వరలక్ష్మి గృహిణి. ఆమెది మధ్య తరగతి కుటుంబం. భర్తది ప్రైవేటు ఉద్యోగం. ఇద్దరు మగ పిల్లలు, అత్త మామ కలిసి ఆరుగురు సభ్యుల కుటుంబం. చదివింది తక్కువేనని అప్పుడప్పుడు బాధ పడేదే కానీ వరలక్ష్మికి శ్రమించే గుణం, ఓర్పు, సహనం, సమయ స్ఫూర్తి ఎక్కువే. దేశమంతా కరోనా బెంగలో ఉంది. లాక్ డౌన్ ఎన్ని రోజులోనన్నదే ఆ బెంగ. పనులు లేవ్. పైసల్లేవ్. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారోనన్న ఎదురుచూపులే. అందరి ఆలోచన అదే.
కానీ లక్ష్మికి దీనితో సంబంధం లేదు. జిందగీ మొత్తం లాక్ డౌన్‌లాగే ఉంది తనకు. భర్త , పిల్లలు, ఇల్లు.. ఇదే ఆమె ప్రపంచం. ఈ సమయంలో ఆమెకు ఒక్కటే ఆలోచన. పొద్దున టిఫిన్ ఏం చేయాలి.. రేపటికి వంటేం చేయాలన్నదే ఆ ఆలోచన. ఆమెకు థైరాయిడ్ ఉంది. నిద్ర సరిగ్గా పట్టదు. కొద్దిసేపు నిద్ర పోయిందో లేదో తెల్లారింది.
పొద్దున్నే ఐదు గంటలకు లేచింది. ఇల్లు, వాకిలి ఊడ్చింది. గిన్నెలు తోముకుంది. మధ్యలో కొద్దిసేపు కరెంట్ పోవడంతో ఇంట్లో ఉన్న ఖాళీ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిజ్ లో పెట్టింది. కరెంట్ రాగానే బోర్ వేసి టాంక్ నింపింది. స్నానం, పూజ పూర్తి అయ్యేసరికి తొమ్మిదయ్యింది.
టిఫిన్లు సిద్ధం చేస్తూ ఏవండీ.. లేవండీ. పిల్లలూ.. లేవండీ అంటూ అరుస్తోంది. అబ్బా.. మమ్మీకి ఏం పని లేదు.. బడి లేదు.. కాలేజ్ లేదు.. బాగా నిద్ర పోదాం అనుకుంటే పొద్దున్నే లేపుతుంది.. అనుకుంటూ పిల్లలు ఓవైపు..
పిచ్చిదానిలెక్క ఎందుకు అరుస్తున్నవే అనుకుంటూ భర్త లేచి స్నానాలు జేసి.. లక్ష్మి చేసిన రెండు రకాల టిఫిన్లు గట్టిగా లాగించి.. ఎవరి సెల్ ఫోన్లు వారు తీసుకుని బెడ్ రూముల్లోకి దూరిపోయారు. వెళ్తూ వెళ్తూ.. మాటిమాటికీ డిస్టర్బ్ చేయకు అని లక్ష్మీకీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు.
పిల్లలకు పాలు, బూస్ట్, పెద్దోళ్ల కు చాయ్, కాఫీలు సర్వ్ చేస్తూనే ఉంది లక్ష్మి. మధ్యమధ్యలో బోర్ గా ఉందోయ్.. కొద్దిగా మిక్చర్ ఉంటే పళ్ళెంలో పోసి ఇవ్వు అని భర్త.. మామిడి పండ్లు, వాటర్ మిలన్ కోసి తీసుకు రావాలని పిల్లల ఆర్డర్లు.
ఇక వంటకు ఉపక్రమిస్తుండగా.. ఆ పప్పులోకి నాలుగు వడియాలూ వేయించు.. బెండకాయ ఫ్రై ఏం సరిపోతుంది.. కొంచెం కొబ్బరి పచ్చడి చేసి, జెరంత పచ్చి పులుసన్నా, టమాట చారన్నా చెయ్యి చాలంటూ.. ఫేస్ బుక్, వాట్సప్‌లలో పనికి రాని పోస్ట్‌లు చూస్తూ ఎంతో సీరియస్ పని మీద ఉన్నట్లుగా నటిస్తూ భర్త ఓ ఉచిత సలహా పారేశాడు.
మధ్యాహ్న భోజనాలు పూర్తి కాగానే మళ్ళీ గిన్నెలు తోముకుని, అందరి బట్టలు ఉతికేసరికి సాయంత్రం అవుతూనే ఉంది. చిరంజీవి, రామ్ చరణ్, రాజమౌళి చాలా గ్రేట్.. నేను కూడా ఒక స్టిల్ తీసుకుని ఫేక్ బుక్ లో అప్లోడ్ చేయాలని మధ్యలో భర్త గారి డిస్టర్బెన్స్ ఒకటి.
అప్పుడే సాయంత్రమైంది. ఈ ఇంట్లో ఉంటే బోర్ గా ఉందే లక్ష్మీ.. కారబ్బూంది డబ్బా ఇలా అందుకో.. రేపు మురుకులు కొన్ని చెయ్యి.. ఈ బూందీ చిరాకొస్తొంది.. పనిలేక ఏదో ఒకటి ఇలా నోట్లో వేసుకుంటే కాలక్షేపం అని భర్త గారి హుకూం. మమ్మీ నాకు కేక్ చేసి ఇవ్వూ అని చిన్నోడు, నాకు గులాబ్ జామ్ చేసివ్వు అని పెద్దోడు. అవన్నీ రేపు చూద్దాం.. ఇప్పుడైతే జ్యుస్ తాగండి అని పిల్లలకు అందించింది లక్ష్మి..
పొద్దుగాల కాఫీ అంత మంచిగనిపించలేదు.. కొంచెం అల్లం, ఇలాచీ వేసి చాయ్ పెట్టు చాలు.. అన్నాడు భర్త. చాయ్ తాగుతూ భార్యలతో బాధలు అనే చమ్మక్ చంద్ర ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు.
రాత్రికేం వొండుతున్నావే.. అసలు మధ్యాహ్నం సరిగ్గా తినలేదే.. అని భర్త నసతో రాత్రి భోజనాల కోసం కిచెన్లోకి వెళ్లింది లక్ష్మి. పెద్దోళ్లకు చపాతీలు, పిల్లలకు ఎగ్ ప్రైడ్ రైస్ చేసి ఇచ్చింది. డిన్నర్ కాగానే ఆరుబయట షటిల్ ఆడుకోవడానికి బయలుదేరారు. మమ్మీ రేపు నాకు దోశ కావాలని పెద్దోడు అంటే నాకు ఇడ్లీ చేయాలని చిన్నోడి ఆర్డర్లు.
అయ్యో నా రాత.. చేసిచేసి నా రెక్కలు పోతున్నాయ్.. నా నడుము కులవడవట్టే. ఆ కరోనా నాశనం గాను.. గీ లాక్ డౌన్ ఏందో నా సావుకొచ్చింది.. అటు పిల్లలు అర్థం చేసుకోరు.. ఇటు మొగుడు పట్టించుకోడు అని మనసులోనే అనుకుంది.. గట్టిగా అరవాలనిపించింది లక్ష్మికి.. అయినా తమాయించుకొని కిచెన్‌లోకి వెళ్లింది.. రేపటి కోసం అన్నీ సిద్ధం చేసుకుని పడుకునేసరికి రాత్రి పదకొండు అయ్యింది.
ఇది ఒక లక్ష్మీ కథ కాదు.. దాదాపు ప్రతి ఇల్లాలి కథ.. సగటు భారతీయ గృహిణి కథ.. ఇదంతా శాంపిల్ మాత్రమే.. వివరంగా కావాలంటే రాస్తే రామాయణం అంత.. చెబితే మహాభారతం అంత…
ఎంత పనికి అంత కూలి, చేసే పనిని బట్టి వేతనం అంటారు.. ఒక శ్రామికుడు చేసే పని గంటల కంటే రెండున్నర రెట్లు.. అంటే రోజుకు 18 గంటలు పని చేసే గృహ లక్ష్మికి ఎంత వేతనం కట్టివ్వాలి.. వారి శ్రమకు వెల కట్టగలమా? ఈ లాక్ డౌన్‌లోనైనా వారి శ్రమ గుర్తించగలిగామా? గృహిణుల కష్టం చూసి ఇప్పటికైనా వారికి సాయం చేద్దామా? యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా.. వంటి పెద్ద పెద్ద సూక్తులు కాదు.. వారి మౌన వేదనను అర్థం చేసుకునే మనసులు, మనుషులు కావాలి..
నీకు ఎంత అదృష్టం ఉన్నా, నువ్వు ఎంత కష్టపడినా.. భార్య సహకారం ఉంటేనే కదా నీ రాణింపు. అహాన్ని పక్కనపెట్టి ఇకనైనా వారికి సహకరిద్దాం.. వారికి సేవ చేయడం అంటే బానిసగా బతుకుతున్నామని కాదు అర్థం.. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం..అంతే..
– చింతల గోపి, న్యాయవాది
కామారెడ్డి–96404 01998
మీ రచనలను editor@dearurban.com కు పంపండి.
ఇవీ నచ్చుతాయి..
- జవాబు చెప్పు సుశాంత్..!
- చికెన్ బిర్యానీ .. రెస్టారెంట్ స్టైల్ రెసిపీ అదరగొట్టండిలా..!
- సహజంగా బరువు తగ్గడం ఎలా
- ఇమ్యూనిటీ కోసం ఈ ఆరింటికి దూరంగా ఉండండి
- మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు ఎలా తెలుసుకోవాలి?
- ఇంట్లో ఉండి పార్ట్ టైమ్ గా ఉద్యోగం ఇక్కడ వెతకండి