భారత్‌లో కూడా గూగుల్ వాలెట్ అనే యాప్‌ను విడుదల చేసింది. మరి దీని ఉపయోగమేంటి? మరి గూగుల్ పే ఏం అవుతుంది? అనే మరిన్ని విషయాలు చూద్దాం. టెక్ దిగ్గజం గూగుల్ భారత్‌లో మరో కొత్త సర్వీస్‌ను తీసుకు వచ్చింది. అదే గూగుల్ వాలెట్. ఇది డిజిటల్ వాలెట్ ప్లాట్‌ఫారమ్. అంటే గూగుల్ పేకి భిన్నమైనది. ఇందులో వినియోగదారులు లాయల్టీ కార్డ్, ఈవెంట్ టికెట్లు, సినిమా టికెట్లు, గిఫ్ట్ కార్డ్, బోర్డింగ్ పాస్ వంటి మరిన్నింటిని భద్రపరుచుకోవచ్చు. గత కొన్ని వారాలుగా ఇది ప్లేస్టోర్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని భారత్‌లో లాంచ్ చేశారు. ఈ యాప్ బుధవారం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఈ డిజిటల్ వాలెట్ గూగుల్ పే కి కాంప్లిమెంటరీ సర్వీస్‌గా పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. అలాగే గూగుల్ భారతదేశంలోని 20కి పైగా బ్రాండ్‌లతో ఒప్పందం చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రముఖ కంపెనీలు ఈ సర్వీస్‌లో యాడ్ అవుతాయని గూగుల్ కంపెనీ చెబుతోంది. గూగుల్ వాలెట్ ఫీచర్లు తెలుసుకుందాం.
గూగుల్ వాలెట్ ఏ విధంగా పనిచేస్తుంది?
గూగుల్ వాలెట్ తొలిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో పేమెంట్ యాప్‌గా విడుదలైంది. తర్వాత దీన్ని డిజిటల్ వాలెట్‌గా రీలాంచ్ చేసింది. ఇప్పుడు ఈ యాప్‌ను భారతదేశంలో ప్రారంభించింది. అయితే ఈ గూగుల్ వాలెట్‌లో ఏ విధమైన చెల్లింపులు చేయడానికి ఉపయోగపడదు. ఇందులో కేవలం కార్డ్‌లు, ట్రాన్సిట్ పాస్‌లు, ఆఫీస్ బ్యాడ్జ్‌లు, వ్యాక్సిన్ రికార్డ్‌లు, కార్ కీస్, బోర్డింగ్ పాస్‌లు, స్టూడెంట్ ఐడీల డిజిటల్ వెర్షన్‌లను దాచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపింది.
రెండింటికీ వ్యత్యాసం ఉందా?
గూగుల్ వాలెట్ సర్వీస్ కోసం భారతదేశంలో గూగుల్ కంపెనీ పీవీఆర్ అండ్ ఐనాక్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఫ్లిప్‌కార్ట్, అబీబస్, కొచ్చి మెట్రో వంటి 20కి పైగా ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. భారత్‌లో గూగుల్ వాలెట్ యాప్ డిజిటల్ వాలెట్‌గా మాత్రమే పని చేస్తుంది. యూజర్లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను దీనికి యాడ్ చేయలేరు.
మీకు అవసరమైనప్పుడు కీలక డాక్యుమెంట్లు, కార్డులు యాప్‌లో డిజిటల్ వెర్షన్‌లో అందుబాటులో పెట్టుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్‌ఫారమ్‌లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, గిఫ్ట్ కార్డులు, మరెన్నో భద్రపరుచుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్