కరోనా వ్యాప్తితో బోనాల పండగ కళ తప్పింది. 200 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అమ్మవారికి పూజల నిమిత్తం ప్రారంభమైన ఈ బోనాల పండగ.. ఇప్పుడు మరో మహమ్మారితో ఇళ్లకే పరిమితమవడం నిరుత్సాహాన్ని నింపుతోంది.
1813లో హైదరాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాప్తిచెందిందని చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడే కరోనా మహమ్మారికి ఎలాంటి మందు రాలేదు. ఇక 200 ఏళ్ల క్రితం పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రజలను కాపాడేందుకు దేవుడే దిక్కయ్యాడు.
హైదరాబాద్ ప్రాంతంలో వ్యాప్తిచెందిన ప్లేగు నుంచి రక్షించాలని ఉజ్జయినికి వెళ్లి మహంకాళి దేవికి మొక్కుకుంటే వ్యాధి అదుపులోకి వచ్చిందని, అప్పటి నుంచే మహంకాళి దేవికి ఏటా ఆషాఢ మాసంలో బోనాల పండగ నిర్వహిస్తూ వస్తున్నారు.
ఎలాంటి ఆపదకర పరిస్థితుల్లోనూ ఈ బోనాల పండగ ఆగలేదు. ఎమర్జన్సీ కాలంలో కూడా బోనాల పండగ నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే ఈ బోనాల పండగను జంట నగరాల పరిధిలో, ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రతి ఇంట్లో జరుపుకుంటారు. అమ్మవారికి నైవేద్యం బోనం రూపంలో తెచ్చి సమర్పిస్తారు.
బోనాల సమయంలో జరిగే జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కానీ జంటనగరాల పరిధిలో ప్రస్తుతం రోజూ వందలాది కరోనా కేసులు నమోదవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం బోనాల పండగపై ఆంక్షలు విధించింది. అందరూ ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వచ్చింది. జంట నగరాలకు ప్రతి ఏడాది కళను తెచ్చే ఈ పండగ ఈసారి వెలవెలబోయింది.
ఇక భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి వేడుకలకు కూడా కరోనా వెనక్కి తగ్గకపోతే.. హైదరాబాద్‌కు శోభను తెచ్చే వినాయక నవరాత్రోత్సవాలు కూడా చడీచప్పుడు లేకుండా నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పటికే జంట నగరాల్లో దాదాపు 20 శాతం జనాభా ఖాళీ అయినట్టు అంచనా.
చాలీచాలని వేతనంతో నిలువ నీడలేక, ఖర్చులతో వేగలేక నగరాలపై మోజు వీడి ప్రజలు పల్లెబాట పడుతున్నారు. పండగ పబ్బం లేకుండా చేసిన కరోనా మహమ్మారి అందరి జీవితాలనూ వెంటాడుతోంది.