వేసవిలో అనేక జాగ్రత్తలు తీసుకుంటే గానీ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంటుంది. సీజన్‌కి తగ్గట్టుగా ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే సమస్యలు తీవ్రం అవుతాయి. వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలంలో ఎండల బారిన పడినప్పుడు శరీరంలో వేడి, అలసట, నీరసం సర్వసాధారణం. కాని ఇవి చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం బారిన పడతాం. బయట ఉష్టోగ్రతలు పెరుగుతున్న కొద్దీ రకరకాల సమస్యలు వస్తాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. సన్‌స్ట్రోక్ వల్ల తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు, శ్యాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరం శక్తిని కోల్పోతుంది. కనుక ప్రతి ఒక్కరు వేసవిని తట్టుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
1. నీటిని ఎక్కువగా తాగడం
చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు నీరు సరిగా తాగకపోవడమే. శరీరంలో తగినంత నీరు లేకపోతే మనం చేసే కొద్ది పాటి శ్రమకే నీరసం వచ్చేస్తుంది. శరీరం సత్తువ కోల్పోతుంది. ముఖ్యంగా వేసవిలో నీరు ఎక్కువ తాగాల్సి ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగడం అవసరం. దాహం వేసినా వేయకపోయినా క్రమం తప్పకుంగా నీటిని తాగాలి అనే నియమం ప్రతి ఒక్కరు పాటించాలి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్‌ను ఖచ్చితంగా తీసుకువెళ్లాలి. మధ్యమధ్యలో గొంతు తడారకుండా నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల డీ హైడ్రేషన్ నుంచి రక్షించుకోవచ్చు.
2. చర్మ సంరక్షణకు
బయటకు వెళ్లేటప్పుడు చాలామంది చర్మ సంరక్షణను అంతగా పట్టించుకోరు. కాని సూర్యరశ్మి చర్మానికి తగిలినపుడు చిటపటలాడుతూ ఉండడం, దురద పెట్టడం, చెమట కాయలు ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అందుకే వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. వేసవిలో బయటకు వెళ్లేటపుడు ఖచ్చితంగా గొడుగు లేదా టోపి ధరించాలి. ముఖ్యంగా సన్‌స్క్రీన్ వాడటం ఉత్తమం. సన్‌స్క్రీన్ వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. అది చర్మం కమిలిపోకుండా సూర్యరశ్మి నుండి కాపాడుతుంది.
3. మంచి ఆహారాన్ని తీసుకోవడం
వేసవిలో చిరుతిళ్లు తినడం తగ్గించాలి. బయటి ఆహారం, జంక్ ఫుడ్, ఇతరత్రా పానీయాలు అస్సలు తాగకూడదు, తినకూడదు. ఎక్కువగా పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల రసాలు, మజ్టిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు తీసుకోవాలి. మసాలాలు మానుకోవడం మంచిది. ఫ్రిజ్ వాటర్ అస్సలు తాగకూడదు. కుండలో గాని లేదా బిందెలో ఉన్న నీటిని మాత్రమే తాగాలి.
4. తేలికైన దుస్తులు ధరించండి
ఎండకాలంలో ముఖ్యంగా పాటించవలసినది సరైన దుస్తులు ధరించడం. కాటన్ దుస్తులు మాత్రమే వేసుకోవాలి. అలాగే టైట్‌గా ఉండే బట్టలు వేసుకోకూడదు. వదులుగా శ్వాస క్రియకు అనువుగా ఉండే తేలికైన బట్టలు ధరించాలి. ఎండలో బయటికి వెళ్లేటప్పుడు లేత రంగులో ఉండే దుస్తులను వేసుకోవడం మంచిది. ఎండ వేడిమికి చల్లగా, కొంచెం సౌకర్యవంతంగా ఉండే వాటినే ఎక్కువగా వాడాలి.
5. ఇంటిని చల్లగా ఉంచుకోండి
వేడి వాతావరణం కారణంగా ఇంటిలో వేడి అధికంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎయిర్ కండీషనర్ లేకపోతే ఇంటిలోపల కిటికీల కర్టెన్స్ తడిపి ఉంచుకోండి. బయట వేడి గాలులు ఇంటిలోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు తడి గుడ్డతో ఫ్లోర్ తుడుస్తూ ఉండాలి. పిల్లలను ఎక్కువగా బయటకు పంపకండి. బయట ఆడుతూ ఉంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.
బయట నుంచి వచ్చాక చేయకూడని పనులు
బయటికి వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే పాటిస్తామో అలాగే ఎండ నుంచి ఇంటికి వెళ్లాక కూడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
- చాలామంది బయటి నుంచి రాగానే వేంటనే ఏసీ ఆన్ చేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు అంటున్నారు వైద్య నిపుణులు .
- చల్లని నీటిని మీద పోసుకోవడం, ఫ్రిజ్ వాటర్ తాగడం మంచిది కాదు.
- అలాగే సాధారణమైన టెంపరేచర్ ఉండే నీటిని, లేదా కుండలో వాడే నీటిని తాగడం మంచిది.
- ముఖ్యంగా నలుపు ముదురు రంగులో ఉండే దుస్తులను ధరించరాదు. ఎక్కువగా మెరుపులు ఉన్న వాటిని వేసుకోరాదు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్