Home స్కిల్స్ వేస‌విలో ఏసీ వాడ‌కం క‌రెంటు బిల్లు పెంచుతుందా! అయితే ఈ 9 చిట్కాలు మీ కోసం

వేస‌విలో ఏసీ వాడ‌కం క‌రెంటు బిల్లు పెంచుతుందా! అయితే ఈ 9 చిట్కాలు మీ కోసం

Interior of bedroom with big bed and wardrobe
ఏసీ వినియోగం వల్ల కరెంటు బిల్లు పెరుగుతోందా? ఈ చిట్కాలతో తగ్గించుకోండి Photo by Max Vakhtbovycn on Pexels

AC Electricity consumption: వేస‌విలో ఏసీ వినియోగం వల్ల విద్యుత్‌ బిల్లుల మోత మోగుతుంది. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల బిల్లుల భారం తగ్గించుకోవచ్చు. ఇప్పటికే మార్కెట్లోకి అధునాతన ఫీచర్లు, విద్యుత్తు బిల్లులు తగ్గించగలిగే సామర్థ్యం ఉన్న ఇన్వర్టర్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఏ ఏసీ అయినా ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ చూడండి.

1. ఏసీ (ఎయిర్ కండీష‌నర్) ఎంత టెంపరేచర్‌పై పెట్టుకోవాలి?

సాధార‌ణంగా గది ఉష్టోగ్ర‌త 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేలా ఏసీ ఉపయోగించాలి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 25 మీద పెట్టుకుంటే సరిపోతుంది. 24 నుంచి ఒకొక్క డిగ్రీ పైకి పెంచుతున్నప్పుడు 6% విద్యుత్ ఆదా అవుతుంద‌ట‌. చాలామంది 18 డిగ్రీల‌లో ఏసీని వాడుతూ ఉంటారు. అలా చేయ‌డం వ‌ల్ల ఏసీ కంప్రెష‌ర్‌పై ఎక్కువ భారం పడుతుంది. త‌ద్వారా క‌రెంటు బిల్లు అధికంగా వ‌స్తుంది. ఏసీల‌పై ఎక్కువ భారం ప‌డ‌కుండా  ఉండాలంటే 25 నుంచి 27 డిగ్రీలు మెయింటైన్ చేస్తే గ‌ది చ‌ల్ల‌గా ఉండడంతో పాటు విద్యుత్‌ను ఆదా చేసుకోవచ్చు.

2. ఏసీ సామర్థ్యం

గదికి స‌రిప‌డా ఏసీని ఎంచుకోవ‌డం మంచిది. గ‌ది వైశాల్యం బట్టి దానికి త‌గ్గ‌ట్టుగా ఏసీని ఎంచుకోవాలి. గ‌ది ప‌రిమాణం సాధార‌ణంగా 12 నుంచి 14 చదరపు అడుగుల లోపు ఉంటే 1 ట‌న్ను ఏసీ స‌రిపోతుంద‌ట‌. అంతకంటే ఎక్కువ ఉంటే 1.5 నుంచి 2 ట‌న్నుల ఏసీని ఎంచుకోవ‌డం ఉత్త‌మం అంటున్నారు నిపుణులు. ఎక్కువ ట‌న్నులు ఉన్న‌ట్లైతే ఎక్క‌వ కరెంటు బిల్లు వ‌స్తుంది. కాబ‌ట్టి గ‌ది ప‌రిమాణాన్ని బ‌ట్టి త‌క్కువ ట‌న్నులు ఉన్న ఏసీని తీసుకుంటే విద్యుత్‌ను ఆదా చేయ‌వ‌చ్చు.

3. ఏసీ స‌ర్వీసింగ్:

ఏసీ వాడేయ‌డంతోనే స‌రిపోదు. వాటిని ఎప్పుటిక‌ప్ప‌డు సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. సంవ‌త్స‌రానికి కనీసం రెండుసార్లు స‌ర్వీసింగ్ చేయించాలి. ఇలా చేస్తే ఏసీ కండీష‌న్ బావుంటుంది. త‌ద్వారా విద్యుత్‌ భారం కూడా త‌గ్గుతుంది. ముఖ్యంగా ఏసీ ఫిల్ట‌ర్‌లో దుమ్ము, ధూళి చేరుతుంటుంది. వాటిని క్లీన్ చేయ‌క‌పోతే కంప్రెషర్‌పై భారం పడి, ఏసీ సామ‌ర్థ్యం తగ్గి ఎక్కువ బిల్లు వ‌స్తుంది.

4. గ్యాస్ లీక్ అవ‌కుండా చూసుకోవాలి:

ఏసీలో గ్యాస్ లీక్ అవ‌డం వ‌ల‌న ఎంత సేపు ఏసీ తిరిగినా గ‌ది చ‌ల్ల‌బ‌డ‌దు. స‌ర్వీసింగ్ చేయించిన‌పుడు గ్యాస్ ప్రెష‌ర్ చెక్ చేసుకోవాలి. ఒక‌సారి కంప్రెష‌ర్ ఆన్ అవ‌డానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆన్ అయినా చ‌ల్ల‌గాలి రాకుండా ఉంటుంది. ఇలాంట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా స‌ర్వీసింగ్ చేయించాలి.

5. అవుట్ డోర్ ఏసీకి ఎండ త‌గ‌ల‌కూడదు:

అవుట్ డోర్ ఏసీ బాక్స్‌లో కండెన్స‌ర్ క్వాయిల్, ఫ్యాన్ ఉంటాయి. దీనిపై సాధ్యమైనంత వరకు ఎండ ప‌డకుండా చూసుకోవాలి. నీడ ప‌డేలా చూసుకుంటే కొంత‌వ‌ర‌కూ విద్యుత్‌ను ఆదా చేయ‌వ‌చ్చు.

6. కిటికీలు, త‌లుపులు క్లోజ్ చేయాలి.

ఏసీ ఆన్ చేసిన‌పుడు గ‌ది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేయాలి. చ‌ల్ల‌గాలి బ‌య‌టికి పోతుంటే ఏసిలో కంప్రెష‌ర్ ఎక్కువ సేపు ప‌నిచేయాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోకి ఎండ రాకుండా కిటికీల‌కు మందంగా ఉన్న క‌ర్టెన్లు వాడాలి. ఇలా చేస్తే బ‌య‌టి వేడి లోప‌లికి రాకుండా ఏసీ గ‌ది చ‌ల్ల‌బడుతుంది. ఎక్కువ‌సేపు ఏసీ తిర‌గ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దు. త‌ద్వారా బిల్లు ఆదా అవుతుంది.

7. ఫ్యాన్ వేస్తే మంచిది:

ఏసీ వేసిన‌ప్పుడు ఫ్యాన్ కూడా వేసుకుంటే చల్లదనం గది అంతటికీ త్వరగా పరుచుకుంటుంది. కాక‌పోతే ఫ్యాన్ త‌క్కువ స్పీడ్‌లో పెట్టాలి. ఫ్యాన్ ఎక్కువ స్పీడులో పెడితే గాలి వేడెక్కుతుంది. తద్వారా తిరిగి ఏసీపై భారం పడుతుంది.

8. ఏసీ టైమర్:

తెల్లవారుజామున మనం లేచే వరకూ ఏసీ అక్కర్లేదనుకుంటే అర్ధరాత్రి ఏ రెండు మూడు గంటలకో ఏసీ ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోయేందుకు టైమర్‌ను వాడొచ్చు.

9. ఏసీ ఫ్యాన్ వేగం

ఏసీలో టెంపరేచర్‌ హెచ్చుతగ్గులు చేసుకున్నట్టుగానే గాలి వేగం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఫ్లో ఎక్కువగా కాకుండా ఆటోమోడ్‌లోగానీ, లో మోడ్‌లో గానీ పెట్టుకుంటే విద్యుత్తు వినియోగం తగ్గుతుంది. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version