paddy
Photo by Avinash Kumar on Unsplash

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పెద్ద పండుగ. నెల రోజుల ముందు నుంచే ఇంటికి రంగులద్దుతారు. భోగి పిడకలు నెల రోజుల ముందే తయారు చేస్తారు. ఈ పిడకలు తయారయ్యాక వాటిని దారంతో దండల్లా చేసి భోగి మంటల్లో వేస్తారు.

అప్పటి వరకు చలికాలం వల్ల మనిషి శరీరం పొడిబారి ఉంటుంది. అందుకే భోగి రోజు నలుగు పెట్టి స్నానం చేస్తారు. చిన్నారులకు భోగి పళ్లు పోస్తారు.

సంక్రాంతి విశిష్టత ఏంటంటే ఇది వ్యవసాయ పండగ. ఈ పండగ నాటికి ఇంటికి పంట వచ్చేస్తుంది. పండిన పంటలోంచి మొదటి ధాన్యం తీసి వాటిని దంచి ఆ బియ్యంతో సంక్రాంతి రోజు కీర్తిశేషులైన తాత ముత్తాతలకు పరమాన్నం చేసి పెడతారు. ఇలా చేశాకే పండిన పంటను తమ అవసరాల కోసం వాడుకుంటారు.

నూతన వస్త్రాలను తాత ముత్తాతలకు చూపి ధరిస్తారు. ఈ ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. బట్టలు కొనలేని వాళ్లు కనీసం చిన్న పంచె అయినా కొనుగోలు చేస్తారు.

సంక్రాంతి రోజు అల్లుళ్లను ఆహ్వానిస్తారు. అల్లుళ్లంతా కనుమ రోజు అత్త గారింటికి వస్తారు. అత్తామామలు తమ తమ స్థోమతను బట్టి అల్లుళ్లకు బట్టలు, వాహనాలు, బంగారం కానుకలుగా ఇస్తారు. మాంసాహార విందు తప్పనిసరిగా ఉంటుంది. ఆటల పోటీలు, కోడి పందేలతో సంక్రాంతి సందడిగా ఉంటుంది.

కనుమ పండగ విశిష్టత

ఉపకారికి నుపకారం చేసేలా కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలని చెప్పేది కనుమ పండగ. భూమాత అనుగ్రహించి పంట ఇస్తుంది. ఆ పంట రావడానికి సహకరించేవి ఎద్దులు.

నాగలి మోసి సాగు చేసి, బండి మోసి పంటను ఇంటికి తెచ్చే ఎద్దుకు కృతజ్ఞతాపూర్వకంగా జరిపేది కనుమ పండగ. భోగి నాటికి పంట అంతా ఇంటికి వస్తుంది.

సంక్రాంతి రోజు అందరమూ సంతోషంగా ఉంటాం. మరి మన కోసం శ్రమించే ఎద్దుకు కృతజ్ఞతగా ఉండాలని ఎద్దులకు ప్రత్యేకంగా అలంకరించి రకరకాల ఆభరణాలు తొడిగి, పొంగలి, పాయసం వండి వాటికి తినిపిస్తారు.

kanuma prayer to bulls
Photo by Varun Verma on Unsplash

పాడికి కారణమైన ఆవులను కూడా అలంకరిస్తారు. శివాలయాల్లో నందీశ్వరుడికి అభిషేకాలు జరిపి అలంకరణ చేస్తారు. ఈ కనుమ పండగ స్ఫూర్తితో మనుషులంతా కృతజ్ఞతగా ఉండాలి.

డియర్ అర్బన్ పాఠకులకు భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు.

ఇవీ చదవండి..

సంక్రాంతి ముగ్గులు .. రంగవల్లుల డిజైన్లు

Exit mobile version