Home న్యూస్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభకు యువ సంఘర్షణ సభగా పేరు

హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభకు యువ సంఘర్షణ సభగా పేరు

congress meeting
సరూర్ నగర్ సభ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్: ఈ నెల 8న సరూర్ నగర్‌లో సాయంత్రం 3 గంటలకు నిర్వహించే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సరూర్ నగర్లో యువ సంఘర్షణ సభ లోగోను ఆవిష్కరించి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర నేతలతో కలిసి సభ నిర్వహణ ఏర్పాట్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించాం. అదేవిధంగా విద్యార్ధులు, నిరుద్యోగుల కోసం హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

‘విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్‌లో ప్రకటిస్తాం. టీఎస్పీఎస్సీ ని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తాం. ప్రియాంక గాంధీ ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వండని కేసీఆర్ ను అడగడం కాదు.. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నా‘మని రేవంత్ రెడ్డి అన్నారు.

‘నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేసింది. చివరకు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు సంతలో సరుకుల మార్చేశారు. వందల కోట్లకు లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను తాకట్టు పెట్టారు. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ షాపుల్లో దొరుకుతున్నాయి. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు. రైతులు నష్టపోతే కనీసం ఆదుకోవడం లేదు.. కేసీఆర్ రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. పండించిన పంట, తడిసిన ధాన్యం కొనట్లేదు. మే 8న సరూర్ నగర్లో జరగనున్న యువ సంఘర్షణ సభను విజయవంత చేయాలి..’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా మద్దతుగా తరలి రావాలి. విద్యార్థి, నిరుద్యోగులందరూ సభను విజయవంతం చేయాలి. కేసీఆర్ విముక్త తెలంగాణ తీసుకొచ్చేందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

నిరుద్యోగులకు మద్దతుగా ప్రియాంక గాంధీ : మాణిక్ రావ్ ఠాక్రే

విద్యార్థి , నిరుద్యోగుల మద్దతుగా మేము ఉన్నామని చెప్పడానికి ప్రియాంక గాంధీ ఇక్కడకు వస్తున్నారు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పేర్కొన్నారు. నిరుద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే యువ సంఘర్షణ సభ, నిరుద్యోగులకు భరోసా కల్పించి వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారని, సభను విజయవంతం చేయాలని ఠాక్రే కోరారు.

Exit mobile version