Home హెల్త్ Cashew nut fruit: జీడిమామిడి.. ఈ వేసవి పండ్లతో ఎన్నో అద్భుతాలు

Cashew nut fruit: జీడిమామిడి.. ఈ వేసవి పండ్లతో ఎన్నో అద్భుతాలు

cashew, nature, nut
జీడిమామిడి పండ్లు Photo by suhasrawool on Pixabay

Cashew nut fruit: ప్రకృతిలో జీడిమామిడి పండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, జీడిమామిడిలో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో జీడిపళ్లు విరివిగా పండుతాయి. కొండ ప్రాంతాలు, నల్ల రేగ‌డితో పాటు ఇత‌ర నేల‌ల్లో కూడా పండుతాయి. జీడిమామిడి కావాలంటే ప్ర‌తీ ఏడాది వేస‌వి కాలం వ‌ర‌కూ ఎదురుచూడాల్సిందే. ఎందుకంటే ఇవి కేవ‌లం వేస‌వి కాలంలోనే పండుతాయి. ఈ పండ్లను తింటే వగరుగా, పుల్ల‌గా, తియ్యగా విభిన్న రుచుల‌తో నిండి ఉంటాయి. ఈ జీడిరసం బట్టల మీద పడితే మాత్రం ఆ మరక ఎన్ని డిటెర్జెంట్లు రాసినా వదలదు. చర్మం మీద పడినా కొంచెం ప్రమాదమే అంటారు. అందుకే వీటితో కాస్త జాగ్రత్తగా ఉండటమే మేలు. 

పోషకాల గని జీడిమామిడి

జీడి పిక్కలను జీడిపప్పుగా తయారు చేసి విక్రయిస్తుంటారు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఈ పప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ బి1, విటమిన్ బీ2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక రక్తపోటు(బీపీ) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ, పొటాషియం నిల్వలు ఎక్కువగానూ ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్‌ను రాకుండా అడ్డుకుంటాయి. అయితే, ఈ పప్పును ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది. 

జీడిమామిడి ప్ర‌యోజ‌నాలు

మంచి రంగు, రుచి, ఘాటైన వాస‌న క‌లిగి ఉన్న జీడిమామిడి పండు తిన‌గానే  గొంతులో ఒక ర‌క‌మైన జీర వ‌స్తుంది. అందుకే చాలా మంది దీనిని తిన‌డానికి ఆస‌క్తి చూపించరు. ఒకటి, రెండు రోజుల‌కు మించి నిల్వ చేసుకునేందుకు అవ‌కాశం లేని పండు కావ‌డంతో, త్వ‌ర‌గా కుళ్లిపోయే స్వ‌భావం క‌లిగి ఉంటుంది. పచ్చి గానూ, లేదా వేయించి తినే జీడిపప్పులోనూ ఉండే అనకార్డిక్ ఆమ్లాలు దంత సమస్యలను నివారిస్తాయి. వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినడం వల్ల అతిసార విరేచనాలు తగ్గుతాయి. ఈ జీడిపప్పు ఆయిల్‌ను యాంటీ ఫంగల్ సమస్యలకు విరుగుడుగా, కాలిపగుళ్లకు మందు గానూ ఉపయోగిస్తారు.

ఆహార ఉత్ప‌త్తుల్లో జీడిమామిడి

జీడిమామిడి పళ్లతో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. వీటి ర‌సంతో శీత‌ల పానీయాలు, వీటి గుజ్జుతో జామ్, మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్, టూటీ ఫ్రూటీ , వినిగ‌ర్‌ల‌ను కూడా త‌యారు చేస్తారు. బాగా మ‌గ్గిన త‌ర్వాత పళ్లు సేక‌రించి, నీటితో బాగా శుభ్రం చేసి ఆపై చేతుల‌తోగాని, మెషీన్‌తో గాని  ర‌సాన్ని తీస్తారు. దీనికోసం జ్యూస్ ఎక్స్‌ట్రాక్ట‌ర్ వాడుతారు. ఇది 70 శాతం ర‌సాన్ని తీయ‌డంతో పాటు గంట‌కు 150 కిలోల పండ్ల నుంచి ర‌సాన్ని తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ర‌సంలో కొద్దిగా జీర ఉంటుంది. ఆ జీర‌ను తొల‌గించ‌డానికి స‌గ్గు బియ్యంతో చేసిన గంజిని వాడ‌తారు. అంతేకాదు ఈ జీడిమామిడితో ఆవ‌కాయ ప‌చ్చ‌డి కూడా పెడుతూ ఉంటారు. వీటిని పిల్ల‌లు ఇష్ట‌ప‌డే విధంగా చిప్స్ రూపంలో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక జీడిమామిడి పండ్ల రసంతో మద్యం కూడా తయారు చేస్తారు. గోవాలో ఫెనీ అనే మద్యాన్ని ఈ జీడిమామిడితోనే తయారు చేస్తారు.

ఔష‌ధంగా జీడిమామిడి

వీటిలో అనేక ర‌కాల పోష‌క విలువ‌లతో పాటు ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీనిలో విట‌మిన్ సి నిమ్మ జాతుల కంటే 5 రెట్లు అధికంగా ఉంటుంది. మూత్ర పిండాల స‌మ‌స్య‌లు, క‌ల‌రా స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు జీడిపండు ఉపయోగపడుతుంది. ఈ పండును తిన‌డం వల్ల అరికాళ్ల నుంచి వ‌చ్చే ప‌గుళ్లను  అరిక‌ట్ట‌వచ్చు. ఈ పండు విత్త‌నాల‌తో పొడి త‌యారు చేసి పాము కాటుకు గురి అయిన వారికి విరుగుడుగా వాడుతూ ఉంటారు. ఇది నీళ్ల విరేచ‌నాల‌ను, స్క‌ర్వీ వ్యాధిని నివారిస్తుంది. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version