Healthy Habits: మనం అత్యంత అశ్రద్ధ చేసేది మన ఆరోగ్యమే. పోటీ ప్రపంచంలో మన జీవితాలు ఎలా మారిపోయాయంటే.. మన బతుకు మరెవరి కోసమో బతుకుతున్నట్లుగా కష్టంగా, భారంగా రోజులు వెల్లదీస్తున్నాం. రాబోయే తరాలకు మూటలు కట్టి పెట్టే పనిలో పడి మన గురించి మనం మరచిపోతున్నాం.
మన బిజీ షెడ్యూల్‌పై వాట్సాప్‌లలో వచ్చే జోకులను చూస్తూ భారంగా ఓ నవ్వు నవ్వేసి.. అంతేగా అనుకుంటూ మళ్లీ మన పనిలో పడిపోతున్నాం. రోజంతా తీరిక లేకుండా గడిపేసి.. ఆ పని భారం నుంచి రిలాక్స్ కావడానికంటూ టీలు, కాఫీలు, మందు, సిగరెట్ లాంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటికి అలవాటు పడిపోతున్నాం.
గడియారంతో పోటీ పడుతూ బాగానే సంపాదిస్తున్నారు సరే.. కానీ వందేళ్ల జీవితానికి సరిపడే శక్తిని ముప్పై, నలభై ఏళ్లకే ఖర్చు పెట్టేస్తున్నామన్న సంగతి గుర్తిస్తున్నారా? మూడు పదుల వయసులోనే గుండెకు మూడు స్టెంట్లు వేసుకుంటున్న మన స్నేహితులు, బంధువులను చూసైనా మీరు మారుతున్నారా?
అసలు మీ బిజీ షెడ్యూల్‌లో కనీసం ఐదు నిమిషాలైనా మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవడానికి కేటాయిస్తున్నారా? డబ్బుదేముంది బాస్.. పోతే మళ్లీ వస్తుంది.. కానీ ఉన్నది ఒకటే జిందగీ.. కాస్త మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..
అలాగని మీ పనులన్నీ మానుకొని కూర్చోవాల్సిన పని లేదు. ప్రతి రోజు ఈ సింపుల్ హెల్త్ టిప్స్ పాటించి చూడండి.. కచ్చితంగా మీ జీవితంలో ఊహించలేని మార్పులు వస్తాయి.
10 Glasse water per day: ఆరోగ్యానికి 10 గ్లాసుల నీళ్లు
మీరు కూడా ఎన్నోసార్లు వినే ఉంటారు.. రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది అని. కానీ దానిని సరిగ్గా పాటిస్తున్న వాళ్లు ఎంతమంది. మంచి నీళ్లు తాగినంత ఈజీగా మీ మీ రోజువారీ పనులు చేసుకుంటారేమోగానీ.. అసలు సమయానికి ఆ నీళ్లు తాగాలన్న విషయాన్ని మరచిపోతారు.
పైగా దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది కాఫీలు, టీలు, సాఫ్ట్ డ్రింక్స్, సోడాలపై ఆధారపడతారు. ఇవి సమస్యను పెంచేవే తప్ప తగ్గించేవి కావు అని గుర్తు పెట్టుకోండి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగి చూడండి.. కొన్ని రోజుల్లోనే మీ బాడీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.
నీళ్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకుంటూ.. ప్రతి రోజు దీనిని ఓ అలవాటుగా మార్చుకోండి. బయటికెళ్లినా, ఆఫీసులో ఉన్నా.. ఓ వాటర్ బాటిల్ దగ్గరే పెట్టుకుంటే సగం పని పూర్తయినట్లే.
పోనీ మీరు పనిలో పడితే అన్నీ మరచిపోతారనుకుంటే.. నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలో గుర్తు చేయడానికి చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మీ స్మార్ట్ ఫోన్‌లో వాటిని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆక్వాఅలెర్ట్, మై వాటర్ బ్యాలెన్స్, డ్రింక్ వాటర్ రిమైండర్‌లాంటివి ట్రై చేయొచ్చు.
Brushing: బ్రషింగ్ లో నిర్లక్ష్యం వద్దు
పళ్లు తోమడాన్ని చాలా మంది ఓ తప్పని పనిగా చూస్తుంటారు తప్ప.. ఆ పని సరిగా చేయగలిగితే చాలు మీ ఆరోగ్యానికి సంబంధించి సగం పని పూర్తయినట్లే అన్న విషయం చాలా మందికి తెలియదు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. ఒకసారి పళ్ల సందులను క్లీన్ చేసుకోండి. మీ నోరు శుభ్రంగా ఉంటే మీ ఆరోగ్యం బాగున్నట్లే. ప్రతి రోజూ రెండు పూటలా ఒక టైమ్ కేటాయించుకొని బ్రష్ చేయడం మరచిపోకండి. మంచిగా బ్రష్ చేసుకోవడానికి మూడు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.
Exercises: ఇష్టమైన వ్యాయామమే చేయండి
ప్రతి రోజూ కనీసం అర గంట వ్యాయామమైనా చేయాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. చేసే వాళ్లు కూడా ఏదో బలవంతంగా చేస్తుంటారు తప్ప ఇష్టంగా చేయరు. అందుకే ఆ అరగంట కూడా మీకు ఇష్టమైన వ్యాయామమే చేయండి. మీకు రన్నింగ్ అంటే
ఇష్టమా.. అయితే ఉదయాన్ని కాసేపు పరుగెత్తండి. బయటకు వెళ్లలేకపోతే ట్రెడ్‌మిల్ పైనా చేసేయొచ్చు. స్విమ్మింగ్ ఇష్టమైతే.. ఎన్నో ఇండోర్, ఔట్‌డోర్ సెంటర్లు ఉన్నాయి. యోగా, మార్షల్ ఆర్ట్స్.. ఇలా ఏది కుదిరితే అది, మీకు ఏది నచ్చితే అది చేయండి. నచ్చినవాటిని ఇష్టంగా చేస్తాం కదా. ఏదైనా మన
ఆరోగ్యానికి మేలు చేసేదే.
Good sleep: నిద్ర లేకపోతే అంతే సంగతులు
స్మార్ట్ ఫోన్లు, యాప్స్ మన జీవితానికి ఎంతగా పనికొస్తున్నాయో అంత కీడు కూడా చేస్తున్నాయి. వాటి మోజులో పడి సరిగా తిండి, నిద్ర కూడా లేకుండా పోతోంది. ఓ మనిషికి కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. కానీ ఈ గాడ్జెట్స్ కారణంగా చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. వాటిని చూస్తూ
నిద్రపోవడం మరచిపోతున్నారు. ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం అనేది ఓ అలవాటుగా మార్చుకోండి. తద్వారా శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు.
రోజూ 8 గంటలు పడుకునేంత సమయం దొరకడం లేదంటే కుదరదు. రాత్రి పూట కాస్త తొందరగా, ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకుంటే ఇది సాధ్యమే. అయితే పడుకునే గంట ముందే మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను పక్కన పెట్టడం కూడా మరచిపోవద్దు. నిద్ర పోవాలనుకుంటున్న సమయానికి కనీసం 15 నిమిషాల ముందు అలారమ్ పెట్టుకుంటే మంచిది.
Don’t fill the stomach: కడుపు నింపుకోవడానికి తినకండి
కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయంటే అందులో ఏదో ఒకటి వేసేసి దానిని శాంతింపజేయాలని మనలో చాలా మంది చూస్తుంటారు. తినడం అంటే కడుపు నింపుకోవడం కోసమే అన్నట్లుగా మన ఆహార అలవాట్లు మారిపోయాయి.
వీటి వల్లే అజీర్తి, బరువు పెరగడం, అలసట వంటి సమస్యలు వస్తున్నాయి. ఆకలి వేసినప్పుడు ఏది కనిపిస్తే అది తినేసి తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడటం కంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అన్ని విధాలా మేలు చేస్తుంది.
సూపర్ మార్కెట్‌కు వెళ్లగానే ఆకర్షణీయంగా కనిపించే ప్యాకెట్లన్నీ తీసి మన కార్ట్‌లో పడేస్తుంటాం. సాధారణంగా ఆరోగ్యానికి చేటు చేసే ఇలాంటి వస్తువులే స్టోర్ మధ్యలో అందరికీ కనిపించేలా ఉంటాయి. కానీ ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలు స్టోర్ చివర్లో ఉంటాయి.
కళ్లను ఆకర్షించే వాటి జోలికి వెళ్లకుండా కాస్త ఆరోగ్యాన్ని కాపాడే వాటి దగ్గరికి వెళ్లి కొనండి. డబ్బులూ మిగులుతాయి.. ఆరోగ్యమూ బాగుంటుంది.
Self care: మీకు మీరు టైమ్ కేటాయించుకుంటున్నారా?
అసలు నాకు అంత టైమ్ ఎక్కడుంది.. అన్న మాట తరచూ అందరి నోటి నుంచీ వింటూనే ఉంటాం. టైమ్ ఎవరికైనా రోజులో 24 గంటలే ఉంటుంది. దానిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామన్నదే పాయింట్ ఇక్కడ. బిజీ షెడ్యూల్‌లో మనకు మనం టైమ్ కేటాయించుకోలేకపోతున్నాం.
ప్రతి రోజూ మనకు ఇష్టమైన పని చేయడానికి కాస్తయినా టైమ్ కేటాయించడం చాలా ముఖ్యం. మనకు మనం టైమ్ కేటాయించుకోవడం అంటే వ్యక్తిగా మనల్ని మనం మెరుగుపరచుకుంటున్నట్లే.
బుక్స్ చదవడం, మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, పార్క్‌లో నడవడం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పని అంటే ఇష్టం. ప్రతి రోజూ వాటికి కాస్త టైమ్ కేటాయించగలిగితే.. అది మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుంది.
ఇవన్నీ మీకు చాలా చిన్న చిన్న పనులుగానే కనిపిస్తుండొచ్చు కానీ.. ఇవే మీ జీవితంలో పెద్ద మార్పులకు దారి తీస్తాయని గ్రహించండి. ఆరోగ్యంగా ఉండండి.