Home లైఫ్‌స్టైల్ ఆర్గానిక్‌ వే.. జీవించండి కొత్తగా..

ఆర్గానిక్‌ వే.. జీవించండి కొత్తగా..

organic
Photo by Quang Nguyen Vinh from Pexels

ఆర్గానిక్ వే ఆఫ్ లైఫ్. ఇక్కడ ఆర్గానిక్‌ అంటే చాలా మంది కేవలం ఆహారం మాత్రమే అనుకుంటారు. సేంద్రీయ ఎరువులతో పండిన ఆహార పదార్థాలను తింటే చాలని అనుకుంటారు. కానీ ఆహారమే కాదు.. మొత్తంగా మీ జీవితమే ఆర్గానిక్‌గా మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది.

ఇంట్లో వాడే ప్రతి వస్తువూ ఆర్గానిక్‌ అయి ఉండాలి. క్లీనింగ్‌ ఉత్పత్తులు, మేకప్‌ కిట్స్‌, వేసుకునే బట్టలు, వాహనాలు.. ఇలా అన్నీ ఆర్గానిక్‌ కావాల్సిందే. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పర్యావరణానికీ మీ వంతు మేలు చేసిన వాళ్లు అవుతారు. ఆర్గానిక్‌ వేలో కొత్తగా ఎలా జీవించాలో చెప్పడమే ఈ ఆర్టికల్‌ ప్రధాన ఉద్దేశం. 

సేంద్రీయ ఆహారం

1. సేంద్రీయ ఆహారాన్నే కొనండి. ఈ మధ్య నగరాలు, పట్టణాల్లో కొత్త కొత్త ఆర్గానిక్‌ స్టోర్లు పుట్టుకొస్తున్నాయి. ఈ ఆహారం తినడం వల్ల మీ ఆరోగ్యం బాగుండటంతోపాటు పర్యావరణం కూడా బాగుంటుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడిన ఆహారాన్ని తింటున్నారంటే.. మీ శరీరంలోకి పరోక్షంగా హానికారక రసాయనాలను పంపిస్తున్నట్లే. అంతేకాదు ఆర్గానిక్‌ ఆహారం మంచి టేస్ట్‌తోపాటు పోషకాలతో కూడి ఉంటుంది. మీరు మాంసాహారం తినేవాళ్లయితే.. ఎలాంటి హార్మోన్లు, యాంటీ బయాటిక్స్‌ ఇవ్వకుండా పెంచిన వాటినే తీసుకోండి. అలాంటి కోళ్ల నుంచి వచ్చిన గుడ్లనే తినండి. సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ ఎగ్స్‌ కూడా ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. 

2. స్థానికంగా దొరికే కూరగాయలు, పండ్లనే కొనడానికి ప్రయత్నించండి. దీనివల్ల అన్ని రకాల పండ్లూ, కూరగాయలు తినే అవకాశం మీకు లభించకపోవచ్చు. కానీ ఇలా చేయడం వల్ల మీ చుట్టు పక్కలే పండే ఆ పంట నిజంగానే ఎలాంటి రసాయనాలు లేకుండానే పండించారా లేదా అన్నది తెలుస్తుంది. పైగా స్థానిక రైతులను ఆదుకున్నవాళ్లు కూడా అవుతారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లు, ఆర్గానిక్‌ దుకాణాల్లో ఇవి దొరుకుతాయి. ఈ మధ్య ఆర్గానిక్‌ కూరగాయలు, పండ్లను హోమ్‌ డెలివరీ కూడా చేస్తున్నారు. కాకపోతే మీరు ఆర్డర్‌ చేసే ముందే అవి పక్కాగా సేంద్రీయ ఎరువులతో పండించినవేనా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. 

3. మీ వంట మీరే చేసుకోండి. అర్బన్‌ ఏరియాల్లో టైమ్‌ దొరక్క చాలా మంది బయటి ఫుడ్‌కు అలవాటు పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవాళ్లు ఆర్గానిక్‌ రెస్టారెంట్లకు వెళ్లి తింటుంటారు. కానీ అలాంటి రెస్టారెంట్లలో మీకు వడ్డిస్తున్నది నిజంగా ఆర్గానిక్‌ ఆహారమేనా? అందుకే మీరే సొంతంగా సేంద్రీయ ఆహారాన్ని ఇంట్లోనే వండుకొని తింటే మేలు. ఎప్పుడో ఒకసారి బయట తినాలని అనిపిస్తే.. కచ్చితంగా సేంద్రీయ ఉత్పత్తులను వాడే రెస్టారెంట్లకే వెళ్లండి. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తే అవెక్కడున్నాయో తెలిసిపోతుంది. 

4. ఇంట్లోనే కావాల్సిన కూరగాయలను పండించుకుంటే ఇంకా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఖర్చూ తగ్గుతుంది. చాలా మందికి గార్డెనింగ్‌ ఓ హాబీగానూ మారిపోయింది. దీనికి ఇంట్లో పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. 4X4 అడుగుల స్థలంలో ఒక మనిషికి కావాల్సిన వివిధ రకాల కూరగాయలను పండించుకోవచ్చు. కిటికీలు, బాల్కనీలు, వెలుతురు, గాలి రాగలిగితే ఇంట్లోనే వీటిని పండించుకోవచ్చు. ఫ్రెష్‌ కూరగాయలు అప్పటికప్పుడు వంటకు రెడీగా ఉంటాయి. 

సేంద్రీయ ఉత్పత్తులే వాడండి

1. ఇంట్లో వస్తువులను శుభ్రం చేసుకోవడానికి మార్కెట్‌లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో చాలా వరకు రసాయనాలు వాడినవే. ఫాస్పేట్లు, థాలెట్లు లేని క్లీనింగ్‌ ప్రోడక్ట్స్‌ కొనేలా చూడండి. కొంతమంది గ్రీన్‌ వాషింగ్‌ అంటూ రసాయనాలు లేని ఉత్పత్తుల పేరుతో అమ్ముతున్నారు. కానీ వీటిలో పామ్‌ ఆయిల్‌ ఉంటుంది. పామ్‌ ఆయిల్‌ను చాలా వరకు అడవుల్లో చెట్లు నరికి పండిస్తుంటారు. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. అందువల్ల మీరు కొనే ఉత్పత్తుల్లో పామాయిల్‌ ఉందో లేదో చూసుకోండి. ఇవన్నీ ఎందుకూ అనుకుంటే.. మన ఇంట్లోనే గ్రీన్‌ వాషింగ్‌కు కావాల్సిన వస్తువులు ఉంటాయి. బేకింగ్‌ సోడా, నిమ్మరసం, ఉప్పు, వైట్‌ వెనిగర్‌లాంటివి క్లీనింగ్‌కు బాగా ఉపయోగపడతాయి. 

2. ఇక ఇంట్లోని దోమలను తరమడానికంటూ మనం తెచ్చుకునే ఉత్పత్తులతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇందులో వాడే రసాయనాలు మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి. దీనికంటే దోమలను సహజసిద్ధంగా తరిమేసే మార్గాలను అన్వేషించండి. ఉదాహరణకు నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలను పెట్టి దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఒకసారి కొన్న మెషీన్‌లో వేప నూనె పోసిన రీఫిల్‌ను పెట్టి వాడుకోండి. 

3. ఇక మనం వాడే మేకప్‌ కిట్‌లలోనూ కెమికల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ మధ్య వీటిలోనూ సేంద్రీయ, సహజసిద్ధంగా తయారు చేసిన వస్తువలంటూ చాలా వస్తున్నాయి కానీ.. వాటిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఎన్విరాన్‌మెంటల్‌ వర్కింగ్ గ్రూప్‌ అందుకే ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇందులో ఎలాంటి సౌందర్య సాధనాలను వాడాలో వివరిస్తున్నారు. లేదంటే సహజసిద్ధమైన నూనెలు.. అంటే జొజొబా, ఆలివ్‌, కొకొనట్‌ ఆయిల్‌తో తయారు చేసిన సబ్బులను వాడొచ్చు. 

4. వాడిన దుస్తులనే కొనుగోలు చేయండి. ఇది మీకు వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ఇలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లు అవుతారు. ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులను అమ్మే స్టోర్లు కూడా నగరాల్లో వెలుస్తున్నాయి. వీటిలో షాపింగ్‌ కూడా మీకో కొత్త అనుభూతిని పంచుతుంది. సెకండ్‌ హ్యాండ్‌ బట్టలేంటి అనుకుంటే.. కనీసం ఆర్గానిక్‌ ఉత్పత్తులతో తయారు చేసిన దుస్తులనైనా కొనుక్కోండి. ఆర్గానిక్‌ క్లోథింగ్‌ స్టోర్లు కూడా బాగానే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తే మీకు దగ్గర్లోని స్టోర్‌ గురించి తెలుస్తుంది. 

ఆర్గానిక్‌ వేలో వెళ్లండి

1. రోడ్లపై పెరిగిపోతున్న వాహనాలు వెలువరుస్తున్న కాలుష్యం పర్యావరణంపై పెను ప్రభావాన్ని చూపుతున్న సంగతి తెలుసు కదా. అందుకే మీ ప్రయాణాలను కూడా ఆర్గానిక్‌గా మార్చుకోండి. కారు తప్పదనుకుంటే మైలేజీ ఎక్కువ ఇచ్చే వాటిని తీసుకోండి. పొల్యూషన్‌ లేని సీఎన్జీ గ్యాస్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడితే ఇంకా మంచిది. మైలేజ్‌ ఎక్కువిస్తుంది కదా అని.. అవసరం ఉన్నా.. లేకపోయినా.. కార్లు బయటకు తీయకండి. 

2. ప్రయాణానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు వెతకండి. నడిచి వెళ్లే దూరమే అయితే.. కాళ్లకు పని చెప్పండి. లేదంటే సైకిల్‌ వాడండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పర్యావరణానికీ మేలు చేసిన వాళ్లు అవుతారు. 

3. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వీలైనంతగా వాడండి. ఒక్కరు బయటకు వెళ్లినా కారో, బైకో వేసుకెళ్లే బదులు బస్సో, రైలో చూసుకోండి. హైదరాబాద్‌లాంటి నగరాల్లో ఇప్పటికే మెట్రో రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. మెట్రో రైలుతో మీ సమయం ఆదా అవుతుంది. పైగా రోడ్లపై ఉన్న కాలుష్యం బారి నుంచి బయటపడతారు.

Exit mobile version