Home ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలుగు సినిమా రంగం కొత్త పంథాలో

తెలుగు సినిమా రంగం కొత్త పంథాలో

shooting still

తెలుగు సినిమా రంగం కొత్త పంథాలో పనిచేయనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో సమూల మార్పులు రానున్నాయి. సినిమా చిత్రీకరణ మొదలు, విడుదల వరకు ఇన్నాళ్లపాటు కొనసాగిన పంథాకు కరోనా వైరస్ చెక్ పెట్టనుంది. వైరస్ ముప్పు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేకపోవడంతో దానికి అనుగుణంగా చిత్ర పరిశ్రమ తనను తాను మార్చుకోనుంది.

ముఖ్యంగా షూటింగ్ ల విషయంలో ఇన్నాళ్లు అవలంబించిన పద్ధతులు ఇక మీదట చెల్లబోవు. లొకేషన్ లో ప్రతి అడుగును వైరస్ ఫ్రీ అయితేనే ముందుకెళ్లే పరిస్థితి. ఇక దర్శక, నిర్మాతలు సినిమా చిత్రీకరణ, కథల విషయంలో ఆచితూచి అడుగులు వేయనున్నారు.

లాక్ డౌన్ పరిస్థితి వల్ల కొంత ఓటీటీలకు అలవాడుపడిన ప్రేక్షకుల్ని మెప్పించేందుకు కథల విషయంలో, నిర్మాణ విలువల విషయంలో జాగ్రత్తలు పాటించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు.

షూటింగ్ లలో వందలు, వేల మంది కుదరదు!

సినిమా షూటింగ్ అంటేనే సెట్ లో వందల మంది హడావుడి. ఇక నుంచి ఈ వందలు, వేల మంది ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇది పదుల సంఖ్యకు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. షూటింగ్ లలో నటులు, టెక్నీషియన్లు, స్పాట్ లో పని చేసే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

సెట్లో వైరస్ వ్యాప్తి జరగకుండా, హీరో, హీరోయిన్లు మొదలుకొన్ని అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. లాక్ డౌన్ అనంతరం సినిమా చిత్రీకరణలు ప్రారంభమైతే నటీనటుల కొరత కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇన్నాళ్లు షూటింగ్ లు మొత్తం బంద్ కావడమే కారణం. తిరిగి ఒక్కసారిగా చిన్న, పెద్ద సినిమాల చిత్రీకరణ ప్రారంభమైతే ఈ కొరత స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక షూటింగ్ లకు ప్రభుత్వాల నుంచి ఎప్పటికి అనుమతులు వస్తాయో వేచిచూడాలి. ఒక్కసారిగా చిత్రీకరణలకు గేట్లు తెరిస్తే తెలుగు రాష్ర్టాల్లో సినిమా స్టూడియోలు, షూటింగ్ లొకేషన్ల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ప్రభుత్వ విభాగాలు, సంస్థల పరిధిలో ఉచితంగా షూటింగ్ లకు అనుమతులిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమాలు, టీవీ కార్యక్రమాల చిత్రీకరణకు ఈ నిర్ణయం ఒకింత వెసులుబాటు కల్పిస్తుదనే చొప్పొచ్చు.

చిరంజీవి నివాసంలో సినీ పెద్దల సమావేశం..

చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు తిరిగి ప్రారంభించే విషయమై చర్చించేందుకు చిరంజీవి వివాసంలో సినీ పెద్దలు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, సి. కల్యాణ్, శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వినాయక్, ఎన్. శంకర్ తదికతరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ముఖ్యంగా షూటింగ్ లు తిరిగి ప్రారంభించే విషయమై చిత్ర పరిశ్రమ అభిప్రాయలను సినీ పెద్దలు వినిపించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమావేశం అనంతరం మంత్రి తలసాని తెలిపారు.

‘అందరి అభిప్రాయలు తీసుకొని ముందుకెళ్తాం. సినిమా షూటింగ్ లొకేషన్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాం. తెలుగు సినీ పరిశ్రమ ప్రాధాన్యం పెరిగింది. థియేటర్లు తెరిచిన వెంటనే ప్రేక్షకులు వస్తారా అన్నది ఒక సమస్యగా ఉంది. షూటింగ్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సినీ పెద్దలు మాట్లాడారు.

ఒకట్రెండు రోజుల్లో అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకుంటాం. మాక్ షూటింగ్ లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాలపై సినీ పెద్దలు ముఖ్యమంత్రిని కలుస్తామని అంటున్నారు. సినీ పరిశ్రమ పట్ల ప్రభుత్వ సానుకూలంగా ఉంద’న్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఫంక్షన్లు బంద్..

సినిమా ఫంక్షన్లు అంటేనే వేల మంది అభిమానులు గుమిగూడుతారు. అలాంటి పరిస్థితుల్లో ఇక సినిమా ఫంక్షన్లు అన్నీ బంద్ కాక తప్పదు. వాటికి ఇప్పట్లో అనుమతులు కూడా వచ్చే అవకాశం లేదేమో!. ఆడియో ఫంక్షన్లు, ప్రీలీజ్ ఈవెంట్లు, ప్రచారాలు, టూర్లు, విజయోత్సవ వేడుకలను ఇప్పట్లో చూస్తామనుకోవడం పొరబాటే అవుతుంది. ఈ ఫంక్షన్ల విషయంలో కొత్త మార్పులు రాకమానవు.

ఈ విషయమై నిర్మాత శోభూ యార్లగడ్డ స్పందిస్తూ.. కోవిడ్ పరిస్థితుల అనంతరం తెలుగు సినిమా రంగం మార్కెటింగ్ విషయంలో ఎలాంటి మార్పులు వస్తాయన్న విషయంలో ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నారు. ఆడియో ఫంక్షన్లు, ప్రీరిలీజ్ వేడుకలు, థియోటర్లకు, మాల్స్ కు వెళ్లి సినిమాలు చేసే విషయంలో వచ్చే మార్పులపై ఆయన ఇప్పుడే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version