Instagram new features: ఇన్స్టాగ్రామ్ డిజిటల్ క్రియేటర్స్ కోసం మరో 4 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. సరికొత్త కంటెంట్‌తో పాపులారిటీ సాధిస్తున్న డిజిటల్ క్రియేటర్స్‌కు కొత్త జోష్ తీసుకొచ్చింది. మరి ఆ నాలుగు ఫీచర్లు ఏంటి? ఎలా వాడాలి? వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది? ఇలాంటి విషయాలన్నీ ఈ స్టోరీలో మీ కోసం.
ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్లు:
- రివీల్
- ఫ్రేమ్స్
- యాడ్ యువర్ మ్యూజిక్ స్టిక్కర్స్
- కట్అవుట్
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఎప్పటికప్పుడు అనువుగా వారికి అవసరానికి తగ్గట్టుగా మంచి ఫీచర్లను తీసుకువచ్చి యువతను ఆకట్టుకునే దిశలో నడుస్తుంది. అందుకే ఈ యాప్‌కు ఉన్న ఫాలోయింగ్ దేనికీ లేదు. ఇంకా చెప్పాలంటే ప్రతీ ఒక్కరు ఈ యాప్‌కు అడిక్ట్ అవుతున్నట్టే. గతంలో కంటెంట్ క్రియేటర్ల కోసం సరికొత్త ఎడిట్ ఆప్షన్లు తీసుకొచ్చిన ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు తమ యూజర్ల కోసం మరో 4 కొత్త ఫీచర్లను జోడించింది. ఇవి ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లతో కనెక్ట్ అయ్యేందుకు చాలా ఉపయోగపడతాయి.
Reveal: రివీల్
మామూలుగా ఇన్‌స్టాగ్రామ్లో స్టోరీ అప్లోడ్ చేసే ముందు స్టిక్కర్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే లొకేషన్, హ్యాష్‌ట్యాగ్, అవతార్, టెంప్లేట్స్, ఫోటో లాంటి మరెన్నో ఆప్షన్లు కనిపిస్తాయి. ఇప్పడు తాజాగా అందులో REVEAL అనే మరో ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే Message to reveal అనే ఒక చిన్న బాక్స్ స్క్రీన్‌పై కనబడుతుంది. అందులో మీరు ఏదైతే స్టేటస్ పెట్టాలనుకున్నారో దానికి సంబంధించిన హింట్ ఇవ్వవచ్చు.
లేదా మీకు నచ్చిన టెక్స్ట్‌ను టైప్ చేసి సింపుల్‌గా మీ స్టోరీని పోస్ట్ చేయవచ్చు. అంతే! ఎవరైనా మీ స్టోరీపై క్లిక్ చేస్తే మొదట మీరు పెట్టిన హింట్ కనిపిస్తుంది. వారు డీఎం ( డైరెక్ట్ మెసేజ్) చేస్తేనే మీ స్టోరీ రివీల్ అవుతుంది. అలాగే మీరు పోస్ట్ చేసిన స్టోరీ ఫాలోవర్లకు ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి Preview అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఇతరులు మీ స్టోరీ చూసేందుకు ప్రతి డీఎంను అప్రూవ్ చేయాల్సిన పని లేదు.
Frames: ఫ్రేమ్స్
ఇన్స్టాగ్రామ్‌లోని స్టిక్కర్ ఐకాన్‌లో Framesను సెలెక్ట్ చేసుకుంటే, అది మీ ఫొటో గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అందులో మీకు నచ్చిన ఫొటోను సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఫ్రేమ్ డిజైన్‌తో మీ ఫోటో అక్కడ కనబడుతుంది. అప్పుడు దానికింద సమయం, తేదీ (టైమ్ & డేట్) ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. కావాలనుకుంటే మీరు దానికి క్యాప్షన్ కూడా పెట్టవచ్చు. ఫాలోవర్లు మీ స్టోరీపై క్లిక్ చేయగానే shake to reveal అనే బటన్ కనిపిస్తుంది. వాళ్లు మొబైల్‌ను షేక్ చేయగానే ఫొటో కనిపిస్తుంది.
Add your Music: యాడ్ యువర్ మ్యూజిక్
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టేటప్పుడు దానికి మ్యూజిక్ యాడ్ చేయాలంటే ప్రత్యేకంగా మ్యూజిక్ సింబల్‌తో ఒక ఐకాన్ ఉంటుంది. దాని సాయంతో ఫొటోలకు, వీడియోలకు నచ్చిన పాటను జోడించేవాళ్లం. అయితే ఇప్పుడు ఒక ఇంట్రస్టింగ్ ఫీచర్ ఏంటంటే.. మీరు పెట్టే స్టోరీకి ఇతరులు కూడా సాంగ్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు స్టోరీ అప్లోడ్ చేసేముందు, స్క్రీన్‌పై కనిపించే స్టిక్కర్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు Add Yours Music అనే ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే +, Add Music పేరుతో ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేసి, మీకు నచ్చిన పాటను ఎంచుకొని స్టోరీ పోస్ట్ చేయవచ్చు. ఫాలోవర్లు ఆ స్టోరీని చూసేటప్పుడు Add Yours అనే బటన్ కనిపిస్తుంది. దాని సాయంతో వాళ్లకు నచ్చిన పాటను యాడ్ చేసుకోవచ్చు.
Cutout: కట్అవుట్
మనకు నచ్చిన ఫొటోను లేదా వస్తువును కటౌట్ స్టిక్కర్‌గా మార్చుకునేందుకు వాట్సప్‌లో ఒక ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పడు దాన్నే తాజాగా ఇన్స్టాగ్రామ్ కూడా తమ యూజర్ల కోసం తీసుకువచ్చింది. మీకు స్టోరీ సెలెక్ట్ చేయగానే స్క్రీన్‌పై స్టిక్కర్ ఐకాన్ కనిపిస్తుంది. దానిలో Cutouts ని సెలక్ట్ చేసుకుంటే గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. అందులో మీకు నచ్చిన ఫొటో లేదా వీడియోను ఎంచుకుంటే చాలు. ఆటోమేటిక్గా కటౌట్ స్టిక్కర్ క్రియేట్ అవుతుంది. అది మీకు నచ్చకపోతే Select manually అనే ఆప్షన్ను ఎంచుకుని, మీకు నచ్చిన వస్తువును సెలెక్ట్ చేసి తిరిగి స్టికర్ క్రియేట్ చేసుకోవచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్