Chamadumpala Pulusu Recipe: చామ దుంపల కూరను విభిన్న ప్రాంతాల్లో వేర్వేరు రకాలుగా వండుతారు. చామ దుంపలను ఇంగ్లీషులో taro root అంటారు. అయితే చేమ దుంపలను కొందరు బాగా ఇష్టపడి తింటారు. మరికొందరు వాటిని అసలు దగ్గరికే రానివ్వరు. ఎందుకంటే అవి కొంచెం జిగురుగా, చేతికి అంటుతున్నట్టు ఉండడం వల్ల వాటిని అంతగా ఇష్టపడరు.
కానీ అన్ని రకాల కూరగాయాలు తింటేనే మన శరీరానికి అందాల్సిన అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి. ఇదివరకులా కాదండోయ్.. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు. మన ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది చెడ్డది అని తెలుసు. అన్నీ తెలిసినా ఒక్కటే లోపం దానిని మనం పాటించం అంతే. కనుక కొన్నింటిలో రుచిని, సౌకర్యాన్ని చూడడం కన్నా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం బెటర్. మరి ఇంకెందుకు ఆలస్యం.. చామ దుంపల రెసిపీని తెలుసుకుందాం.
చేమ దుంపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు:
- చామదుంపలు – అరకిలో
- ఉల్లిపాయలు – రెండు (పెద్ద సైజు)
- పచ్చిమిర్చి – రెండు
- అల్లం – చిన్నముక్క
- వెల్లుల్లి – నాలుగు రెబ్బలు
- చింతపండు – పెద్ద నిమ్మకాయ సైజంత
- నూనె – మూడు టేబుల్ స్పూన్తు
- కారం – రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి తగినంత
- జీలకర్ర – ఒక టీ స్పూన్
- కొత్తిమీర – కొద్దిగా
చామ దుంపల పులుసు తయారీ విధానం:
- చామ దుంపలను ముందుగా ప్రెజర్ కుక్కర్‌లో కొద్డిగా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి.
- 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంతవరకూ ఉడకినివ్వాలి.
- ప్రెజర్ పోయేంంతవరకూ ఆగి తర్వాత తీసి ఉడికిన చామదుంపలను చల్లటి నీటిలో వేసుకుని నెమ్మదిగా తొక్కను తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సిజార్‌ను తీసుకుని అందులో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్రను వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని మసాలా సిద్దం చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానబెట్టాలి.
- ఒక వెడల్సాటి గిన్నెను తీసుకోవాలి. పులుసులు ఎప్పుడూ అలాంటి గిన్నెలో వండితే అవి బాగా ఉడకడానికి మరియు పులుసు బాగా మరగడానికి వీలవుతుంది. రుచి బాగా కుదురుతుంది.
- అందులో నూనె వేసుకుని వేడి అయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న మసాలా ముద్దను వేసుకుని కలుపుకోవాలి.
- ఇలా మసాలా మాడిపోకుండా కొంచెం సేపు వరకూ కలుపుతూనే ఉండాలి. పచ్చిమిర్చిని వేసుకోవాలి.
- ఇప్పుడు చామ దుంపలను వేపుకుని మసాలా అంతా దుంపలకు పట్టే విధంగా కలుపుకోవాలి.
- తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
- మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును తీసి రసాన్ని సిద్దం చేసుకుని అందులో పోయాలి. పులుపు రుచి చూసుకుంటూ అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకోవచ్చు.
- తర్వాత మంటను మీడియంగా పెట్టుకుని కొద్దిగా చిక్కబడేంత వరకూ ఉడికించుకోవాలి.
- ఇప్పుడు కొద్దిగా కొత్తమీరను వేసుకోండి.
అంతే చేమదుంపల పులుసు రెడీ. చేపల కూర తిన్నట్టు ఉంటుంది దీని టేస్ట్. చేపల కూర సాయంత్రానికి ఎంత రుచిగా ఎంటుందో చేమ దుంపల కూర కూడా అంతే. మరుసటి రోజు మరింత రుచిగా ఉంటుంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్