ప్రపంచమంతా ఇప్పుడు మరో ఆర్థిక మాంద్యం (Recession) భయంతో వణికిపోతోంది. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట వచ్చిన మాంద్యంతో అగ్రరాజ్యం అమెరికా కుదేలైంది. ఇప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేనే లేదు. ఇంతలోనే మరో మాంద్యం ముంగిట ప్రపంచం నిలిచింది. ఈ రిసెషన్‌తో మనకు ఎలాంటి భయం లేదని భారత ప్రభుత్వం చెబుతున్నా.. ఆర్థిక పరిస్థితి చూస్తే ఆందోళనకరంగానే ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మన జీడీపీ వృద్ధిరేటు ఐదు శాతానికి పడిపోయింది. వచ్చే ఐదేళ్లలో మన దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతామని పాలకులు ప్రగల్బాలు పలుకుతున్నారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మోదీ సర్కార్ చెబుతున్న గణాంకాలు అందుకోవాలంటే.. ఏడాదికి 14.2 శాతం వృద్ధి రేటు సాధించాలి.
ఆర్థిక వ్యవస్థ మాత్రం తిరోగమనంలో ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశ ఎకానమీ, ముంచుకొస్తున్న మాంద్యంపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందించారు. పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చేసిన ఘనత మన్మోహన్ సొంతం. అలాంటి వ్యక్తే ఇప్పుడు మన వృద్ధిరేటుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన్మోహన్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.
‘మోదీ సర్కార్ వైఫల్యమే..’
‘‘ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి చూస్తే చాలా ఆందోళన కలుగుతోంది. గత త్రైమాసికంలో వృద్ధిరేటు కేవలం 5 శాతంగా నమోదైంది. ఇది సుదీర్ఘకాలం వృద్ధిరేటు మందగిస్తుందనడానికి సూచిక. చాలా వేగవంతమైన వృద్ధిరేటుతో దూసుకెళ్లగలిగే సామర్థ్యం భారత దేశానికి ఉంది. కానీ అన్ని రంగాల్లోనూ మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.
ముఖ్యంగా తయారీ రంగం వృద్ధిరేటు కేవలం 0.6 శాతంగా ఉంది. ఇది అత్యంత దయనీయ పరిస్థితి. దీనిని బట్టే నోట్ల రద్దు, హడావిడిగా తీసుకొచ్చిన జీఎస్టీ నుంచి మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. దేశీయంగా డిమాండ్ తగ్గిపోయింది.
వినియోగ వృద్ధి 18 నెలల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుత ధరలను బట్టి జీడీపీ వృద్ధిరేటు చూసుకుంటే.. అది 15 ఏళ్ల కనిష్ఠానికి పతనమైంది. పన్ను ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ ప్రభుత్వ హయాంలో చిన్న, పెద్ద వ్యాపారవేత్తలు నిరాదరణకు గురవుతూనే ఉన్నారు.
ట్యాక్స్ టెర్రరిజం కొనసాగుతూనే ఉంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఇవి కావు. మోదీ ప్రభుత్వ విధానాలు నిరుద్యోగాన్ని పెంచుతున్నాయి. ఒక్క ఆటోమొబైల్ సెక్టార్‌లోనే మూడున్నర లక్షల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అసంఘటిత రంగంలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.
దిక్కుతోచని గ్రామీణ భారతం
గ్రామీణ భారతం దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు అందడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంత ఆదాయం తగ్గిపోయింది. ద్రవ్యోల్బణాన్ని తక్కువ చేసిన చూపెట్టాలని మోదీ సర్కార్ ఆరాటపడుతోంది. అయితే అది మన రైతులు, వాళ్ల ఆదాయంపై దారుణమైన ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మోదీ ప్రభుత్వ విధానాలు దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న గ్రామీణ భారతంలో విషాదాన్ని నింపుతున్నాయి.
అన్ని సంస్థలూ నిర్వీర్యం
మోదీ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి జరిగింది. వాటి స్వయంప్రతిపత్తిని లాగేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1.76 లక్షల కోట్లు ఇచ్చింది. దీని నుంచి ఆర్బీఐ కోలుకోవడం అంత సులువు కాదు. పైగా ఆర్బీఐ నుంచి తీసుకున్న ఇంత భారీ మొత్తంతో ఏం చేస్తామన్నదానిపై తమకు ఎలాంటి ప్రణాళిక లేదని ప్రభుత్వమే చెబుతోంది.
పెట్టుబడులు తరలిపోతున్నాయ్
మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశ గణాంకాలపై విశ్వాసం లేకుండా పోయింది. బడ్జెట్ ప్రకటనలు, తగ్గింపులు అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. మారిన అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇండియాకు తమ ఎగుమతులను పెంచుకునే అవకాశం దక్కింది.
కానీ ఈ సర్కార్ దానిని సరిగా వినియోగించుకోలేకపోయింది. మోదీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం. మన యువత, రైతులు, రైతు కూలీలు, బడా వ్యాపారవేత్తలు, అణగారిన వర్గాల వారు ఇలాంటి పరిస్థితిని కోరుకోవడం లేదు.
దేశం ఇలా తిరోగమన బాట పట్టడానికి వీల్లేదు. ఇప్పటికైనా మీ వివక్షపూరిత రాజకీయాలను పక్కనపెట్టండి. దేశంలోని మేధావుల దగ్గరికి వెళ్లండి. వాళ్ల సలహాలు, సూచనలు పాటించండి. దేశాన్ని ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించండి అని కోరుతున్నాను..’’