ముఖం కాంతివంతంగా ఉండాలంటే, చర్మం మెరిసిపోవాలంటే ఒక్కసారి శనగ పిండి ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. మార్పును మీరు కచ్చితంగా గమనిస్తారు. ఈ రోజుల్లో ఎక్కువగా ముఖ సౌందర్యానికి మార్కెట్లో అనేక రకాలైన కాస్మోటిక్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటున్నాయి. అలాంటి వాటినే ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. దానివల్ల సహజత్వానికి దూరంగా ఉంటున్నారు.
కానీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో సహజంగా కాంతినిచ్చే ఒక అద్భుత బ్యూటీ రెమిడీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులో శనగపిండి ఒకటి. చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. సౌందర్యాన్ని కాపాడటంలో శనగ పిండి పాత్ర అమోఘం. మరి ఆ అద్భుత బ్యూటీ రెమిడీని ఎలా వాడాలి అంటే…
శనగ పిండి ఫేస్ ప్యాక్
ముందుగా ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. తరువాత ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ శనగ పిండిని తీసుకుని అందులో కాస్త పెరుగు, చిటికెడు పసుపు, కొంచెం తేనె కలుపుకుని మిశ్రమాన్నిపేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. ఇలా వేసుకున్న ప్యాక్‌ని కేవలం 10 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత నెమ్మదిగా స్క్రబ్ చేసుకుంటూ గోరువెచ్చటి నీటితో కడిగేయండి. పెరుగు వాడడం వల్ల చర్మం చాలా మృదువుగా మారుతుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం చర్మరంధ్రాలను, జిడ్డు పట్టిన చర్మాన్ని కాపాడడంలో మెరుగ్గా పనిచేస్తుంది.
మాయిశ్చరైజర్ గా పనిచేస్తుందిలా:
ఇది చర్మంలో ఉన్న జిడ్డును పోగొట్టడంలో సహాయపడుతుంది. ఇది చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో, పీహెచ్ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో బాగా పనిచేస్తుంది. తద్వారా చర్మాన్ని కాంతవంతం చేస్తుంది. మోచేతులు, మోకాళ్లు మొదలైన శరీర భాగాలు సహజ రంగుకు దూరమైనప్పుడు ఈ ప్యాక్ అప్లై చేయడం మేలు చేస్తుంది. చర్మంలో పేరుకుపోయిన మట్టిని, ట్యాన్‌ని తొలగించడంలో సహయపడుతుంది.
మొటిమలు, మచ్చల నివారణకు:
శనగపిండి మచ్చలను తొలగిస్తుంది. అంతేకాక శనగ పిండిలో పసుపును కలపడం వల్ల అందులో ఉండే యాంటీబయాటిక్ చర్మంలో ఉన్న మురికి, ఇంక నల్ల మచ్చలను నివారిస్తుంది. మొటిమలు రాకుండా కాపాడుతుంది.
అవాంఛిత రోమాలు అరికడుతుంది:
చాలామంది అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడతారు. అలాంటివాళ్లకు శనగపిండి ప్యాక్ బెస్ట్ రెమిడీ అవుతుంది. శనగ పిండిలో కొద్దిగా పసుపు, కొంచెం పాలు కలిపి ముద్దగా చేసుకుని దాన్ని తరుచూ రాసుకుంటే రోమాలు తలగిపోయే అవకాశం ఉంది.