Home ఫుడ్ క‌మ్మ‌ని క‌రివేపాకు రైస్.. పిల్లల లంచ్ బాక్స్‌కు మంచి రెసిపీ! ప‌ది నిమిషాల్లో సిద్దం

క‌మ్మ‌ని క‌రివేపాకు రైస్.. పిల్లల లంచ్ బాక్స్‌కు మంచి రెసిపీ! ప‌ది నిమిషాల్లో సిద్దం

curry leaves rice
కరివేపాకు రైస్ "Vegan fried rice" by Lablascovegmenu is licensed under CC BY 2.0

పిల్ల‌ల లంచ్ బాక్స్‌ కోసం క‌రివేపాకు రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎంతో టేస్టీగా, త‌క్కువ స‌మయంలో అయిపోయే ఈ వంట‌కం పిల్ల‌ల లంచ్‌బాక్స్‌కు అదిరిపోతుంది. క‌మ్మ‌ని క‌రివేపాకు రైస్ సులువుగా, టేస్టీగా చేసేయ‌చ్చు. ఈ రెసిపీ విధానం ఇక్క‌డ చూడండి.

క‌రివేపాకు ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా అద్భుతంగా ప‌నిచేస్తుంది. క‌రివేపాకులో చాలా ఔష‌ధ గుణాలు ఉంటాయి. కానీ పిల్ల‌లు ఏ వంటంకంలో క‌రివేపాకు వేసినా దాన్ని వెంట‌నే తీసి ప‌డేస్తారు. తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. దీని వ‌ల్ల వాళ్ల శ‌రీరానికి అందాల్సిన పోష‌క విలువ‌లు స‌రిగా అంద‌వు. క‌నుక అప్ప‌డ‌ప్పుడు పిల్ల‌ల‌కు ఇలా  క‌రివేపాకు రైస్ చేసి పెడితే  ఈజీగా తినేస్తారు.

ఇది పిల్లల లంచ్‌బాక్స్‌లో మాత్ర‌మే కాదు. రాత్రిపూట చాలా సింపుల్‌గా భోజ‌నం ముగించాలి అనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ. కొందరు రాత్రి పూట చపాతీ చేసుకుని తింటారు. రోజూ చ‌పాతీతో ముగించే క‌న్నా ఒక‌రోజు క‌రివేపాకు రైస్‌తో ముగించేస్తే స‌రి. అటు ఆరోగ్య‌మూ బాగుంటుంది. ఇటు ప‌ని సులువుగానూ అయిపోతుంది. చాలా టేస్టీగా  కూడా ఉంటుంది. 

కరివేపాకు రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

  1. కరివేపాకులు – ఒక కప్పు
  2. వండిన అన్నం – రెండు కప్పులు
  3. శనగపప్పు – ఒక స్పూన్
  4. మిరియాలు – అర స్పూను
  5. జీలకర్ర – అర స్పూను
  6. మినప్పప్పు – ఒక స్పూన్
  7. ఎండుమిర్చి – ఐదు
  8. వెల్లుల్లి రెబ్బలు – మూడు
  9. ఉప్పు – రుచికి సరిపడా
  10. పల్లీలు – గుప్పెడు
  11. జీడిపప్పు – ఐదు

కరివేపాకు రైస్ త‌యారీ విధానం

  1. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కరివేపాకులు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర,  మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి.
  2. అవన్నీ వేగాక ఒక గిన్నెలో తీసుకుని చ‌ల్లారిన త‌ర్వాత మిక్సీలో వేసి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం నూనె వేసి పల్లీలు, గుప్పెడు కరివేపాకులు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి.
  4. అవి వేగాక ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి.
  5. అపై ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి, రుచికి సరిపడా ఉప్పును అన్నంలో వేసి  బాగా కలుపుకోవాలి.
  6. ఒక నిమిషం పాటు స్టవ్ మీదే ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

అంతే రుచికరమైన కరివేపాకు రైస్ త‌యారైంది. ఎంతో కమ్మ‌ద‌నంగా, ఇష్టంగా తినేయ‌చ్చు.  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ వేసవిలో కరివేపాకులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎన్ని స‌మ‌స్య‌ల‌కైనా క‌రివేపాకుతో చెక్ పెట్ట‌వ‌చ్చు. ఆరోగ్య స‌మ‌స్య‌లైనా, సౌంద‌ర్య స‌మ‌స్య‌లైనా, జుట్టు స‌మ‌స్య‌లైనా ఇలా అన్నింటికీ  క‌రివేపాకు ర‌క్ష‌ణగా నిలుస్తుంది. అలాగే దీన్ని తినడం వ‌ల‌న బ‌రువు కూడా సులువుగా తగ్గుతారు. రాత్రిపూట సింపుల్‌గా ఒక కప్పు కరివేపాకు రైస్ తింటే చాలు మంచి శ‌క్తిని ఇస్తుంది. బ‌రువు పెర‌గ‌రు. జీర్ణ‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంది. ఒక‌వేళ రాత్రి అన్నం మిగిలిపోతే ఉద‌యాన్నే ఈ కరివేపాకు రైస్‌ చేసుకోవచ్చు. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version