Home ఫుడ్ చాక్లెట్‌ కుకీస్‌ .. బేకరీ తరహా ఇంట్లోనే..

చాక్లెట్‌ కుకీస్‌ .. బేకరీ తరహా ఇంట్లోనే..

chocolate cookies
Image : DearUrban

చాక్లెట్‌ కుకీస్‌ ఎలా చేయాలో తెలియక చేయడం మానుకుంటారు గానీ.. వీటిని అందరూ ఇష్టపడతారు. చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి చేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. అయితే మైదా పిండితో తయారవుతాయి కాబట్టి హెల్త్‌ కాన్షియస్‌ ఉన్నవారు కొద్దికొద్దిగా తీసుకుంటే మేలు. చాలా సింపుల్‌గా చాక్లెట్‌ కుకీస్‌ రెడీ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం రండి..

చాక్లెట్‌ కుకీస్‌ రెసిపీకి కావలసిన పదార్థాలుః

మైదా – 1 గ్లాస్‌ నిండా(మీడియం సైజ్‌) లేదా 150 గ్రాములు
షుగర్‌ పౌడర్‌ – 1 గ్లాస్‌కు కొద్దిగా తక్కువ
కోకో పౌడర్‌ – పావు కప్పు
కాజూ – చిన్నగా తురిమిన ముక్కలు కొద్దిగా
బాదాం– చిన్నగా తురిమిన ముక్కలు కొద్దిగా
(కాజూ, బాదాంకు ప్రత్యామ్నాయంగా టూటీ ఫ్రూటీస్‌ లేదా వెనీలా ఎసెన్స్‌ వాడుకోవచ్చు..)
బటర్‌ – 100 గ్రాములు (అమూల్, మదర్‌డైరీ వంటి బ్రాండ్లతో లభిస్తుంది)
బేకింగ్‌ పౌడర్‌ – అర టీ స్పూన్‌
చాకో చిప్స్‌ – కొద్దిగా

చాక్లెట్‌ కుకీస్‌ తయారీ విధానంః

1. ఒక బౌల్‌లోకి వంద గ్రాములు బటర్‌ తీసుకోవాలి. బటర్‌ అందుబాటులో లేనిపక్షంలో వనస్పతి లేదా నెయ్యి కూడా వాడుకోవచ్చు. బటర్‌ గట్టిగా ఉంటుంది కాబట్టి దానిని బీట్‌ చేసుకోవాలి. క్రీమ్‌లా అయ్యే వరకు మిక్స్‌ చేసుకోవాలి. ఐదు నిమిషాలు పడుతుంది. తదుపరి షుగర్‌ పౌడర్‌ తీసుకుని ఇందులో కలుపుకోవాలి. ఇందులోనే ఐదు చుక్కల మేర వెనీలా ఎసెన్స్‌ వేసుకుని కలపాలి. కాస్త పేస్ట్‌లా అవుతుంది. నచ్చితే కాజు ముక్కలు లేదా బాదాం ముక్కలు లేదా టూటీ ఫ్రూటీ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.

2. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేయాలి. పావు కప్పు కోకో పౌడర్‌ వేయాలి. అర టీ స్పూన్‌ బేకింగ్‌ పౌడర్‌ వేయాలి. పొడులు వేసేటప్పుడు అంతటా చల్లినట్టు వేస్తే మొత్తం పేస్ట్‌కు పడుతుంది. మొత్తంగా పిండిని కలుపుకోవాలి. మొత్తం మిక్స్‌ అయ్యేలా చూసుకోవాలి. మిక్స్‌ అయ్యాక కొద్దిగా చాకో చిప్స్‌ చల్లుకోవాలి.

3. మిక్స్‌ మొత్తం బాగా డ్రై అయినట్టు అనిపిస్తే రెండు టీ స్పూన్ల పాలు యాడ్‌ చేయొచ్చు.

4. ఇప్పుడు నిమ్మకాయ సైజులో తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. వీటిని గుండ్రటి బిస్కెట్‌ ఆకారంలో (కుకీ షేప్‌) ప్రెస్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బేకింగ్‌ టిన్‌ గానీ, బేకింగ్‌ ట్రే గానీ ఉంటే దానిలో బటర్‌ అప్లై చేసుకుని పెట్టుకోవచ్చు. బేకింగ్‌ టిన్‌ గానీ, బేకింగ్‌ ట్రే గానీ లేనిపక్షంలో సాధారణ బౌల్‌కు బటర్‌ అప్లై చేసి బిస్కెట్లు పెట్టుకోవచ్చు. వీటిపై చాకో చిప్స్‌ ప్రెస్‌ చేసి అమర్చుకుంటే అందంగా కనిపిస్తాయి. బటర్‌ అప్లై చేసినప్పుడు కాస్త మైదా పిండి చల్లుకుంటే బిస్కెట్లు అతుక్కుపోకుండా ఉంటాయి.

5. తదుపరి స్టవ్‌పై ఒక పాన్‌ లాంటి గిన్నె పట్టుకుని దానిలో బౌల్‌ స్టాండ్‌ (డైనింగ్‌ టేబుల్‌ మీద పెట్టుకునే స్టాండ్‌) అమర్చుకోవాలి. దీనిపై బిస్కెట్స్‌ పెట్టిన బౌల్‌ను పెట్టి గిన్నెపై మూత పెట్టాలి. సిమ్‌ ఫ్లేమ్‌పై ఒక పదిహేను నిమిషాలు వేడెక్కనివ్వాలి.

6. 15 నిమిషాల తరువాత స్టవ్‌ ఆఫ్‌ చేసి బౌల్‌ని తీసి పక్కనపెట్టుకుని వేడి తగ్గిన తరువాత బిస్కట్స్‌ని ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలి. బేకరీ తరహా చాక్లెట్‌ కుకీస్‌ రెడీ.

7. చాక్లెట్‌ కుకీస్‌ ఓవెన్‌లో కూడా చేసుకోవచ్చు. స్టవ్‌ మీద ఎలా అయితే పెట్టామో.. అదే గిన్నెను ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద 15 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. అంతే చాక్లెట్‌ కుకీస్‌ రెడీ.

– రెసిపీ : అర్పితా రెడ్డి

Exit mobile version