ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ సడలింపుల్లో దుకాణాలు, సెలూన్ షాపులు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కరోనా కట్టడికి పలు జగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన జగ్రత్తలు తీసుకొని షాపులు తెరుచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దుకాణదారులకు, ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరాన్ని సీఎం జగన్ నొక్కి చెప్పారు.
రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ
పట్టణ ప్రాంతాల్లో ఏయే దుకాణాలు తెరుచుకోవచ్చు, వాటిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాలు, సెలూన్‌లకు అనుమతి ఇచ్చింది. షరతులను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. జిల్లా అధికార యంత్రాంగం నోటిఫై చేసిన కట్టడి ప్రాంతాలు మినహా… ఇతర ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చునని అందులో తెలిపింది.
పాటించాల్సిన మార్గదర్శకాలు ఇవే
ఒక్కసారి ఐదుగురు వినియోగదారులే ఉండాలి. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పని సరి. దుకాణాల్లో ద్వారాలు, కౌంటర్లు పెంచాలి. ప్రతి క్షౌరశాలలో పేర్లు నమోదు చేయాలి. సొంత టవల్తో వెళితే మేలు అని రాష్ట్ర పురపాలక శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. దుకాణాలు తెరిచేందుకు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉంది.
ఔషధ దుకాణాలకు ఎక్కువ సేపు తెరచుకునేందుకు అనుమతి ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సంబంధిత సంస్థలకు అనుమతి లేదు. హోం డెలివరీలు, టేక్ ఎవే సేవలను మాత్రం అందించవచ్చు. ప్రస్తుతానికి పాదరక్షలు, వస్త్ర, ఆభరణాల దుకాణాలు తెరవరాదు.
దుకాణాల్లో వినియోగదారుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి. ఏకకాలంలో ఐదుగురికి మించి లోపల ఉండరాదు. బయట వృత్తాలతో కూడిన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి.
వినియోగదారులకు థర్మల్ స్ర్కీనింగ్ చేయాలి. చేతులను శానిటైజ్ చేసుకుని, మాస్క్‌లను ధరించిన తర్వాతే లోనికి అనుమతించాలి. మొత్తం సిబ్బందిలో 50 శాతంతోనే పని చేయాలి. దుకాణంలోకి వెళ్లి-రావడానికి వీలైనన్ని ఎక్కువ ద్వారాలు ఏర్పాటు చేయాలి.
బిల్లు కౌంటర్ల సంఖ్య కూడా పెంచాలి. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, లిఫ్ట్‌లు, షాపింగ్, వర్కింగ్, పార్కింగ్ ప్రదేశాలను ప్రతి రోజూ ఉదయం తెరిచేముందు, సాయంత్రం మూసివేసిన తర్వాత, భోజన విరామ సమయాల్లో శానిటైజ్ చేస్తుండాలి.
డోర్ హ్యాండిళ్లు, రెయిలింగ్‌లు, లిఫ్ట్ బటన్లకు ఎర్ర రంగు వేసి, తరచుగా క్రిమిరహితం చేస్తుండాలి. మరుగుదొడ్లను గంటకొకసారి శుభ్రపరచాలి. నిరంతర నీటి సరఫరా ఉండాలి. టిష్యూ పేపర్లు, శానిటైజర్లు ఉంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాటించాల్సిన మార్గదర్శకాలను తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలి.
సెలూన్లలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
సెలూన్లను ఎక్కవ (హై) బడ్జెట్, తక్కువ (లో) బడ్జెట్ క్షౌరశాలలుగా వర్గీకరించి, వాటి నిర్వాహకులు పాటించాల్సిన నియమ నిబంధనలను నిర్దేశించింది. వినియోగదారులందరినీ టచ్‌లెస్ థర్మోమీటర్ల ద్వారా పరీక్షించాలి. ప్రతి ఒక్క ఖాతాదారుడి ఫోన్ నెంబర్, పేరు నమోదు చేసుకోవాలి.
వైరస్ లక్షణాలు ఏమైనా ఉంటే వినియోగదారుడు తప్పని సరిగా చెప్పాలి. వైరస్ లక్షణాలు కనిపించిన వారికి సేవలందించరాదు. సిబ్బంది మాస్క్/ఫేస్ షీల్డ్ ధరించాలి.
ప్రతి ఒక్క వినియోగదారుడికి సేవలందించిన అనంతరం గ్లౌవ్స్‌ను మార్చుకోవాలి. వినియోగదారులకు కప్పే టవల్స్ , ఇతర వస్త్రాలు, పరికరాలన్నింటినీ శుభ్రం, డిస్‌ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతనే వాడాలి.
ఫర్నిచర్, ఫ్లోర్, అద్దాలు, ప్రవేశ ద్వారాలు, మెట్లు, కుర్చీలు, టాయ్‌లెట్లు, బాత్‌రూంలు, సింక్‌లు ఇతర ప్రదేశాలన్నింటినీ తరచూ శుభ్రం చేస్తుండాలి. వీలైనంత వరకు హైబడ్జెట్ క్షౌరశాలల్లోని జాగ్రత్తలన్నీ పాటించాలి.