బొబ్బర పప్పు వడలు హెల్తీ ఇంకా రుచికరమైన స్నాక్స్‌గా చెప్పొచ్చు. బొబ్బర్లను ఇంగ్లీషులో Black eyed peas అంటారు. బొబ్బర్లలో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఎ, మెగ్నిషియం, జింక్, కాపర్, మాంగనీస్, ఫొలేట్, విటమిన్ కే వంటి పోషకాలు ఉంటాయి. ఇలాంటి హెల్తీ పప్పుధాన్యాలతో స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. పైగా ఆరోగ్యం కూడా. సాయంత్రం అయ్యేసరికి చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. క్రిస్పీగా, రుచిగా నోట్లో ఏదో ఒకటి పడకపోతే ఏదో వెలితిగా అనిసిస్తుంది. బయటనుంచి జంక్ ఫుడ్, రకరకాల నూనెలు వాడిన పదార్థాలను తెచ్చుకుని మరీ ఎంజాయ్ చేస్తుంటారు.
ఇప్పడు వేసవి కాబట్టి ఎక్కువ ఆయిల్‌తో చేసే పదార్థాల జోలికి ఎవరూ పోరు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు కూడా. అయితే ఇంట్లో చేసుకున్నవైతే కాస్త పరవాలేదు. అందుకే మీ కోసం ఎంతో క్సిస్పీ అయిన రుచికరమైన వడలు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
చాలామంది దాల్ వడలను శనగపప్పు, మినప్పు, పెసరపప్పు ఇలా వివిధ రకాల పప్పులను ఉపయోగించి ఎవరి టేస్ట్‌కు తగ్గట్టు వారు చేసుకుంటారు. బొబ్బర పప్పు వడలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. టీటైంలో ఇది మంచి స్నాక్ అని చెప్పవచ్చు. అందులొనూ వడలు తినేకొద్దీ తినాలనిపించే స్నాక్స్. బోర్ కొట్టదు కూడా. మరి అంత రుచికరమైన రెసిపీ విధానాన్ని చూసి మీరు చేసుకుని రుచిని ఆస్వాదించండి.
బొబ్బర వడ తయారీకి కావలసిన పదార్థాలు:
1. బొబ్బర పప్పు – ఒక కప్పు
2. ఉల్లిపాయలు – రెండు
3. పచ్చిమిర్చి – నాలుగు
4. అల్లం – చిన్నముక్క
5. ఉప్పు – రుచికి సరిపడా
6. కారం – ఓక టీ స్పూన్
7. కొత్తిమీర – కొద్దిగా
8. నూనె – డీప్ ప్రై కోసం
9. ధనియాల పొడి – ఒక టీ స్పూన్
బొబ్బర వడలు తయారీ విధానం:
1. ముందుగా బొబ్బర పప్పును తీసుకుని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత దానిని శుభ్రంగా దానిలో ఉండే పొట్టు కొద్దిగా పోడానికి నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఈ విధంగా పెట్టుకున్న పప్పును మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
3. అందులో ఉల్లిపాయలు ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, ధనియాల పొడి, ఉప్పు వేసుకుని కొద్దిగా కొత్తిమీరను వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు స్టౌ మీద ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
5. నూనె వేడిగా అయ్యాక బొబ్బర పప్పు మిశ్రమాన్ని వడలుగా చేసుకోవాలి. అందుకు చిన్న కవర్‌పై కొద్దిగా నూనె గానీ నీళ్లతొ తడిపి దానిపై మిశ్రమాన్ని చిన్న ఉండలా చేసుకుని వడలుగా ఒత్తుకుని నూనెలో మూడు నాలుగు వేసుకోండి.
6. గోధుమ రంగులోకి వచ్చేవరకూ ఫ్రై చేసుకోండి. అంతే ఎంతో సింపుల్‌గా రెడీ చేసుకునే బొబ్బర వడ రెసిపీని ఈజీగా సర్వ్ చేసేయండి. కావాలనుకుంటే ఇష్టపడేవారు ఇందులో శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్