Latest

Food for High Blood pressure: హైబీపీ (అధిక రక్తపోటు) వల్ల గుండెకు చేటు. తగిన డైట్‌ (ఆహారం)తో రక్తపోటును అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. హైబ్లడ్ ప్రెషర్ బారిన పడిన తరువాత వైద్యులు ఇచ్చిన మందులు రోజూ కచ్చితంగా వేసుకోవాలి. అలాగే ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ వేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. లేకుంటే హైబీపీ ఇతర సమస్యలను తెచ్చిపెడుతుంది.

ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి రక్తపోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుంచి 120 ఎంఎం హెచ్‌జీ మధ్య ఉండొచ్చు. డయాస్టోలిక్ ప్రెషర్ 60 నుంచి 80 ఎంఎం హెచ్‌జీ వరకు ఉండవచ్చు. సిస్టోలిక్ 120 దాటిందంటే హైబీపీ వచ్చే అవకాశం ఉందని అర్థం. 140/90 బీపీ రీడింగ్ దాటిందంటే వారు హైబీపీ బారిన పడినట్టే లెక్క. హైబీపీ వస్తే నరాల వ్యవస్థపై చాలా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గుండెకు చాలా ప్రమాదం. మెదడు, గుండె, మూత్రపిండాలపై హైబీపీ ప్రభావం ఎక్కువ. అధిక బరువు బారిన పడినవారికి హైబీపీ త్వరగా వచ్చే అవకాశం ఉంది. హైబీపీ ఉన్న వారు తగిన ఆహారంతో పాటు రోజూ శారీరకంగా చురుగ్గా ఉండాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి.

అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నవారు రోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని తింటే రక్తపోటు పెరగకుండా అడ్డుకోవచ్చు. ఆ జాబితా ఇక్కడ చూడండి.

హైబీపీనీ తగ్గించే ఆహార పదార్థాలు ఇవే

అరటిపండు

హైబీపీ ఉన్న వారు రోజుకో అరటిపండు తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో పొటాషియం ఉంటుది. ఇది శరీరంలో చేరిన సోడియం ఎలాంటి చెడు ప్రభావాలు చూపించకుండా కాపాడుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజుకు రెండు అరటిపండ్లు వరకు తినవచ్చు.

వెల్లుల్లి

మన ఇళ్లల్లో వెల్లుల్లి కచ్చితంగా ఉంటుంది. ఇది యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగినది. దీన్ని తినడం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రక్తపోటు పెరగకుండా అడ్డుకుంటుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి.

ఆకు కూరలు

ఆకుకూరల జాతికి చెందినవి ఏవైనా రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఆకు కూరల జాబితాలోకి పాలకూర, బచ్చలికూర, తోటకూర, కొత్తిమీర, కాలే, క్యాబెజీ వంటివి వస్తాయి. వీటిలో ఉంటే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వీటిని కూరలా వండుకుని తిన్నా మంచిదే. సలాడ్‌లా రూపంలో తింటే ఇంకా మేలు.

టమాటా

తక్కువ ధరకే లభించే కూరగాయలు టమోటాలు. వీటిని రోజూ తినడం వల్ల వాటిలో ఉండే లైకోపీన్ అధికరక్తపోటును అడ్డుకుంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనిలో కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసవరం.

బ్లూబెర్రీలు

సూపర్ మార్కెట్లో బ్లూబెర్రీలు అధికంగా దొరుకుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్స్ అని పిలిచే ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. వీటిని హైబీపీ కలవారు తింటే ఆ ఫ్లేవనాయిడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ఉదయం పరగడుపున వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది.

హైబీపీ తగ్గించుకునేందుకు తగిన ఆహారం తీసుకోవడంతో పాటు ప్రశాంతతను అలవరచుకోవాలి. ఇందుకు యోగా, ధ్యానం, నడక వంటి వాటిని ఆశ్రయించాలి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version