AP Tourist Places: ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. వేసవిలో ఏంచక్కా వీటన్నింటినీ చుట్టేయొచ్చు. పర్యాటకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక స్థానంలో ఉంటుంది. ప్రకృతి అందాలకు ప్రసిద్దిగా ఎన్నో పర్యాటక గమ్యస్థానాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతీ ఏటా వీటి సందర్శనకై దేశ విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రను ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ అందమైన ప్రకృతి ప్రదేశాలను ఒకసారి సందర్శించండి.
1.విశాఖపట్నం:
వైజాగ్ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. వైజాగ్ దాని తీరప్రాంతం వెంబడి అనేక బీచ్‌లతో కూడి ఉంటుంది. అత్యంత ఆకర్షణీయమైన బీచ్‌లతో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇందులో యారాడ బీచ్ ఒకటి. యారాడ బీచ్ సముద్రతీరం వద్ద ఆకాశ నీలం రంగు నీరు, బంగారు వన్నె ఇసుక, ఎత్తైన గుట్టలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వైజాగ్‌లోని సబ్‌మెరైన్ మ్యూజియం, అరకు వ్యాలీ, బొర్రా గుహలు మరియు ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్, రామకృష్ణ బీచ్, కైలాసగిరి, భీమిలి, వుడా పార్క్, జూ వంటి పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి. విశాఖపట్నం జిల్లాలో అతి ముఖ్యమైన ప్రదేశం అరకు. ఇది అద్భుతమైన హిల్ స్టేషన్. పర్యాటకులకు ఎంతో ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తుంది. దీనినే ఆంధ్రా ఊటీ అని కూడా పిలుస్తారు. ఈ అరకు లోయలో కాఫీ తోటలు, అందమైన ప్రకృతి, జలపాతాలు, రమణీయతకు అద్దం పడుతుంది.
2. అమరావతి
ఆంధ్రప్రదేశ్‌లోని మరో పర్యాటక ఆకర్షణ అమరావతి. ఇది శివుడు మరియు బుద్ధుని దేవాలయాలతో కూడిన పవిత్ర ప్రదేశం. అమరావతి మ్యూజియం ఒక పురావస్తు మ్యూజియం. అయితే ఇక్కడికి వచ్చే పర్యాటకులంతా 125 అడుగుల ఎత్తులో ఉన్న బుద్ధుని విగ్రహాన్ని చూసేందుకు వస్తూంటారు. ఈ విగ్రహం భారతదేశంలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటి. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పైగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు.
3. గండికోట
ఆంధ్ర ప్రదేశ్‌లోని పర్యాటక ప్రదేశాలలో గండికోట కూడా ప్రత్యేకమైనదే. ది గ్రాండ్ కానన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. దీనిలో ముఖ్యంగా చారిత్రక నిర్మాణాలను చూడటానికి అనువైన ప్రదేశం. గండికోటలో ముందుగా కోటతో ప్రారంభించవచ్చు. ఈ కోట ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. కోటపై నుండి గ్రామం మొత్తం ఎంతో అందంగా కనిపిస్తుంది. గండికోట సందర్శనలో రాత్రిపూట క్యాంపులు, రాత్రి శిబిరాలు అందుబాటులో ఉంటాయి కనుక గ్రామ జీవనశైలిని చూడవచ్చు. సరస్సు యొక్క ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
4. తిరుపతి
తిరుపతి ఎర్ర చెక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందింది. ఈ తిరుపతికి ఏటా కొన్ని కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు. అంతేకాదు. ఇది పర్యటనకు కూడా అనువైన, అందమైన ప్రదేశం. పుణ్యక్షేత్రాలతో పాటు ఎంతో సుందరమైన, చూడవలసిన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడవలసిన ప్రముఖ దేవాలయాలతో పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు, చంద్రగిరి కోట, హార్స్‌లి హిల్స్, టిటిడిసి గార్డెన్, తలకోన, ఇవన్నీ తిరుపతి చుట్టుపక్కల చూడవలసిన ప్రధాన పర్యాటక ఆకర్షణలు. తిరుపతికి వచ్చే చాలా మంది భక్తులు ఈ ప్రదేశాలన్నీ తప్పక చూడాలి.
5. పాపికొండలు:
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో గోదావరి నదిలో విస్తరించిన మూడు కొండల సముదాయం. పాపికొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది దట్టమైన అడవులతో కూడిన పర్వత శ్రేణిగా చెప్పవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎంతో ప్రశాంతమైన, సుందరమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా పేరుగాంచింది. అంతేకాదు ఇక్కడి కొండలు, జలపాతాలు, గ్రామీణ వాతావరణం కంటికి కనువిందుగా ఉంటాయి. వేసవిలో పాపికొండలు ప్రదేశం చాలా చల్లగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా లాంచి ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మరచిపోలేని జ్ఞాపకాలను తెచ్చిపెడుతుంది. ఈ పాపికొండల విహారయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసం నుండి మొదలై అక్కడి నుండి పోలవరం, రాజమండ్రి, కూనవరం, పేరంటాలపల్లి మీదుగా సాగుతుంది.
6. మారేడుమిల్లి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారేడిమిల్లి ప్రాంతం చూడదగ్గది. ఇక్కడ ఎంతో అందమైన జలపాతాలు, ప్రకృతి అందాలతో విరాజిల్లుతుంటాయి. ఈ ప్రాంతానికి కూడా ప్రతీ ఏటా పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇది రాజమండ్రి నుంచి 85 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. తూర్పగోదావరి జిల్లాలో భద్రాచలం, రాజమండ్రి మార్గంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఇది విహారయాత్రకు మంచి ప్రదేశం. దట్టమైన అడవులు, పొగమంచు వంటి ఎన్నో ప్రకృతి అందాల మధ్య మారేడుమిల్లి ఎంతో ఆకర్షణగా కనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రయాణం పిల్లలకు, పెద్దలకు కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్