Latest

Diabetes effects on organs: దీర్ఘకాలికంగా డయాబెటిస్ ఉండి అదుపులో లేకపోతే శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, కంటి జబ్బులతో పాటు రక్తప్రసరణ లేక కాళ్లను కోల్పోవాల్సిన దుస్థితి వస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆ ప్రభావం శరీరంలో ఇతర ప్రధాన అవయవాలపై పడే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం మనదేశంలో ఏడుకోట్ల మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ చాప కింద నీరులా ఇంకా విస్తరిస్తూనే ఉంది. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతూనే ఉన్నారు. ఈ రోగంతో బాధపడుతున్న వారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. డయాబెటిస్ అదుపులో ఉండకపోతే శరీరంలోని ఏ అవయవాలపై అది ప్రధానంగా చెడు ప్రభావం చూపిస్తుందంటే…

డయాబెటిస్‌తో కాళ్లు, పాదాలపై ప్రభావం

డయాబెటిస్ ప్రభావం పాదాలపై ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం వల్ల పాదాల్లోని నరాలు దెబ్బతింటాయి. రక్త ప్రసరణ సరిగా జరగదు. పాదాలు పుండ్లు పడతాయి. ఇన్ఫెక్షన్ కు గురై పాదాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్లలోని కండరాలు సక్రమంగా పనిచేయకుండా పోతాయి.

షుగర్ ఎక్కువైతే మూత్రపిండాలకు ముప్పు

డయాబెటిస్ ప్రభావం మూత్రపిండాలపై అధికం. రక్తంలో చక్కెర స్థాయిలు కిడ్నీలోని చిన్న రక్త నాళాలకు హాని కలిగిస్తాయి. దీని వల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయవు. శరీరంలో విష వ్యర్థాలు పేరుకుపోతాయి. డయాబెటిక్ నెఫ్రోపతీ వంటి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి రావడం వల్ల మూత్రంలో ప్రొటీన్ బయటికి పోవడం, ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లిరావడం, రక్తపోటు పెరగడం, పాదాలు, చేతులు, కళ్లల్లో వాపు రావడం, వికారం, వాంతులు వంటివి కలగడం జరుగుతాయి.

చిగుళ్లు

మధుమేహం చిగుళ్ల వ్యాధికి కారణం అవుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారే అవకాశం ఉంది. దీన్నే పీరియాంటల్ వ్యాధి అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఇది వస్తుంది. రక్తనాళాలు గట్టిగా మారిపోతాయి. రక్త ప్రసరణ సవ్యంగా సాగదు.

మధుమేహంతో కళ్లపై ప్రభావం

మనకు కళ్లు చాలా ముఖ్యమైనవి. షుగర్ అదుపులో ఉండకపోతే, అంటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే… కంటిలోని రెటీనాపై ఆ ప్రభావం పడుతుంది. రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల చూపు మందగిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి వంటి సమస్యలు వస్తాయి. గ్లాకోమా, కంటి శుక్లాలు కూడా రావచ్చు. వీటి వల్ల శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం పొంచి ఉంది.

డయాబెటిస్‌తో నరాలకు దెబ్బ

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల నరాల వ్యాధి రావచ్చు. దాని పేరు డయాబెటిక్ న్యూరోపతి. దీనివల్ల నరాలు దెబ్బతింటాయి. ఇది వస్తే చిన్న నొప్పిని కూడా భరించలేదు. పాదాలపై పుండ్లు పడతాయి. ఇతర వ్యాధులు త్వరగా సోకుతాయి.

గుండె జబ్బుల బారిన పడతారు

డయాబెటిస్ అదుపులో లేకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. మధుమేహం కారణంగా అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ కారణంగా కార్డియోవాస్కులర్ జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశం ఉంది.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version