Home ఫుడ్ నువ్వుల ఉక్కిరి రెసిపీ… ఎప్పుడైనా తిన్నారా?  రుచి అమోఘం

నువ్వుల ఉక్కిరి రెసిపీ… ఎప్పుడైనా తిన్నారా?  రుచి అమోఘం

nuvvula ukkiri
నువ్వుల ఉక్కిరి వంటకం (Photo by Lakshmi Nekkala)

నువ్వుల ఉక్కిరి రెసిపీ పేరు ఎప్పుడైనా విన్నారా? నువ్వ‌ుల‌తో చాలా ర‌కాలైన  ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందుతాయి. పూర్వ‌కాలంలో నువ్వుల‌ను వంట‌ల్లో విరివిగా ఉప‌యోగించేవారు. నువ్వులలో చాలా పోష‌కాలు ఉండడమే దీనికి కారణం. రక్త‌హీన‌త అధికంగా ఉన్న‌వారు  నువ్వుల‌ను తీసుకోవ‌డం ద్వారా ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. నువ్వుల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల‌సిన విట‌మిన్లు సమృద్దిగా అందుతాయి. ఆరోగ్య‌క‌ర‌మైన నువ్వుల‌ను ప‌లు ర‌కాలుగా వినియోగించి ఎన్నో పోష‌కాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రి నువ్వుల‌తో డిఫెరెంట్ గా చేసే ఈ నువ్వుల ఉక్కిరి రెసిపీ ఎలా చేయాలో చూద్దామా?

నువ్వుల ఉక్కిరికి కావ‌సిన ప‌దార్థాలు :

  1. ప‌చ్చి నువ్వులు (తెల్ల‌వి) – ఒక క‌ప్పు
  2. ఉల్లిపాయ‌లు  – రెండు (పెద్ద సైజువి)
  3. పచ్చిమిర్చి – రెండు
  4. కారం –  ఒక టీ స్పూన్
  5. ఉప్పు – రుచికి స‌రిప‌డా
  6. క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు
  7. అల్లం-వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
  8. నూనె – రెండు టేబుల్ స్పూన్లు

నువ్వుల ఉక్కిరి త‌యారీ విధానం:

  1. ముందుగా నువ్వులను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కాస్త బ‌ర‌క‌గా రుబ్బుకోవాలి.
  2. ఇప్పుడు స్ట‌వ్ మీద క‌ళాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కాస్ల వేడిగా కాగ‌నివ్వాలి.
  3. అందులో చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ‌ల‌ను వేసి బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చేంత‌వ‌ర‌కూ వేపుకోవాలి. అదే స‌మ‌యంలో ప‌చ్చిమిర్చి వేసుకోండి.
  4. ఇలా వేపుకున్న ఉల్లిపాయ‌ల్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చ‌వాస‌న పోయేంత‌వ‌ర‌కూ వేగ‌నివ్వండి.
  5. తర్వాత ఇందులో కొంచెం క‌రివేపాకు వేయాలి.
  6. చిటికెడు ప‌సుపును యాడ్ చేయండి. కొంచెం రంగు వ‌చ్చిన త‌ర్వాత ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న నువ్వుల పేస్ట్‌ను అందులో వేయండి.
  7. ఇప్పుడు అది కాస్త ద‌గ్గ‌రికి వ‌చ్చేవ‌ర‌కూ వేపుకోవాలి. ఆపై ఇందులో రుచికి త‌గినంత‌గా ఉప్పు, కారం వేసి మ‌రికొన్ని నిమిషాలు మీడియం మంట మీద వేగ‌నివ్వండి.

అంతే ఎంతో సులువుగా, తక్కువ టైంలో అతి త‌క్కువ ప‌దార్థాల‌తో ఆరోగ్య‌మైన వంట‌కాన్ని వ‌డ్డించేయండి. పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు.

నువ్వుల ప్ర‌యోజ‌నాలు:

నువ్వుల‌లో ఉండే సెసామిన్ మోకాళ్ల నొప్పుల‌ను తగ్గిస్తుంది. నువ్వుల‌లో విట‌మిన్ బీ1, బీ3, బీ6, విట‌మిన్ కె , ఇ, ఎ, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్స‌ర‌స్, జింక్, కొవ్వుప‌దార్థాలు అధికంగా ఉంటాయి. నువ్వుల‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నందునే అత్యధిక ప్ర‌యోజ‌నాల‌ను ఇవ్వ‌డంలో నువ్వులు అగ్ర స్థానంలో ఉంటాయి. స్త్రీల‌ల్లో హ‌ర్మోనల్ స‌మస్య‌ల‌కు కూడా నువ్వులు మంచి ప‌రిష్కారం.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version