Home గాడ్జెట్స్ ఓకే గూగుల్ .. నువ్వు ఏవిధంగా సాయపడగలవు?

ఓకే గూగుల్ .. నువ్వు ఏవిధంగా సాయపడగలవు?

ok google
google mini

కే గూగుల్ .. నవ్వు ఏవిధంగా సాయపడగలవు? అన్న ఈ శీర్షిక ద్వారా గూగుల్ అసిస్టెంట్, అలెక్సా వంటి అధునాతన వర్చువల్ అసిస్టెంట్స్ మనకు ఏవిధంగా సాయపడగలవు? మన రోజువారీ జీవనశైలి మెరుగుపడడంలో ఏవిధంగా ఉపయోగపడతాయి? అన్న అంశాలపై సమగ్ర కథనం అందిస్తున్నాం. 

స్మార్ట్ స్పీకర్స్ ఎప్పుడైతే ఇవి మన ఇంట్లోకి వచ్చాయో.. అప్పటి నుంచీ ఇతర స్మార్ట్‌ డివైసెస్‌ రావడం మొదలైంది. ఇప్పుడీ స్మార్ట్‌ స్పీకర్స్‌ కేవలం మ్యూజిక్‌కే పరిమితం కావడం లేదు.. అందులోని వర్చువల్‌ అసిస్టెంట్‌ మనం చెప్పిన పనులన్నీ చేసి పెడుతోంది. మన వాయిస్‌ను గుర్తించి అందుకు తగినట్లుగా స్పందించడం ఈ స్మార్ట్‌ స్పీకర్స్‌ ప్రత్యేకత. పైగా ఇంట్లోని అన్ని స్మార్ట్‌ వస్తువులను ఈ స్పీకర్స్‌ కంట్రోల్‌ చేయగలవు. టాప్‌ కంపెనీలన్నింటికీ వర్చువల్‌ అసిస్టెంట్స్ ఉన్నాయి.

గూగుల్‌ అయితే గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌కు అలెక్సా, ఆపిల్‌కు సిరి, మైక్రోసాఫ్ట్‌కు కోర్టానాలాంటి వర్చువల్‌ అసిస్టెంట్స్‌ ఉన్నాయి. అయితే మన దగ్గర మాత్రం గూగుల్‌ హోమ్‌, అమెజాన్‌ ఎకో.. ఈ స్మార్ట్‌ స్పీకర్స్‌ మార్కెట్‌ను ఏలుతున్నాయి. 

గూగుల్‌ హోమ్‌

గూగుల్‌ హోమ్‌ లోనే వివిధ రకాల డివైసెస్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అన్నింటి కంటే చిన్నది గూగుల్‌ హోమ్‌ మినీ. దీని సైజు, ధర రెండూ తక్కువే. ఓ డోనట్‌ షేపులో ఉండే ఈ గూగుల్‌ హోమ్‌ మినీ గ్రే, బ్లాక్‌ కలర్స్‌లో రూ. 3,999 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.

ఇక గూగుల్‌ హోమ్‌ విషయానికి వస్తే దీని ధర రూ.7,999గా ఉంది. ఇది సిలిండ్రికల్‌ షేపులో ఉంటుంది. ఇది రెండూ చేసే పనులు ఒకటే. కాకపోతే సౌండ్‌ క్లారిటీ, సైజు, ధరల్లో మాత్రమే తేడా ఉంటుంది. డిస్‌ప్లే ఉన్నది కావాలంటే గూగుల్‌ నెస్ట్‌ హబ్‌కి వెళ్లొచ్చు. 7 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో వీడియోలు, ఫొటోలు చూసుకోవచ్చు. ఓకే గూగుల్ అంటూ ఇంట్లోని స్మార్ట్‌ డివైసెస్‌ను కంట్రోల్‌ చేయొచ్చు.

ఒకవేళ స్మార్ట్‌ డోర్‌బెల్‌ ఇంట్లో ఉన్నట్లయితే.. దాంతో కనెక్ట్‌ చేసి బయట ఎవరు వచ్చారన్నది ఈ గూగుల్ నెస్ట్‌ హబ్‌లో చూసుకునే వీలుంటుంది. దీని ధర రూ. 9,999గా ఉంది. ఇందులోనే గూగుల్‌ నెస్ట్‌ హబ్‌ మ్యాక్స్‌ కూడా వచ్చింది. ఇందులో పది అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఉంటుంది.

అమెజాన్‌ ఎకో

అమెజాన్‌ ఎకో తొలిసారి 2014లో లాంచ్‌ అయింది. తాజాగా అమెజాన్‌ థర్డ్‌ జనరేషన్‌ ఎకోను 2019 సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేసింది. గూగుల్‌ హోమ్‌లాగే ఇది కూడా సిలిండ్రికల్‌ షేప్‌లోనే ఉంటుంది. కాకపోతే పైన ఫ్లాట్‌గా ఉంటుంది. హీథర్‌ గ్రే, సాండ్‌స్టోన్‌, చార్‌కోల్‌, ట్విలైట్‌ బ్లూ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది. ఎకోతోపాటు ఎకో డాట్‌, ఎకో షో, ఎకో స్పాట్‌లు కూడా ఉన్నాయి.

గూగుల్‌ హోమ్‌ మినీలాగా ఇందులో అమెజాన్‌ ఎకో డాట్‌ ఉంటుంది. చూడటానికి అచ్చూ అలాగే కనిపిస్తుంది. అమెజాన్‌లో దీని ధర రూ. 2,449గా ఉంది. ఇక ఎకో థర్డ్‌ జనరేషన్‌ ధరను రూ. 9,999గా నిర్ణయించారు. సెకండ్‌ జనరేషన్‌ కావాలన్నా అమెజాన్‌ వెబ్‌సైట్‌లో కొనుక్కోవచ్చు. దీని ధర రూ. 6,999.

ఇక డిస్‌ప్లే కావాలనుకుంటే అమెజాన్‌లో ఎకో షో 5 ఉంది. దీని ధర రూ. 5,499. 5.5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇందులో ఉంటుంది. ఇది సేమ్‌ గూగుల్‌ నెస్ట్‌ హబ్‌లాగే పని చేస్తుంది. వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు, స్మార్ట్‌ డోర్‌బెల్‌తో కనెక్ట్‌ చేయొచ్చు.

ఓకే గూగుల్ ..

ఇంట్లో కూర్చున్న చోటు నుంచి కదలకుండా మీరు చెప్పే పనులన్నీ ఈ స్మార్ట్‌ స్పీకర్స్‌ చేసి పెడతాయి. మొదట్లో కేవలం మ్యూజిక్‌ వినిపించడానికి పరిమితమైన ఈ స్పీకర్స్‌.. రానురాను ఒక్కో ఫీచర్‌ను యాడ్‌ చేసుకుంటూ వెళ్తున్నాయి. ఇవి చేసే పనులేంటో ఇప్పుడు చూద్దాం.

మ్యూజిక్‌

గూగుల్‌ హోమ్‌ అయినా, అమెజాన్‌ ఎకో అయినా మ్యూజిక్‌ వినడానికి బాగా పనికొస్తాయి. ఇవి రెండూ వివిధ స్ట్రీమింగ్‌ సర్వీస్‌ల నుంచి మ్యూజిక్‌ను ప్లే చేయగలవు. జస్ట్‌.. మీకు కావాల్సిన పాటను వాయిస్‌ కమాండ్‌ ద్వారా చెబితే చాలు.

గూగుల్‌ హోమ్‌ అయితే గూగుల్‌ ప్లే మ్యూజిక్‌తోపాటు స్పాటిఫై, పాండోరా, యూట్యూబ్‌లలో నుంచి సాంగ్స్‌ను సెలక్ట్‌ చేసి వినిపిస్తుంది. అదే ఎకో అయితే అమెజాన్‌ మ్యూజిక్‌తోపాటు ఇతర స్ట్రీమింగ్‌ సర్వీసుల్లో వెతుకుతుంది. మీకు నచ్చిన స్ట్రీమింగ్‌ సర్వీస్‌ను డిఫాల్ట్‌గా సెట్‌ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా ఇవి అందులోనే వెతుకుతాయి.

వీటి సౌండ్‌ మీకు నచ్చకపోతే.. ఇతర స్పీకర్లతోనూ లింక్‌ చేయొచ్చు. గూగుల్‌ అయితే క్రోమ్‌క్యాస్ట్‌ లేదా బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకునే వీలుంటుంది. క్రోమ్‌కాస్ట్‌ ఉంటే మీ టీవీలోనూ గూగుల్‌ అసిస్టెంట్‌ మ్యూజిక్‌ ప్లే చేస్తుంది.

అలాగే వివిధ ఓటీటీ సర్వీస్‌ల నుంచి మీకు నచ్చిన షోను కూడా ప్లే చేసుకోవచ్చు. ఎల్జీ, సోనీలాంటి కంపెనీలు ఇప్పటికే బిల్టిన్‌ గూగుల్‌ అసిస్టెంట్‌తో కొన్ని టీవీలను రిలీజ్‌ చేశాయి.

మీ అసిస్టెంట్‌

గూగుల్‌ హోమ్‌ లేదా అమెజాన్‌ ఎకో .. ఇవి రెండూ మీ పర్సనల్‌ అసిస్టెంట్‌లా మీరు చెప్పిన పని చేస్తాయి. మీరు రెగ్యులర్‌గా చేసే చిన్న చిన్న పనులు అంటే.. వెబ్‌లో వెతకడం, బయట వాతావరణ సమాచారం ఇవ్వడం, ఈకామర్స్‌ సైట్లలో వస్తువులు కొనుగోలు చేయడంలాంటివి చేసి పెడతాయి.

గూగుల్‌ హోమ్‌లోని గూగుల్ అసిస్టెంట్‌ అయితే గరిష్ఠంగా ఇంట్లోని ఆరుగురు వ్యక్తుల గొంతులను గుర్తు పట్టగలదు. ఎవరు మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి.. వాళ్లకు తగిన సమాచారం ఇస్తుంది. ఉదాహరణకు ఉదయం నిద్ర లేవగానే ఓకే గూగుల్ .. గుడ్ మార్నింగ్ అని చెప్పగానే వాతావరణం వివరాలు, మీ షెడ్యూలు వివరాలు చెప్పేస్తుంది. గూగుల్ క్యాలెండర్ లో మీరు షెడ్యూలు చేసుకున్న అపాయింట్మెంట్లు, ఇతర వివరాలను చెప్పేస్తుంది. 

ఎవరి వాయిస్‌ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి ఆ మేరకు సమాచారం అందిస్తుంది. ఎవరి ప్రొఫైల్‌ వాళ్లు క్రియేట్‌ చేసుకోవచ్చు. మీ వాయిస్‌ని బట్టి గూగుల్‌ హోమ్‌ వాయిస్‌ కూడా మార్చుకునే వీలుంటుంది.

పైగా ఫిమేల్‌ వాయిసే కాకుండా మేల్‌ వాయిస్‌లోకి కూడా గూగుల్‌ హోమ్‌ని మార్చుకోవచ్చు. ఈ ఫీచర్స్‌ అమెజాన్‌ ఎకోలో ప్రస్తుతానికి అందుబాటులో లేవు. పైగా గూగుల్‌ హోమ్‌ తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లోనూ మాట్లాడగలదు. ఎకో ప్రస్తుతానికి ఇంగ్లిష్‌, హిందీకే పరిమితమైంది. ఇతర భాషలపైనా అమెజాన్‌ దృష్టి సారిస్తోంది.

ఇతర పనులు

– గూగుల్‌ హోమ్‌, అమెజాన్‌ ఎకో బ్రాడ్‌కాస్టింగ్‌కు బాగా పనికొస్తాయి. అంటే ఈ స్మార్ట్‌ స్పీకర్స్‌లో మీరు ఏదైనా అనౌన్స్‌ చేస్తే.. ఇంట్లో ఉన్న అన్ని కనెక్టెడ్‌ స్పీకర్స్‌లో దానిని ప్లే చేస్తుంది. అవతలి వ్యక్తికి మీ వాయిస్‌ కమాండ్‌ ద్వారానే మీరు రిప్లై కూడా ఇవ్వొచ్చు.

– ఇక వంట రానివారికీ కిచెన్‌లో సాయం చేస్తుంది. ఏదైనా వంటను స్టెప్‌ బై స్టెప్‌ మీకు వివరిస్తుంది. కావాలంటే ముందుకు, వెనక్కి వెళ్లి మళ్లీ మళ్లీ వినొచ్చు.

– గూగుల్‌ హోమ్‌కైతే ఒకేసారి వరుసగా రెండు వాయిస్‌ కమాండ్స్ ఇవ్వొచ్చు. గూగుల్ అసిస్టెంట్‌ మీరు అడిగిన ప్రశ్నలకు వరుసగా సమాధానం ఇస్తుంది. అమెజాన్‌ ఎకోలో ఈ ఆప్షన్‌ లేదు. ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చిన తర్వాత మరో ప్రశ్న అడగాల్సి ఉంటుంది.

– ఇక ఇవి రెండూ టైమ్‌కు తగినట్లుగా తమ వాయిస్‌ను కంట్రోల్‌ చేసుకుంటాయి. రాత్రి సమయంలో ఇతరులెవరికీ ఇబ్బంది కలగకుండా తమ వాల్యూమ్‌ తగ్గించుకుంటాయి.

– మీ మూడ్‌ బాగా లేకపోతే జోకులు కూడా వినిపించి నవ్విస్తాయి. హోమ్‌ అయినా, ఎకో అయినా.. జస్ట్‌ టెల్‌ మీ ఎ జోక్‌ అంటే చాలు.. మిమ్మల్ని నవ్వించడానికి ఎన్నో జోక్స్‌ను సిద్ధంగా ఉంచుతాయి.

– ట్రాఫిక్‌ సమాచారం అందిస్తాయి. ప్రతి రోజూ ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లే దారిని సెట్‌ చేసి పెడితే చాలు.. ఆఫీస్‌కు వెళ్లే సమయంలో ఆ రూట్‌లో ట్రాఫిక్‌ సమాచారాన్ని ఈ స్మార్ట్‌ స్పీకర్స్‌ను అడిగి తెలుసుకోవచ్చు.

– క్యాబ్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో ఉన్న ఓలా లేదా ఊబర్‌ లేదా ఏ ఇతర క్యాబ్‌ సర్వీసునైనా సరే గూగుల్ హోమ్ లేదా అలెక్సాకు లింక్‌ చేస్తే.. మీకు అవసరమైనప్పుడల్లా క్యాబ్‌ బుక్‌ చేసి పెడుతుంది.

– లొకేషన్‌ ఆధారంగా పని చేస్తాయి కాబట్టి.. మీకు దగ్గర్లో ఉన్న స్టోర్లు, రెస్టారెంట్లు, హాస్పిటల్స్‌ సమాచారం కూడా అందిస్తాయి. అవి ఎక్కడ ఉన్నాయి.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెరిచి ఉంటాయి వంటి డిటేల్స్‌ ఇస్తాయి.

– నెలవారీ ఇంట్లోకి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం మనకు అలవాటు. అయితే ఈ లిస్ట్‌ అప్పటికప్పుడు గుర్తుకు రాదు. తరచూ ఏదో ఒక వస్తువు మరచిపోతూనే ఉంటాం. ఇలాంటి సమయంలో ఇంట్లో ఏదైనా అయిపోగానే దానిని ఈ స్మార్ట్‌ స్పీకర్స్‌ చెవిలో వేసి ఉంచితే.. వాటిని షాపింగ్‌ లిస్ట్‌లో యాడ్‌ చేసి పెడుతాయి.

గూగుల్ కే పరిమితమైన సేవలు

ఇక గూగుల్‌ హోమ్‌కు మాత్రమే పరిమితమైన మరికొన్ని ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. ఇవి అమెజాన్‌ ఎకోలో ఇంకా అందుబాటులోకి రాలేదు.

– గూగుల్‌ అసిస్టెంట్‌ తెలుగు సహా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోకి వచ్చేసింది. ఇంగ్లిష్‌, హిందీతోపాటు ఈ భాషల్లోనూ గూగుల్‌ హోమ్‌తో కమ్యూనికేట్‌ కావచ్చు. అదే అమెజాన్‌లో ఇంగ్లిష్‌ కాకుండా కేవలం హిందీ మాత్రమే అందుబాటులో ఉంది.

– గూగుల్‌ హోమ్‌ ద్వారా వాట్సాప్‌ మెసేజ్‌లు కూడా పంపే వీలుండటం విశేషం. ఒకసారి మీ వాట్సాప్‌ అకౌంట్‌ను హోమ్‌తో లింక్‌ చేసుకుంటే చాలు. ఆ తర్వాత నుంచి మీ కాంటాక్ట్‌లోని ఎవరికైనా వాయిస్‌ కమాండ్‌ ద్వారా వాట్సాప్‌ మెసేజ్‌ పంపించవచ్చు. ఈ ఫీచర్‌ అమెజాన్‌ అలెక్సాలో ఇంకా అందుబాటులోకి రాలేదు.

– మనం తరచూ ఇంట్లో ఫోన్‌ ఎక్కడో పెట్టి మరచిపోతుంటాం. ఇలాంటి సమయంలో గూగుల్‌ హోమ్‌ దానిని వెతికి పెడుతుంది. ఇది ఎలా పని చేస్తుందంటే.. ముందుగా ఐఎఫ్‌టీటీటీ యాప్‌ ద్వారా గూగుల్‌ హోమ్‌కు కనెక్ట్‌ కావాలి. ఆ తర్వాత ఎప్పుడైనా ఫోన్‌ వెతకాలి అనుకుంటే.. ఓకే గూగుల్‌, ఫైండ్‌ మై ఫోన్‌ అని చెబితే చాలు.. మీ ఫోన్‌కు అలర్ట్‌ రింగ్‌ పంపిస్తుంది.

– ఇక హోమ్‌లో ఉన్న మరో అడ్వాంటేజ్‌ ఏంటంటే.. అలెక్సా కంటే ఎంతో మెరుగ్గా వెబ్‌లో సమాచారం వెతికి పెడుతుంది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో గూగుల్‌ హోమ్‌ చాలా ముందు ఉంటుంది.

లేటెస్ట్‌గా 360ఐ చేసిన అధ్యయనంలో ఈ రెండింటినీ 3 వేల ప్రశ్నలు అడిగారు. ఇందులో గూగుల్‌ 72 శాతం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగా.. అలెక్సా మాత్రం కేవలం 13 శాతానికే పరిమితమైంది. అంటే సుమారు ఆరు రెట్లు మెరుగైన పనితీరు గూగుల్‌ హోమ్‌ కనబరచింది.

స్మార్ట్‌ డివైసెస్‌ కంట్రోల్‌

అసలు మన ఇళ్లు మెల్లగా స్మార్ట్‌ అవుతున్నాయంటే కారణం ఈ స్మార్ట్‌ స్పీకర్సే. మనకు రోజువారీ పనుల్లో సాయపడుతున్న ఈ స్పీకర్స్‌.. ఇంట్లో ఉన్న స్మార్ట్‌ డివైస్‌లనూ కంట్రోల్‌ చేయగలవు. ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న ప్రతి స్మార్ట్‌ డివైస్‌ను గూగుల్ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సాలకు లింక్‌ చేయొచ్చు.

ఇంట్లోని స్మార్ట్‌ బల్బ్స్‌, స్మార్ట్‌ ప్లగ్స్‌, స్మార్ట్‌ స్విచెస్‌, స్మార్ట్‌ టీవీస్‌, స్మార్ట్‌ లాక్, సెక్యూరిటీ కెమెరాలు, థర్మోస్టాట్లు‌.. ఇలా దాదాపు ప్రతి స్మార్ట్‌ డివైస్‌కూ వీటి ద్వారా వాయిస్‌ కమాండ్స్‌ ఇచ్చుకోవచ్చు.

అమెజాన్‌ ఎకో అయితే దాదాపు 60 వేల స్మార్ట్‌ డివైస్‌లతో పని చేయడం విశేషం. అదే గూగుల్‌ హోమ్‌ అయితే 30 వేల డివైస్‌లను కంట్రోల్‌ చేయగలదు. 

మీకు కూడా వర్చువల్ అసిస్టెంట్ కావాాలా? మరింకెందుకు ఆలస్యం ఓకే గూగుల్ లేదా అలెక్సా అని పిలవడం అలవాటు చేసుకోండి. 

ఇవి కూడా చదవండి

Exit mobile version