Home న్యూస్ పాత మిత్రుల పులి గర్జనలు

పాత మిత్రుల పులి గర్జనలు

jyotiraditya scindia
file photo

ధ్యప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు ఇప్పటి నుంచే వేడి పుట్టిస్తున్నాయి. పాత మిత్రులు జ్యోతిరాధిత్య సింథియా, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ మధ్య పంచ్ డైలాగులు రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న జ్యోతిరాధిత్య కమల దళంలో చేరాక గతంలో తనను ఎదగనివ్వకుండా చేశారన్న కోపంతో పాత మిత్రులు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ లపై గట్టిగానే దాడి చేస్తున్నారు. 

మధ్యప్రదేశ్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణ కూడా ఉప ఎన్నికల నేపథ్యంలోనే జరిగింది. సగానికి పైగా సింథియా వర్గీయులకే మంత్రివర్గంలో స్థానం లభించింది. ఇటీవల జ్యోతిరాధిత్య సింథియా మీడియాతో మాట్లాడుతూ పంచ్ డైలాగులు విసిరారు. ‘15 నెలల్లో వారు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. స్వప్రయోజనాల కోసమే వారు పనిచేశారు. ఒకసారి గతంలో వారు చేసిన వాగ్దానాలు, వాటిని విస్మరించిన చరిత్రను పరిశీలించుకోవాలి. అయితే నేను వాళ్లకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా. టైగర్‌ అభీ జిందా హై..’ అంటూ జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, కమల్‌నాథ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. 

కమల్ నాథ్ వ్యంగ్యాస్త్రం

జ్యోతిరాధిత్య సింథియా చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఏ పులి బతికుంది..? పేపర్‌ మీదా? లేక సర్కస్‌ లోనా? అంటూ కమల్ నాథ్ వ్యంగ్యంగా స్పందించారు.
కొంతమంది తమకు తాము టైగర్స్‌ అని చెప్పుకుంటున్నారని, అయితే తాను టైగర్‌ను కాదని, పేపర్‌ మీద ఉండే టైగర్‌ను కూడా కాదని, జస్ట్‌ కమల్‌నాధ్‌ని అని ఆయన పేర్కొన్నారు. 

ఇదే రీతిలో దిగ్విజయ్ సింగ్ కూడా మండిపడ్డారు. 2001లో విమాన ప్రమాదంలో మరణించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, సింధియా తండ్రి మాధవరావు సింధియాతో కలిసి ‘పులులను వేటాడేవాడిని’ అని డైలాగ్ విసిరారు. ‘వేట నిషేధించనప్పుడు. నేను, మాధవరావు సింధియా పులులను వేటాడేవాడి. కానీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని తీసుకువచ్చినప్పటి నుండి నేను వాటిని కెమెరాలో మాత్రమే కాల్చాను. పులి యొక్క నిజమైన పాత్ర మీకు తెలుసు. అడవిలో ఒక పులి మాత్రమే మిగిలి ఉంది’ అని స్పందించారు.

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన సింధియా.. మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు బయటకు రావడంతో కమల్‌నాథ్‌ సర్కారు కుప్పకూలగా.. బలం నిరూపించుకున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సింధియా ఎంపిగా ఎన్నిక కాగా.. ఆయన మద్దతుదారులకు మంత్రులుగా అవకాశం దక్కించుకోవడం గమనార్హం.

Exit mobile version