Home ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌ఫ్లిక్స్ స్పానిష్ మూవీ: సండేస్ ఇల్‌నెస్‌ : రామోన్ సాలజార్ అద్భుత సృష్టి

నెట్‌ఫ్లిక్స్ స్పానిష్ మూవీ: సండేస్ ఇల్‌నెస్‌ : రామోన్ సాలజార్ అద్భుత సృష్టి

sunday's illness

‘’తల్లీ కూతుళ్లు ఎన్నడూ వేరు కారు, సుదూరంగా ఉన్నా హృదయగతంగా కలిసే ఉంటారు.’’

* * *

ముప్పయైదేళ్ల క్రితం ఎనిమిదేళ్ల కూతుర్ని వదిలేసి వెళ్లిపోయిన తల్లి అనాబెల్ (సూసీ సాంచెజ్). కూతురు చియరా (బార్బరా లెన్నీ) ఏమైందో ఎన్నడూ ఆ తల్లి తెలుసుకోలేదు. తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో తెలిసినా ఎన్నడూ ఆ కూతురు తల్లిని కలుసుకోలేదు.

ఇన్నేళ్ల తర్వాత జన సంచారం లేని కీకారణ్యం మధ్య నుండి, పక్కనే ఎక్కడో పారుతున్ననది గలగలల సంగీతమే తోడుగా కాలి నడకన బయలుదేరిన చియరా ఏం వెతుకుతోంది? ఏం పోగొట్టుకుంది?

* * *

అనాబెల్ ఇప్పుడు బ్రాసెలినా (స్పెయిన్) లోని హైసొసైటీ లేడీ. ఆమె రెండో భర్త గొప్పవ్యాపారవేత్త. వారికో కూతురు కూడా. అనాబెల్‌కు ముందే ఓ కూతురున్నట్టు వారికి కూడా తెలియదు. రాజప్రాసాదం లాంటి వారి నివాస భవనంలో అట్టహాసంగా జరుగుతున్న ఓ విందులో వెయిటర్‌గా ప్రత్యక్షమౌతుంది చియరా.

ఎందుకు? దశాబ్దాలు గడచిపోయినా, కూతురిని చూసిన వెంటనే గుర్తుపడుతుంది అనాబెల్. అతిథులందరి ముందు పైకి నిబ్బరంగా కనిపిస్తూ గంభీర వదనంతో కూచున్న అనాబెల్ గుండెలో ఏ పెను తుఫాను చెలరేగుతోంది?

ఒకింత కొంటెతనం తొంగి చూసే దాగీదాగని నవ్వుతో దొంగ చూపులతో తల్లిని చూసే చియరా మదిలో ఏ పథకం దాగి ఉంది? అందరి ముందూ తల్లిని అభాసుపాలు చేయాలనా? చేస్తానని బెదిరించాలనా? విందు తర్వాత ఏకాంతంగా తల్లీకూతుళ్లిద్దరూ ఉద్విగ్న హృదయాలతో అలాగే బొమ్మల్లా నిలిచిపోయి, ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు.

ఒకరు ముద్దాయి, మరొకరు బాధితురాలు! నిశ్శబ్దంగా కళ్లతోనే సాగిన ఆ సంభాషణఏ భాషా వ్యక్తం చేయలేనిది. తనను కలవాలనే సందేశమున్నచిట్టీని ఉంచి నిశ్శబ్దంగా వెళిపోతుంది చియరా.

ఆ తర్వాత కూతురి ముందు దోషిలా కూచున్నఅనాబెల్‌ను చూస్తూ “విడ్డూరమే” అంటుంది చియరా. ఏమిటని అడిగితే “అసలు నేను లేనేలేనట్టుగా ఉండటం”అని చెబుతుంది.

నిజమేనా.. తల్లి కూతురి అస్థిత్వాన్నే మరచిపోయిందా? అనాబెల్ రెండో కూతురు ఏమైనా చేస్తుందా అని వెటకారంగా అడుగుతుంది చియరా. అనాబెల్ కాసింత గర్వంగానే ఆమె మంచి ఫొటోగ్రాఫర్ అని, ఆ కోర్స్ కోసమే త్వరలో అమెరికా వెళుతుందని చెబుతుంది. అమెరికా వెళ్లాలనేది నీ నిర్ణయమేగా అని వెటకరిస్తుంది కూతురు. అనాబెల్ మౌనం అర్థాంగీకారం కాదు, పూర్తి అంగీకారం.

తల్లి నైజం కూతురికి తెలుసు. ఆ విషయం తల్లికీ తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావవి అడిగిన తల్లికి చియరా తనకు ఏ చదువూ అబ్బలేదని, నిలకడగల రిలేషన్‌షప్సూ లేవని ఏదో రోజులు నెట్టుకు వస్తున్నాన్నట్టుగా బదులు చెబుతుంది. పొడి పొడి మాటలతో సాగే తల్లీకూతుళ్ల ఈ తొలి కలయిక, ఉద్వేగాల సంఘర్షణతోనే చిత్రం ఆసాంతం సాగుతుందేమోనని అనిపించేలా చేస్తుంది. మనం ఊహించే విధంగా కూతురు తల్లిని తప్పు పట్టడం, తల్లి సంజాయిషీలు ఇచ్చుకోవడం ఏమీ జరగదు. అసలు ఆ చర్చనే దాదాపుగా రాదు. మన ఊహకు అందకుండా కథను ఆద్యంతం ఇలాగే నడిపించి సాలజార్ గొప్ప సినీ మాంత్రికుల జాబితాలో చేరిపోయారు.

* **

గతించిన గతంలోకి పయనం

ఎవరికీ తెలియని ఈ కూతురు గురించి అనాబెల్ భర్తకు చెప్పక తప్పదు. చియరా అసలు ఆమెను ఎందుకు రమ్మంటున్నదో, ఏం చేస్తుందో ఏమో ఎవరికి తెలుసు? అనాబెల్‌కు ఏ హానీ తలపెట్టదని భరోసా ఏముంది? అని ఆయన, ఆయన సహాయకుల ఆందోళన,గుంజాటన.

కానీ తల్లికి కూతురి మీద నమ్మకం ఉంది! అందుకే ఆమె కూతురి వెంట బయలుదేరుతుంది. ప్రాన్స్‌లోని ఒకప్పటి తమ ఇంటికి! దారిలో, చియరా డ్రైవ్ చేస్తుండగా దీర్ఘాలోచనలో పడిన అనాబెల్ మదిలో ఏం సుడులు తిరుగుతున్నాయి? గతం గురించిన జ్ఞాపకాలేనా? అనాబెల్ మొదటి భర్త, తన తండ్రి అక్కడ లేడని అడక్కుండానే చెప్పిన చియరా, ఆయన ఎక్కడున్నాడని అడిగాకనే… కొంతకాలం క్రితంచని పోయాడని చెబుతుంది.

చియరా సునాయాసంగా అబద్దం ఆడేసిందని ఆ తర్వాత మనకు తెలుస్తుంది. ఎంతైనా తల్లి కదా, అనాబెల్‌ మాత్రం నమ్మదు. ఆ తల్లికూతుళ్లు ఇద్దరూ ఒకరి నైజం ఒకరికి బాగా ఎరిగినవారే. కూతురి కొంటె కోణంగితనం ఇంకా పోలేదని అనాబెల్‌కు అర్థం అవుతుంది.

ఆ విషయం మనకు అప్పుడే అర్థం కాదు. ఆమె తండ్రి చనిపోలేదు, పారిస్‌లో ఉంటున్నాడు. తండ్రి రమ్మన్నా రాకుండా చియరా ఆ ఇంటిని పట్టుకుని వేలాడుతుంటుంది. ఎందుకు? ఆ ఇంట్లో ఏముంది?

***

ఆర్సన్ వెల్లిస్ సిటిజెన్ కేన్(1941) చూసిన వాళ్లకు, కేన్ నోట వచ్చిన చిట్టచివరి మాట ‘రోస్‌బండ్’ అంతరార్థం ఏమిటో ఎరిగిన వాళ్లకు ఆ ఇంట్లో ఏముందో, చియరాకు అది ఎంత అపురూపమైనదో మొదట్లోనే అర్థం అవొచ్చు.

***

అడవి మధ్య మలిసంధ్య చీకట్లలో మంచుతెర కప్పుకుని కనిపిస్తున్న పాత ఇల్లు ముంచుకు రాబోతున్న ఉపద్రవానికో, మహా విషాదానికో సంకేతంలా అనిపిస్తుంది. ఇంటికి చేరాక రెండు రోజుల పాటూ చియరా ప్రవర్తన తల్లికే కాదు మనకూ అంతుబట్టదు. ఓ సందర్భంలో ఆమె ఓ శాడిస్టా అనిపిస్తుంది. అసలు విషయం మెల్లగా అర్థం అవుతుంది..

ఎనిమిదేళ్ల ప్రాయంలో పోగొట్టుకున్న బాల్యాన్ని.. తల్లి ప్రేమతో పెనవేసుకుపోయిన ఆ బాల్యాన్ని ఇప్పుడు, ఇప్పుడే…ఈ పది రోజుల్లోనే ఒడిసి పట్టుకోవాలని, అనుభవించేయాలని చియారా తపన! తనకు ఇష్టమైన పాత మ్యూజిక్ ఆల్బమ్‌ను వింటూ డాన్స్ చేస్తున్న తల్లి ఆనందాన్నిచాటు నుంచి మురిపెంగా చూసే చియరా మొహంలోని నవ్వులో పసిదనం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.

తరచి చూస్తే అంత కాలం ఆమె తల్లిని ఎందుకు కలుసుకోలేదో కూడా స్ఫురించవచ్చు…అది తల్లి సంతోషాన్ని, ఆనందాన్ని భగ్నం చేయాలని, ఆమె కోరుకున్న కొత్త జీవితంలో కల్లోలం సృష్టించాలని అనుకోకపోవడమే కావచ్చు.

గతాన్ని వర్తమానంగా మార్చిన విషాదం

దశాబ్దాల ఎడబాటు ఇద్దరి మధ్య కట్టిన గోడ మంచుతెరలా కరిగిపోగా…కూతురు పసిపాపయి తల్లి అక్కున చేరుతుంది. కానీ, గతించిన గతాన్నివర్తమానంగా సాక్షాత్కరిస్తుంది. కాని దాన్ని ఆవిష్కరించిన చియరా తీరని ఆకాంక్షల జిగీషకు నేపథ్యం ఓ మహా విషాదం కావడమే వైచిత్రి.

sundays illness 1

ఆ నిజం బయటపడటంతోనే…కూతురి వెంట వెళితే ఏమౌతుందోనని మదన పడుతూ బయలుదేరి, క్షణాలు లెక్కబెడుతూ గడిపిన తల్లి ససేమిరా వెళ్లనుగాక వెళ్లను ఉంటానంటుంది! రారమ్మని పిలిచిన కూతురు పది రోజుల గడవు ముగియక ముందే తల్లిని ఇక వెళ్లిపొమ్మని శాసిస్తుంది! అంతేకాదు, తల్లిని మరో కోరిక కోరుతుంది.

ఈ సరికొత్త కోరికకు వాళ్ల ఒప్పందానికి ఏ సంబంధం లేదు. ఇష్టమైతే చేయొచ్చు లేకపోతే లేదు! తన వల్ల కాదని తిరస్కరించి అనాబెల్ వెళ్లిపోతుంది. బ్రాసెలినాకు కాదు… పారిస్‌కు… మొదటి భర్తను కలుసుకోడానికి! చియరా కోరిక ఏమిటో అతనికి తెలియడమే కాదు, దాన్ని తీర్చడానికి సిద్ధమయ్యాడు కూడా. తల్లి మాత్రమే నెరవేర్చాలని చియరా కోరుకుంటున్నఆ కోరికను అనాబెల్ తీరుస్తుందా?

వెంటాడుతూనే ఉండే సండేస్ ఇల్‌నెస్‌

ఏ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలోనూ కనిపించని ఉద్విగ్నతతో మొదలయ్యే ఈ సినిమా మెల్లగా నడిచినా చివరి వరకు అదే బిగితో, సస్పన్స్‌తో సాగి, గుండెలను పిండేసే బాధతో ముగుస్తుంది. సినిమా ముగిసినా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మరోసారి చూడకుండా ఉండలేకుండా చేస్తుంది. ముందు కనబడని కొత్త అర్థాలు, అందం కనిపించేలా, వినిపించేలా చేస్తుంది.

అతి పొదుపుగా వాడిన మాటల వెనుక కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. ప్రతి సన్నివేశమూ, ప్రతి ప్రేమూ తప్పనిసరిగా మళ్లీ చూడాల్సిందే. ఎన్నోసారి చూసినా ఫాస్ట్ ఫార్వార్డ్ చేయగలిగినది ఏదీ దొరకదు. దీన్ని సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌ కిందకు తోసేయడం తేలికే కాబట్టి ఆ పని చేసేసారు. కానీ సినిమా పండితులు ఇంతవరకు నిర్వచించిన ఏ జానర్‌లోకి సండేస్ ఇల్‌నెస్‌ ఇమిడేది కాదు.

పర్‌ఫెక్ట్ గ్రేట్ మూవీకి నిర్వచనం

మరుగునపడ్డా మసిబారని, పసివాడని ఉద్వేగభరితమైన ప్రేమానుబంధాల అల్లికగా, విషాదం నేపథ్యంగా సాగే ఈ సినిమా నిజానికి ఇద్దరి సినిమా… తల్లీకూతుళ్ల సినిమా. అరకొర మాటలతోనే సాగే సినిమాకు ప్రాణం ఆ రెండు పాత్రలలో నటించే నటుల నటనే.

చియరాగా బార్బరా లెన్నీ, అనాబెల్‌గా సూసీ సాంచెజ్… ఇద్దరికిద్దరూ అరుదైన అతి గొప్ప నటులు. (సాలజార్ అసలు ఈ సినిమా కథను అల్లిందే సాంచెజ్ నటనకు పట్టం గట్టడానికి!) మరెవరూ న్యాయం చేయలేరన్నంతగా గొప్పగా వారు ఆ పాత్రలలో జీవించారు.

మరీ ముఖ్యంగా అతి సంక్లిష్టమైన పాత్ర చియరాగా బార్బరా నటనను ఎన్నటికీ మర్చిపోలేం. విషాదం నేపథ్యంగా సాగే ఈ సినిమాని ఆద్యంతం అతి అందంగా తీయడం ఆశ్చర్యకరం. దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణల నుంచి సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్‌ల వరకు ఏ శాఖలోనూ ఏ లోపాన్ని కనిపెట్టలేని పర్‌ఫెక్ట్ గ్రేట్ మూవీకి నిర్వచనంగా మిగిలిపోయే సినిమాల సరసన నిలిచే చిత్రం ఇది.

మరుగున పడిపోవడానికి కారణం?

సండేస్ ఇల్‌నెస్‌ను2018లో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ పనోరమా విభాగంలో హడావిడిగా విడుదల చేసారు. మన దేశంసహా ప్రపంచంలోని చాలా దేశాల్లో థియేటర్లలో విడుదల కాకముందే ఈ సినిమానుమెరుపువేగంతో నెట్‌ప్లిక్స్ ఎగరేసుకుపోయింది. మరింత హడావిడిగా తన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసేసింది. కానీ ప్రచారం విషయంలో నిర్లక్ష్యం చూపి, సినిమా ప్రియలు చాలా మందికి తెలియకుండా మరుగున పడిపోడానికి కారణమైంది. పైగా, స్పానిష్/ఫ్రెంచ్ చిత్రంగా తయారైన దీన్నికనీసం ఇంగ్లిష్‌లోకైనా డబ్బింగ్ చేయకుండా, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తోనే వదిలేసిన నెట్‌ప్లిక్స్‌ది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాకపోతే మరేమిటి?

మూవీ రివ్యూ : సండేస్ ఇల్‌నెస్‌ (La enfermedad del domingo)
నటీనటులు : బార్బరా లెన్నీ, సూసీ సాంచెజ్, మిగ్యుల్ ఏంజెల్ సోలే, రిచర్డ్ బోహ్రింగర్
ప్రొడ్యూసర్‌ : ఫ్రాన్సిస్కో రామోస్
దర్శకుడు : రామోన్ సాలజార్
విడుదల : ఫిబ్రవరి 20, 2018
నిడివి : 113నిమిషాలు
ఓటీటీ : నెట్‌ఫ్లిక్స్

దేశం: స్పెయిన్
భాష: స్పానిష్
సబ్‌టైటిల్స్: ఇంగ్లిష్

రేటింగ్ : 5/5

– పీవీఆర్

[yasr_overall_rating size=”medium” postid=”2414″]
Exit mobile version