కోవిడ్ 19 మహమ్మారి పంజా విసరడంతో మహా నగరాలపై జనాలకు క్రమంగా మోజు తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ 19 కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాలు మహా నగరాలే కావడం గమనార్హం. మరోవైపు వేలాది శ్రామిక్ ఎక్స్‌ప్రెస్‌లలో వలస జీవులు ఇంటిబాట పడుతున్నారు. ప్రభుత్వాలకు వలసలు, పట్టణీకరణపై సరైన విధానాలు లేక ఈ పరిస్థితి దాపురించిందన్నది సామాన్యుడి అభిప్రాయంగా ఉంది.
2014లో ఐక్యరాజ్యసమితి ఇచ్చిన ఓ నివేదిక ప్రకారం ఇండియాలో నగరాల్లో 2014–2050 మధ్య 40 కోట్ల జనాభా నగరాలకు వలస వెళుతుంది. మన దేశ జీడీపీలో 60 శాతం వాటా నగర జనాభాదే కావడం విస్మరించలేని సత్యం. ఉపాధి ఉన్న చోటే వలసలు ఉంటాయి
కానీ కరోనా మహమ్మారి ఒక్కసారిగా మహా నగరాలను వెక్కిరించింది. ముంబై, ఢిల్లీ వంటి మహా నగరాల్లో జనసాంధ్రత ఎక్కువగా ఉన్న మురికివాడల్లోనే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని వార్తాకథనాలు వస్తున్నాయి. ముంబై మహానగరంలో ఉన్న ధారావి మురికివాడ కేవలం 2.4 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. కానీ అక్కడ ఉండే జనాభా ఎంతో తెలుసా. అక్షరాల 8.5 లక్షలు. అంటే ఒక చదరపు కి.మీ. విస్తీర్ణంలో 3.5 లక్షల జనాభా ఉంది.
ధారావి స్లమ్ ఏరియాలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. కమ్యూనిటీ టాయిలెట్లే వారికి ఆధారం. అత్యధిక జనసాంధ్రత కారణంగా అక్కడ కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నప్పటికీ వందల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మే 23 నాటికి 24,323 కేసులు నమోదయ్యాయి. మొత్తం మహారాష్ట్రలో 47,191 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 12,910 కేసులు నమోదయ్యాయి.
11 నగరాల్లోనే 70 శాతం కేసులు
దేశవ్యాప్తంగా మే 23 నాటికి 1,31,868 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,867 మంది చనిపోయారు. ఈ కేసుల్లో 70 శాతం కేవలం 11 మున్సిపాలిటీల్లోనే నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని నగరాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ సమయంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనించవచ్చు.
నగరాలకు వలసలు వస్తున్న రీతిలో వారిని ఆ నగరాలు భరించగలిగేలా మౌలిక వసతులు ఉండడం లేదు. మహా నగరాలను అభివృద్ధి చేస్తున్నట్టు కనిపిస్తున్నా వాస్తవంలో అది నిజం కాదు. నగరాల్లోని ఫ్లైఓవర్లపై నుంచి చూస్తే అక్కడి మురికివాడలు దర్శనమిస్తాయి. ఐటీ రంగ అభివృద్ధి, రోడ్ల హంగులు చూసి అభివృద్ధి అనుకోవడం భ్రమే అవుతుంది.
పట్టణ పేదలు, మధ్య తరగతి ప్రజలు అనుభవిస్తున్న వ్యథలు విధాన రూపకర్తలు గమనంలోకి తీసుకోవడం లేదు. వారికి కనీస జీవన వసతులు ఉన్నాయా? ఆరోగ్య వసతులు సమకూరుతున్నాయా? విద్యావసతులు అందుబాటులో ఉన్నాయా? అన్నది పట్టించుకోవడం లేదు.
బాగా డబ్బున్న వారు ఇంటర్నేషనల్ స్కూళ్లను, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా.. పేద, మధ్య తరగతి జీవులు అటు సర్కారు సేవల వెయిటింగ్ లిస్ట్‌లో నిల్చొని ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద పెద్ద సర్కారు ఆసుపత్రుల్లో ఎంఆర్‌ఐ, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకునేందుకు పది పదిహేను రోజులు ఆగాల్సి వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
టైర్–2, టైర్–3 నగరాలను పట్టించుకోకపోవడం, అభివృద్ధి వికేంద్రీకరణ లేకపోవడం వంటి కారణాల వల్ల ఉపాధి కోసం యువత మహా నగరాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో నగరాలు తట్టుకోలేకపోతున్నాయి.
అద్దెలు, విద్య, వైద్య ఖర్చులు పెరగడంతో జనసాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకే నగర జీవి పరిమితం కావాల్సి వస్తోంది. కాలుష్యం, వృత్తి ఒత్తిళ్లు పీడించడం, ఆరోగ్యం క్రమంగా దెబ్బతినడం, సామాజిక బంధాలు తగ్గుతుండడం, కల్తీ ఆహారం వంటి అనేక కారణాల వల్ల అసంతృప్తిగా జీవిస్తున్న నగర సగటు జీవి.. ఇప్పుడు కోవిడ్ 19 దెబ్బకు నగరాలపై మోజు తగ్గించుకుంటున్నాడు.
చాలా నగరాల్లో ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. కొన్ని నగరాల్లో ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా బెడ్స్ నిండుకున్న పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికెళ్లినా రద్దీ లేని ప్రదేశం లేకపోవడంతో నగరాలపై మోజు తగ్గుతోంది.
నగరీకరణ తగ్గించడానికి పరిష్కాలేంటి?
మహా నగరాల్లో మౌలిక వసతులు పెంచడంతో పాటు టైర్–2, టైర్ 3 నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా మహా నగరాలకు వలసలు ఆపొచ్చు. అలాగే పల్లెల నుంచి వచ్చే యువతలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచాలి.
ప్రభుత్వమే మోడల్ ప్రాజెక్టు రిపోర్టులను రెడీగా పెట్టి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఐటీ సేవలు, ఐటీ ఆధారిత సేవలు అందించే కంపెనీలు పెట్టేలా ప్రోత్సహించాలి. ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వడం నుంచి, పెట్టుబడి రుణాలు ఇప్పించడం వరకు ప్రభుత్వం చేయూతగా ఉంటే పల్లెలు చిన్న పరిశ్రమలకు కేంద్రాలుగా నిలుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి వనరులు విస్తృతమవుతున్న ఈ తరుణంలో వ్యవసయాధారిత పరిశ్రమలు వర్థిల్లుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
టైర్–2, టైర్–3 నగరాల్లో ఐటీ టవర్ల నిర్మాణం చేపడుతూ మల్టీ నేషనల్ కంపెనీలు, వాటిల్లో పనిచేసి అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు చేయూత ఇవ్వడం ద్వారా మహా నగరాలపై బర్డెన్ తగ్గించవచ్చు.