Rampa Waterfalls: ఆంధ్రప్రదేశ్‌లో చూడదగిన ప్రదేశాలలో రంపచోడవరం వాటర్ ఫాల్స్ ఒకటి. ఇది వేసవి పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ది చెందిన ఒక అందమైన టూరిస్ట్ ప్లేస్. దట్టమైన అడవులు, సుందరమైన ప్రకృతి అందాలు ఇక్కడికి వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ చాలా జలపాతాలు ఉన్నాయి. ఈ సమ్మర్‌లో మీరూ కూడా దగ్గరలో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లైతే రంపచోడవరం అద్భుతమైన ప్రదేశం. ఖచ్చితంగా మీ లిస్ట్‌లో ఉండేలా చూసుకోండి. ఫ్యామిలీతో కలిసి ఈ ట్రిప్‌కి వస్తే మాత్రం ఈ వేసవికి ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అసలు రంపచోడవరం ఎక్కడ ఉంది? అసలు ఇక్కడ ఎలాంటి జలపాతాలు ఉంటాయి? వీటన్నింటి గురుంచి ఈ స్టోరీలో చూసేయండి.
రంపలో ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి?
ఎత్తైన చెట్లు, దట్టమైన అడవులు, కొండల మధ్య ప్రవహించే సెలయేళ్లు.. ఇలా ప్రకృతి అందానికి నెలవుగా నిలిచినది రంపచోడరం. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. రంపచోడవరం అటవీ ప్రాంతం. నిత్యం పర్యాటకుల రద్దీతో కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులు రోజువారీ ఒత్తిడిని మైమరిపిస్తాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ జలపాతాలలో తడిసి ఆనందాల కేరింతలతో సందడి చేస్తూ ఉంటారు.
రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, మోతుగూడెం ప్రాంతాలలో దూకే జలపాతాలు, ప్రవహిస్తున్న వాగులు ప్రకృతి అందాలకు పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న జలపాతాలలో సీతపల్లి వాడు, పాములేరు, పింజరి కొండ, జలతరంగణి, అమృతధార లాంటి జలపాతాలు, కొండ వాగులు పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.
అందుకే ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇక్కడి సోయగాలకు మంత్రముగ్దులవుతారు. ఇక్కడ సోకిలేరు జలపాతం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేసవిలో ఎండల నుంచి సేద తీరాలంటే ఇలాంటి జలపాతాలకు తప్పక వెళ్లాల్సిందే.
Amruthadhara waterfalls: అమృతధార జలపాతం
మారేడుమిల్లి గ్రామం దగ్గర రాజమండ్రి-భద్రాచలం హైవేపై దట్టమైన అడవుల మధ్య ఈ జలపాతం ఉంది. ఇది మారేడుమిల్లి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటవీ ప్రాంతంలో ఉన్నఈ జలపాతం రెండు దశల్లో ప్రవహించడం వల్ల ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ జలపాతం 64 మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి సమీపాన కొన్ని కిలోమీటర్ల దూరంలోనే జలతరంగిణి జలపాతం ఉంది. ఈ జలపాతం యొక్క అందాలు ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తాయి. పర్యాటకులకు ఎంతో ఆహ్లదకరంగానూ, ప్రశాంతంగానూ అనిపిస్తుంది.
Rampa Waterfalls: రంప వాటర్‌ఫాల్స్
రంప జలపాతం రంపచోడవరం-మారేడుమిల్లి సమీపంలో ఉన్న చూడచక్కని ప్రదేశం. ఇది 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారే అందమైన జలపాతం. ఈ జలపాతం అందమైన, దట్టమైన అడవుల మధ్య ప్రకృతి ఒడిలో సేద తీరినట్టుగా అనిపిస్తుంది. ఇది మారేడుమిల్లి నుండి 29 కి.మీ. దూరంలో ఉంది. ఈ రంప జలపాతాలు పర్యాటకులకు ఒక మంచి ట్రెక్కింగ్ అనుభూతిని కలిగిస్తాయి. ఇది చేరుకోవడానికి 20 నిమిషాలు ట్రెక్కింగ్ చేయాలి.
అలాగే ఈ జలపాతానికి సమీపంలో ఒక పురాతనమైన ఆలయం కూడా ఉంది. అదే శ్రీ నీలంకఠేశ్వర ఆలయం. ఈ ఆలయంలో ప్రతీ ఏటా వేలా అనే ఒక ప్రసిద్ద గిరిజన నృత్యం ప్రదర్శిస్తారు. అది ఒక్క శివరాత్రి రోజునే ఈ నృత్యం ప్రత్యేకమైనదిగా ఉంటుంది.
Jalatarangini waterfall: జలతరంగణి జలపాతం
ఈ జలపాతం మారేడుమిల్లి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాలు రంప జలపాతాలతో పోలిస్తే కొంచెం వెడల్పుగా ఉంటాయి. కొండలు మరియు రాళ్ల మధ్యలో ప్రవహించే నీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ జలపాతం చూట్టూ అందమైన పచ్చని చెట్లు ప్రకృతి రమణీయతకు అద్దం పడతాయి. ఇక్కడకి వచ్చిన ప్రతీ ఒక్కరికి ఈ జలపాతం ఒక మరుపురాని గుర్తులను అందిస్తుంది. అలాగే అక్కడ సమీపాన ఉన్న గిరిజన వేషధారణలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. సుందరమైన దృశ్యాలు పర్యాటకుల మనసుకు ఎంతో ఆహ్లదాన్ని కలిగిస్తాయి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్