Home న్యూస్ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఢిల్లీ తరహాలో కుప్పకూలనుందా?

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఢిల్లీ తరహాలో కుప్పకూలనుందా?

real estate
Photo by Life Of Pix from Pexels

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఢిల్లీ తరహాలో కుప్పకూలే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రెసిడెన్షియల్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో చదరపు అడుగు(ఎస్‌ఎఫ్‌టీ)కు రూ. 3 వేల ధర పలకగా.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్రముఖ బిల్డర్లు ఈ ఏడాది జనవరి నాటికి రెండింతలు పెంచేశారు.

మణికొండ సమీపంలోని పుప్పాలగూడ, అలకాపూర్‌ టౌన్‌షిప్‌ ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటిలో అయితే రూ. 5,200, కొండాపూర్‌ ప్రాంతంలో రూ. 6,200, గచ్చిబౌళి ప్రాంతంలో రూ. 7,000, మియాపూర్‌లో అయితే రూ. 5,200.. ఇలా మొత్తంగా ఒక 2 బీహెచ్‌కేకు కనీసంగా రూ. 75 లక్షల నుంచి రూ. 1 కోటి వెచ్చించాల్సి వస్తోంది.

ఉదాహరణకు నార్సింగిలో 1448 ఎస్‌ఎఫ్‌టీ గల 2 బీహెచ్‌కే తక్కువలో తక్కువ ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 4600 ఉందనుకుందాం. ఫ్లాట్‌ వ్యాల్యూ రూ. 70,10,800 అవుతుంది. దీనికి అదనంగా జీఎస్టీ 5 శాతం (రూ. 3.50,540) చెల్లించాలి.

అలాగే మ్యుటేషన్‌ ఫీ రూ. 35,054 చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ చార్జీలు (6 శాతం) అంటే.. రూ. 4,20,648 చెల్లించాలి. డాక్యుమెంటరీ ఛార్జీలు రూ. 10,000, ఏడాది మెయింటేనెన్స్‌ ఛార్జీలు రూ. 35,000 చెల్లించాలి. అంటే మొత్తంగా రూ. 78,61,794 చెల్లించాలి.

2 బీహెచ్‌కేకు ఇంత ధర చెల్లించాల్సి రావడంతో మధ్య తరగతి ప్రజలు ఇక అపార్ట్‌మెంట్‌ ఆశలు వదులుకుంటున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో కరోనా మహమ్మారి వెంటపడడంతో ఇప్పుడు బిల్డర్లు కళ్లు తెరుస్తున్నారు.

ఢిల్లీలో ఏం జరిగింది?

షీలాదీక్షిత్‌ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మెట్రోలు, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రావడంతో రేట్లు అడ్డగోలుగా పెరిగాయి. ఢిల్లీ శివార్లలో ఉన్న నోయిడా, గురుగ్రామ్‌లో కూడా రేట్లు అడ్డగోలుగా పెరిగిపోయాయి. బిల్డర్లు అపార్ట్‌మెంట్లను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారు. డబ్బులు తీసుకుని సమయానికి డెలివరీ ఇవ్వలేదు. బడాబడా ప్రాజెక్టులు, పెద్దపెద్ద సెలబ్రిటీలతో ప్రచారం చేయించిన ప్రాజెక్టులు అనేకం జనం నెత్తిన టోపీ పెట్టాయి.

డబ్బులు కట్టినవాళ్లంతా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి ప్రాజెక్టులపై మనం ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాలి? అన్న ప్రశ్న జనం మదిలో మెదిలింది. రియల్‌ ఎస్టేట్‌రంగం కుప్పకూలింది.

దీంతో రూ. 70 లక్షల వరకు వెళ్లిన అపార్ట్‌మెంట్‌ ధరలు ఇప్పుడు రూ. 35 లక్షల వద్దకు దిగాయి. కొత్త ప్రాజెక్టులన్నీ చవక ధరల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి. అయినా కొనేవారు లేక అనేక స్కీమ్‌లతో బిల్డర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఇంకా గడ్డు పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి రానుందా?

పెరుగుట విరుగుట కొరకే అన్న చందంగా.. హైదరాబాద్‌ లో రెండేళ్లుగా ఇబ్బడిముబ్బడిగా పెరిగిన రేట్లు మళ్లీ దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు డబుల్‌ బెడ్‌ రూమ్‌ రూ. 40 లక్షల్లోపు ఉంటే ఇప్పుడు రూ. 80 లక్షల నుంచి రూ. 1 కోటి చెల్లించాల్సి వస్తోంది. స్టాండ్‌ అలోన్‌ అపార్ట్‌మెంట్‌కు కూడా రూ. 70 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ధరల ప్రభావంతో అపార్ట్‌మెంట్ల వైపు జనం చూడడం మానేశారు.

ఇదే సమయంలో కోవిడ్‌ మహమ్మారి కూడా పంజా విసిరింది. మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. చిన్న చిన్న ప్రాజెక్టులు.. అంటే ఐదారు వందల గజాల్లో అపార్ట్‌మెంట్లు కట్టేవారు కూడా తమ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో కనీసం ఏడాది ఆలస్యం కానుందని చెబుతున్నారు.

భారీ ప్రాజెక్టులు కూడా పూర్తి అయ్యేందుకు మరింత సమయం పడుతుంది. ప్రాజెక్టులు పూర్తి చేయలేక చేతులెత్తేసే పరిస్థితి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.

కార్మికుల లభ్యత తగ్గడం, ఆర్థిక వనరుల మాంధ్యం, ఉద్యోగ భద్రత కరవవడం వంటి అనేక అంశాలు కొనుగోలుదారులపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో టులెట్‌ బోర్డులతో వెలవెలబోతోంది. ఇల్లు కొనడం కంటే రెంట్‌కు ఉండడమే మేలన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలో బిల్డర్లు మళ్లీ ఆకాశం నుంచి నేల మీదికి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

ఢిల్లీ, ఇతర నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిన పరిస్థితి రాకముందే బిల్డర్లు మేల్కొని అత్యాశకు పోకుండా సహేతుకమైన రేట్లతో అపార్ట్‌మెంట్లు అందిస్తే కొనుగోలుదారులకు, బిల్డర్లకు, రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు మేలు జరుగుతుంది.

Exit mobile version