Kerala Waterfalls: కేరళ ప్రకృతి రమణీయత, ఆహ్లాదాన్నందించే జలపాతాలకు ప్రసిద్ధి. ఏటా కొన్ని వేల మంది టూరిస్ట్‌లకు స్వర్గధామంగా నిలుస్తోంది. అలాగే సాంస్కృతిక నిలయం కూడా. కేరళ జలపాతాలు ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆనందడోలికలలో ముంచేస్తాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం 27 జలపాతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన జలపాతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. అతిరప్పిల్లి జలపాతాలు:
కేరళలోని అతిరప్పిల్లి జలపాతాలు అత్యంత ప్రసిద్ధ జలపాతాలే కాకుండా అతి పెద్ద జలపాతాలలో ఒకటి. ఇది చాలా ఎత్తైన జలపాతం. ప్రకృతి అందాలను వీక్షంచుటకు అద్భుతమైన ప్రదేశం. ఈ జలపాతం బాహుబలి వంటి చిత్రాలలో కనిపిస్తుంది. షోలయార్ అటవీ కొండల దృశ్యాలు ఇక్కడ దర్శనిమిస్తాయి. దీని పొడవు 80 అడుగులు, వెడల్పు 330 అడుగులుగా ఉంటుంది. చలకుడి నదిలో ఇది ఉద్భవించింది.
2. వలరా జలపాతం:
ఈ జలపాతం కేరళలోని మున్నార్ సమీపంలో ఉంది. ఇక్కడ పర్యాటకును ఆకర్షించేదిగా పచ్చని చెట్లతో మనసును స్వైర విహరంలోకి తీసుకువెళుతుంది. ఈ జలపాతాల అందాలను చూస్తే తిరిగి వెనక్కి వెళ్దామనే ఆలోచన లేకుండా చేస్తుంది. గంటల కొలదీ ఈ జలపాతాలలో ఆడినా తనవితీరదు. అలాగే ఇది ట్రెక్కింగ్‌కు కూడా అనువుగా ఉంటుంది. వీటి చుట్టూ ఉండే దట్టమైన అడవులు మంచి మధురానుభూతులను కలిగిస్తాయి.
3. మీన్ ముట్టి జలపాతం:
ఈ జలపాతాలు కేరళలోని వాయినాడ్‌లో కనిపిస్తాయి. పచ్చదనాల మధ్య దాగి ఉన్న అతి సుందరమైన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఈ జలపాతం పర్యటకులను ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌కు అనువైనదిగా ఉంటుంది. ఈ జలపాతం అతి ఎత్తైన జలపాతాలలో రెండవది. ప్రకృతి అందాల మధ్య జాలువారే ఈ జలపాతం వీక్షకులను ఆకర్షిస్తుంది. అలాగే బాణాసుర సాగర్ ఆనకట్టలను ఇక్కడ నుంచి చూడవచ్చు. సువిశాలమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ అనుభవించవచ్చు.
4. పాలరువి జలపాతం:
పాలరువి జలపాతం కేరళలో అద్భుతమైన జలపాతాలలో మరొకటి. పేరులాగే జలపాతం కూడా అంతే అద్భుతంగా, పాలలాగా మెరిసిపోయినట్లు కనిపిస్తుంది. కనుక ఇక్కడికి వచ్చే ప్రతీ పర్యటకునికి మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. ఈ పాలరువి జలపాతం కొల్లాం జిల్లాలో వన్యప్రాణుల అభయారణ్యంలో ఉంది. దీనిని చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది పిక్నిక్‌కు ప్రసిద్ది చెందిన ప్రదేశం.
5. పవర్‌హౌస్ జలపాతాలు:
ఈ జలపాతం చూడడానికి ఎంతో అందమైనది. దీని చుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఉంటే చూపు తిప్పుకోలేరు. అంత రమణీయతను కలిగి ఉంటుంది. ఇది మున్నార్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతాలను చేరుకోవడానికి కూడా ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ ఉన్న దేవికులం అనే కొండల మీదుగా ట్కెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
6. చేతలయం జలపాతం:
ఇది కేరళలోని వాయినాడ్‌లో ఉన్న మరొక ప్రసిద్ది జలపాతాలలో ఒకటి. ఈ జలపాతంలో పెద్ద పెద్ద రాళ్లు, పర్యాటకులను కనువిందు చేస్తాయి. అయితే ఇది ఎండాకాలంలో నీరు ఎండిపోయినట్టుగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎంతో సోయగాలతో సుందరంగా కనిపిస్తాయి.
7. లక్కం జలపాతం:
కేరళలోని ఎంతో అందమైన, ప్రసిద్ది చెందిన జలపాతాలలో ఈ లక్కం జలపాతం ఆకర్షిస్తుంది. ఇది దట్టమైన అడవులు, కొండల మధ్య ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది మున్నార్ సమీపంలో అతి దగ్గరలో ఉంటుంది. ఇది మిగిలిన జలపాతాల కంటే ఎతైనది కానప్పటికీ, జాలువారే నీటి ప్రవాహాల అందాన్ని చూడడానికి పర్యటకులకు ఎంతో హాయిగా ఉంటుంది. ఈ జలపాతం చుట్టూ ప్రకృతి వనాలు, పచ్చదనం, అడవుల అందాలు టూరిస్ట్‌లకు స్వర్గ లోకాలను తలపిస్తాయి.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్