Home పేరెంటింగ్ గూగుల్ ఫ్యామిలీ లింక్ ఖాతాతో పిల్లల బ్రౌజింగ్ సేఫ్

గూగుల్ ఫ్యామిలీ లింక్ ఖాతాతో పిల్లల బ్రౌజింగ్ సేఫ్

kids using net
Photo by bruce mars from Pexels

గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్ ఎప్పుడైనా విన్నారా? ’నాకు మొబైల్ వాడటం సరిగా రాదుకాని మా అబ్బాయి మాత్రం మొత్తం మొబైల్ ని చుట్టబెట్టేస్తాడు’ చాలా మంది తల్లిదండ్రులు లేదా తాతలు అనడం చూస్తూనే ఉంటాం.. మరి ఆ పిల్లలు ఎటువంటి యాప్స్ మొబైల్ లో ఇన్ స్టాల్ చేస్తున్నారు.. వాటి వల్ల నష్టమేమన్న ఉందా..? అసలు ఎటువంటి వెబ్సైట్లు చూస్తున్నారు అనేది తెలుస్తుందా..? ఇదే కోణంలో ఆలోచించే తల్లిదండ్రులు కూడా పిల్లలకు స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ కొనివ్వాలని ఉన్నా ఆగిపోతున్నారు. దానికి పరిష్కారమే ఈ గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్. దీని ద్వారా మీ పిల్లలకు జీమెయిల్ ఖాతా సృష్టించవచ్చు.

మొబైల్ వల్ల పిల్లలపై వ్యతిరేక ప్రభావం ఉండటం అనేది సహజంగా అనుకునే విషయం. అదే సమయంలో పిల్లల మేధోసంపత్తి పెరగడానికి, కొత్త ఆలోచనలు పురుడు పోసుకోవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి, బైజూస్, హెలో ఇంగ్లీష్ వంటి విద్యాపరమైన యాప్స్ వినియోగించడానికి స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ అనేది పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహంలేదు.

అయితే బ్లూవేల్, పబ్జీ వంటి ఆటలకు దూరంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మొబైల్ వినియోగించేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే.. ఇప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ కోసం గూగుల్ ముందడుగు వేసి ‘ఫ్యామిలీ గ్రూప్’ కి అవకాశం ఇస్తుంది. మరి ఆ యాప్ ఎలా పనిచేస్తుంది..? దాని వల్ల ఉపయోగం ఏంటి..?  అనేది పరిశీలిద్దాం…

జీమెయిల్ ఖాతాతోనే రక్షణ..

పిల్లల వినియోగించే ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ట్యాబ్ లో ప్రైమరీ గూగుల్ ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా పిల్లలకు జీమెయిల్ ఖాతా ఉండదు కాబట్టి ఇంట్లో ఉండే పెద్దవారి ఖాతా వివరాలు ఎంటర్ చేసి మొబైల్ వినియోగానికి ఇస్తారు. అలా కాకుండా పిల్లలకు ప్రత్యేకంగా ఒక గూగుల్ ఖాతా సృష్టించాలి.

అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

 పిల్లల మొబైల్ మీ అనుమతి లేకుండా కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు.

క్రోమ్ బ్రౌజర్ లో అడల్ట్ కంటెంట్ చూసేందుకు వీలులేకుండా ఆటోమేటిగ్గా కొన్ని వెబ్సైట్లు బ్లాక్ అవుతాయి.

వారు ఏ వయసుకు తగిన యాప్స్ వేసుకోవాలో మీరే నిర్ణయించుకోవచ్చు.

పిల్లలు వాడే మొబైల్లో అవి కాకుండా ఇంకా ఎటువంటి యాప్స్ ఉన్నాయో వివరాలు తెలుసుకోవచ్చు.

ప్లేస్టోర్ పేరెంట్ కంట్రోలే కాకుండా, గూగుల్ క్రోమ్ ఫిల్టర్స్, గూగుల్ సెర్చ్ ఫిల్టర్స్, గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ యాప్స్ సెట్టింగ్స్ కూడా తల్లిదండ్రులే చేయొచ్చు.

అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం..

మొదట గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ ఫ్యామిలీ లింక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.

యాప్ ఓపెన్ చేసి మీ గూగుల్ ఖాతా వివరాలు ఇవ్వాలి.

అక్కడ ‘సూపర్వైజ్ ఏ ఫ్యామిలీ మెంబర్’ అని ఉన్న చోట క్లిక్ చేసి పిల్లల సరైన వయసు వివరాలు ఇస్తూ గూగుల్ ఖాతా తీసుకోవాలి.

ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ ఉందా అనే వివరాలు ఎంటర్ చేసి, పిల్లల ప్రాథమిక సమాచారం అందించి ఖాతాని సృష్టించాలి.

ఒక సారి పిల్లలకు ప్రత్యేక ఖాతా సృష్టించిన తరువాత వారు వాడే స్మార్ట్ ఫోన్ లో వేరే గూగుల్ ఖాతా చేయడానికి వీలు పడదు. అందువల్ల తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే వారు వినియోగించుకోవాల్సి ఉంటుంది. కావాలంటే ఆ ఖాతాని తొలిగించి కొత్తది యాడ్ చేసుకోవచ్చు. అలా పిల్లల ఖాతాలో చిన్నమార్పు చేసినా తల్లిదండ్రులకు సమాచారం వస్తుంది. ఈమెయిల్ రూపంలోనూ, గూగుల్ ఫ్యామిలీ లింక్ యాప్ నోటిఫికేషన్ ద్వారా సమాచారం అందుతుంది. అలా ఎప్పటికప్పుడు పిల్లల మొబైల్ వాడకాన్ని పర్యవేక్షించుకోవచ్చు.

— డియర్అర్బన్ టీం

ఇవి కూడా చదవండి

Exit mobile version