కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో యూపీఎస్సీ అభ్యర్థులకు ఇక్కట్లు తప్పట్లేదు. కొంత మంది ఇప్పటికే పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఇప్పటికే సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో పాస్ అయిన వారికి ఇంటర్వ్యూలు జరిగి ఫలితాలు వెలువడేవి. అర్హత పొందన వారు ట్రైనింగ్‌కు కూడా వెళ్లేవారు.
కానీ లాక్‌డౌన్ కారణంగా కొంత మందికి ఇంటర్వ్యూలు ఇంకా జరగలేదు. లాక్‌డౌన్ ముందే కొంత మందికి ఇంటర్వ్యూలు ముగిశాయి. కొంత మందికి ఇంకా జరగకపోవడంతో ఫలితాలు వెలువడ లేదు. మరికొన్ని యూపీఎస్సీ పరీక్షలు కూడా జరగాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ సడలింపులు రావడంతో యూపీఎస్సీ అభ్యర్థుల్లో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారా? అని ఎదురుచూపులు మొదలయ్యాయి.
తాజాగా పలు ఆంక్షల పొడిగింపులను గమనించిన కమిషన్, ప్రస్తుతానికి పరీక్షలు, ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు ప్రకటించిన సడలింపులను కమిషన్ పరిగణనలోకి తీసుకొంది. నాలుగో దశ లాక్‌డౌన్ తరువాత పరిస్థితిని మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది.
గత రెండు నెలలుగా వాయిదా వేసిన ఆయా పరీక్షలు, పలు ఇంటర్వ్యూలను గురించి అభ్యర్థులకు కొంత స్పష్టత ఇచ్చేందుకు గాను కమిషన్ జూన్ 5వ తేదీన జరగబోయే తదుపరి సమావేశంలో పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను జారీ చేయనుంది.
షెడ్యూలు అప్పుడే
జూన్ 5న కమిషన్ సమావేశం తరువాత కొత్త పరీక్షల వివరాలతో కూడిన క్యాలెండర్‌ను యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో ప్రచురించనుంది. యూపీఎస్సీ పరీక్షల శిక్షణకు ఢిల్లీ పెట్టింది పేరు. తరువాత స్థానంలో హైదరాబాద్ కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వేలాది మంది యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాల నుంచి, ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిల్లో అభ్యర్థులు ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. లక్షల్లో ఫీజులు కట్టి శిక్షణ తీసుకునే అభ్యర్థులు లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాలకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు కమిషన్ కూడా ఇప్పటికీ పరీక్షలు, ఇంటర్వ్యూలపై స్పష్టత ఇవ్వకపోడంతో ఇల్లు బాట పట్టారు.