Home ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌ రివ్యూ : ఊహించిన మలుపులే

ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌ రివ్యూ : ఊహించిన మలుపులే

family man 2

రివ్యూః ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌
రేటింగ్ః 3/5
నటీనటులు : సమంత అక్కినేని, మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి, షరీబ్‌ హష్మి, శ్రేయ ధన్వంతరీ, సన్నీ హిందూజ, షాహబ్‌ అలీ, అశ్లేష ఠాకూర్‌
దర్శకులు : రాజ్‌ నిడుమోరు అండ్‌ కృష్ణ డీకే, సుపర్ణ్‌ ఎస్‌ వర్మ
నిర్మాతలు : రాజ్‌ అండ్‌ డీకే
నెట్‌ వర్క్ : అమెజాన్‌ స్టూడియోస్‌
కంటెంట్‌ అడ్వైజరీ : 18 ప్లస్‌
ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ సీజన్‌ 1 చూసిన వారికి రెండో సీజన్‌ ఎప్పుడు వస్తుందా అన్న ఉత్కంట ఉండేది. కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు జూన్‌ 4, 2021న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదలైంది. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేసే జాతీయ నిఘా సంస్థ అధికారి శ్రీకాంత్‌ తివారీ ఫ్యామిలీ మ్యాన్‌ కథానాయకుడు.

ఈ పాత్రలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఒదిగిన తీరు సీజన్‌ 1కు వన్నె తెచ్చింది. ఐఎస్‌ఐ తీవ్రవాదుల కుట్రలు, వాటిని కథనాయకుడు భగ్నం చేయడం, అడుగడుగునా ఊహించని మలుపులు సీజన్‌ 1 అత్యంత ఆదరణ పొందేందుకు కారణమైంది.

అత్యంత ప్రజాధరణ ఉన్న సమంత అక్కినేని ప్రతివాది పాత్ర పోషించడంతో సీజన్‌ 2కు మరింత ప్రచారం లభించింది. విడుదలకు ముందే ప్రసార సాధనాల్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకుంది.

ఫ్యామిలీ మ్యాన్‌ 2 కథ ఏంటి?

టాస్క్‌ అధికారిగా అండర్‌ కవర్‌ ఆపరేషన్లలో ఉన్న శ్రీకాంత్‌ తివారీ (మనోజ్‌ బాజ్‌పాయ్‌) ఢిల్లీ ఆపరేషన్‌ పూర్తయ్యాక కుటుంబ సమస్యల కారణంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు. భార్య సుచి (ప్రియమణి) కోరిక మేరకు 9 టూ 5 జాబ్‌ చేస్తున్నా తన పట్ల ఎందుకు ముభావంగా ఉంటుందో అర్థం కాక ఆవేదనతో ఉంటాడు.

భార్య కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లినప్పటికీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరక మాటామాటా పెరిగి తిరిగి టాస్క్‌లో చేరుతాడు. సుచీ కూడా తన మునుపటి జాబ్‌లో చేరుతుంది. టాస్క్‌లో తిరిగి చేరకముందే.. టాస్క్‌ సహచర సభ్యుడు జేకే తల్పాడే ద్వారా టాస్క్‌ మిషన్‌ తెలుసుకుంటాడు. తనకున్న పాత పరిచయాలతో సాయం చేస్తుంటాడు. సీజన్‌ 2 టాస్క్‌ ఆపరేషన్‌ మొదటి సీజన్‌ కంటే భిన్నంగా ఉంటుంది.

శ్రీలంకలో తమిళుల స్వేచ్ఛాస్వాతంత్య్రం కోసం పోరాడే భాస్కరన్, ఆయన సోదరుడు సుబ్బు, సహచరుడు దీపన్‌ల నేతృత్వంలోని సాయుధులు శ్రీలంక సైన్యం దాడిలో చనిపోతారు. ముగ్గురు నాయకులు లండన్‌ నుంచి ఆపరేట్‌ చేస్తుంటారు. తమకు అనుకూలంగా భారత ప్రభుత్వ మద్దతు కూడగట్టేందుకు తమిళనాడు వచ్చిన సుబ్బును.. శ్రీలంక అధ్యక్షుడు రూపతుంగ కోరిక మేరకు ఆయనకు స్వాధీనం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

దీనిని గ్రహించిన ఐఎస్‌ఐ ఏజెంట్‌ మేజర్‌ సమీర్‌ సుబ్బును కోర్టు వద్ద పేలుళ్లతో హతమారుస్తాడు. భాస్కరన్‌ భారత ప్రభుత్వంపై దాడి చేయాలన్న దురుద్దేశంతో ఈ కుట్ర పన్నిన సమీర్‌.. భాస్కరన్‌ వద్దకు వెళ్లి భారత ప్రధాన మంత్రిపై ప్రతీకారం తీసుకోవాలని, తాను సాయం చేస్తానని చెబుతాడు.

ఈనేపథ్యంలో అప్పటివరకు అజ్ఞాతవాసంలో ఉన్న భాస్కరన్‌ అనుచరులు రాజీ(సమంత), సెల్వ తదితరుల బృందానికి భాస్కరన్‌ మిషన్‌ అప్పగిస్తాడు.

ఈ మిషన్‌ అమలు చేసేందుకు రాజీ బృందం ఎలాంటి ఎత్తుగడలు వేసింది? శ్రీకాంత్‌ తివారీ బృందం ఎలా ఎదుర్కొన్నదీ ఈ సీజన్‌ 2లో చూడొచ్చు.

ఫ్యామిలీ మ్యాన్‌ 2 మెప్పించిందా?

ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 1 ప్రతి ఎపిసోడ్‌ ఉత్కంటతో, ఊహించని మలుపులతో మొత్తం ఎపిసోడ్లు ఏకబిగిన చూసేలా చేసింది. ఫ్యామిలీ మ్యాన్‌ 2 లో అన్నీ ఊహించిన మలుపులే. మొదటి సీజన్‌తో పోలిస్తే అంత ఉత్కంఠ, ట్విస్టులు ఉండవు గానీ, సీజన్‌ 2 బోర్‌ కొట్టించదు. అలా అని అంతగా కొత్తదనం కనిపించే సన్నివేశాలు ఏవీ లేవు.

సంభాషణల్లో అక్కడక్కడ పదును పెరిగింది. శ్రీకాంత్‌ తివారీ, సుచీ మధ్య సంబంధాల విషయంలో అనవసరంగా నిడివి పెంచినట్టు అనిపిస్తుంది. అలాగే ఐటీ జాబ్‌లో టీమ్‌ లీడర్‌ సన్నివేశాల్లోనూ కోత వేయాల్సింది.

ఫ్యామిలీ మ్యాన్‌ 2 హిందీ వెబ్‌ సిరీస్‌ అయినప్పటికీ కథ దృష్ట్యా సంభాషణలు ఎక్కువ తమిళంలోనే ఉన్నాయి. అయితే ఆంగ్ల సబ్‌టైటిల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

భార్యాభర్తల మధ్య సంబంధాలు లేనప్పుడు పిల్లల మానసిక పరిణితి ఎలా ఉంటుందో ఆలోచింపజేసేలా శ్రీకాంత్‌ తివారీ కూతురు ధ్రుతి పాత్ర ఉంటుంది. కౌమారదశలో ఆ ప్రభావ తీవ్రతను ఈ పాత్ర తెలియపరుస్తుంది.

నటీనటులు పర్‌ఫామెన్స్ :

సీజన్‌ 1లో మనోజ్‌ బాజ్‌పాయ్‌ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయగా, ఈ సీజన్‌ 2లో సమంత అక్కినేని శ్రీలంక తమిళ రెబల్‌గా రాజీ పాత్రలో ఒదిగిపోయింది. అజ్ఞాతవాసంలో గార్మెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలో సాధారణ ఉద్యోగిలా, శ్రీలంకలో తమిళ రెబల్‌గా, పైలట్‌ ఫైటర్‌గా వేరియేషన్‌ చూపించింది. కళ్లల్లో కసిని, పంటి బిగువన ప్రతీకారాన్ని చూపించింది. యాక్షన్‌ సన్నివేశాల్లో మెప్పించింది.

కాగా ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 3 కూడా ఉంటుందని చివరలో ఇచ్చిన టీజర్‌ మళ్లీ ఉత్కంటను రేపుతుంది.

[yasr_overall_rating size=”medium” postid=”2665″]
Exit mobile version