Home ఎంటర్‌టైన్‌మెంట్‌ Harnaaz sandhu: హర్నాజ్‌ కౌర్‌ సంధు .. మిస్‌ యూనివర్స్‌గా మెరిసిన భారతీయ అందం…

Harnaaz sandhu: హర్నాజ్‌ కౌర్‌ సంధు .. మిస్‌ యూనివర్స్‌గా మెరిసిన భారతీయ అందం…

harnaaz kaur sandhu
miss universe 2021 harnaaz kaur sandhu

Harnaaz Kaur Sandhu: హర్నాజ్‌ కౌర్‌ సంధు.. ఒక్క విజయంతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంది. అందమంటే.. పొడవాటి శిల్పంలా సన్నగా, చేపల్లాంటి కళ్లతో, అలల్లా ఎగిరే కురులతో, ఎరుపెక్కిన పెదాల వెనుక విచ్చుకున్న నవ్వుతో, వెన్నెల చేసిన సంతకంలా… ఇలా వివరిస్తూ పోతే కవికి పదాలు కరువవుతాయి కానీ.. హర్నాజ్‌ కౌర్‌ సంధుని చూపిస్తే చాలు. అందానికి సరైన అడ్రస్‌ దొరికినట్టే అనిపిస్తుంది.

హర్నాజ్‌ కౌర్‌ సంధు మొన్నటి వరకు ఎవరో కూడా తెలియని పిల్ల. పేరు కూడా విన్నట్టు లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది ఆమె పేరు. గూగుల్‌ సెర్చ్‌లో Harnaaz Kaur Sandhu గురించి వెతుకులాటలు కోట్లలో సాగుతున్నాయి. ఎవరీ అందగత్తె? ఇన్నాళ్లు ఎక్కడుంది? భారతీయులమైన మనకు కూడా ఈమె తెలియకపోవడం గమనార్హం.

నిజానికి మిగతా రాష్ట్రాల వారికి హర్నాజ్‌ కొత్తేమో కానీ, పంజాబ్‌ ప్రజలకు మాత్రం హర్నాజ్‌ పరిచయస్థురాలే. ఎందుకంటే కొన్ని పంజాబీ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె అందాన్ని అక్కడి సినిమా వాళ్లు గుర్తించలేక పోయారు. అవకాశాల కోసం చాలా వెతుకులాడింది. ఏదో రెండు మూడు సినిమాలు మాత్రమే తలుపుతట్టాయి.

ఇప్పుడు ఆమెకు ఆ బాధ లేదు, పంజాబీ సినీ దర్శకుల వెంటపడాల్సిన అవసరం కూడా లేదు, తాను తలచుకుంటే బాలీవుడ్‌ నుంచే అవకాశాలు తలుపుతడతాయి. అందుకేనేమో ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఓపికగా వేచి ఉండాలి అంటారు పెద్దలు. హర్నాజ్‌ కౌర్‌ సంధుకి తన రోజు వచ్చేసింది.

ఎనభై మందిని ఓడించిన హర్నాజ్‌ కౌర్‌ సంధు

harnaz kaur sandhuఇజ్రాయెల్‌లోని ఐలట్‌ నగరంలో జరిగాయి ఈసారి మిస్‌ యూనివర్స్‌ పోటీలు. 80 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొన్నారు. వడపోతలు చేసుకుంటూ వచ్చిన న్యాయనిర్ణేతలు చివరికి టాప్‌ 3లో ఉన్న వారి పేర్లు ప్రకటించారు. అప్పటికే భారతీయుల్లో ఆశ చిగురించింది. చివరికి ఆ ముగ్గురు ఇద్దరయ్యారు. చేయిచేయి పట్టుకుని నిల్చున్నారు ఆ అందాల రాణులు. వారిలో ఒకరు హర్నాజ్‌. ఆ క్షణం చాలా భావోద్వేగానికి గురైంది ఆమె. ‘మిస్‌ యూనివర్స్‌ విన్నర్‌ ఈజ్‌ ఇండియా’ అనగానే హర్నాజ్‌ కట్టలు తెగిన ప్రవాహంలా మారింది. ఆనందంతో కళ్లనీరు పెట్టుకుంది.

నిరీక్షణకు తెర

అయిదా.. పదా… ఏకంగా 21 ఏళ్ల నిరీక్షణ. అప్పుడెప్పుడో మన చిన్నప్పుడు 2000లో లారా దత్తా మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని మోసుకొచ్చింది. మళ్లీ ఇప్పటివరకు ఆ కిరీటం మనదేశానికి దక్కలేదు. ఇప్పుడు హర్నాజ్‌ ఆ ఘనతను సాధించింది. ఫైనల్‌ పోటీలకు వెళ్లే ముందే ఆమె ‘కిరీటాన్నీ తిరిగి మనదేశానికి తెచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తా’ అని చెప్పి వెళ్లింది. ఆ మాటను నిలబెట్టుకుంది. మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని తన దేశానికి కానుకగా ఇచ్చింది.

సాధారణ పిల్లే…

హర్నాజ్‌ పుట్టి పెరిగిందంతా పంజాబ్‌లోనే. తండ్రి పీఎస్‌ సంధు, తల్లి రవీందర్, అన్న హర్నూర్‌. హర్నాజ్‌కు ఓ బుజ్జి కుక్క పిల్ల కూడా ఉంది. పేరు రోగర్‌. ప్రస్తుతం హర్నాజ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చదువుతోంది. ఆమెకు చిన్నప్పట్నుంచే నటన, మోడలింగ్‌ చాలా ఇష్టం. ఆమె ఇష్టాన్ని ఇంటిల్లిపాది గౌరవించారు. ప్రోత్సహించారు. ఆ ప్రోత్సహంతోనే 17 ఏళ్ల వయసులో మిస్‌ ఛండీఘడ్‌ గా ఎంపికైంది. అప్పట్నించి ఎక్కడ అందాల పోటీలు జరిగినా పాల్గొనేది హర్నాజ్‌. అలా ఇప్పటికీ ఎన్నో పోటీల్లో గెలిచింది.

హర్నాజ్‌.. ఒక్కగానొక్క ఆడపిల్ల

హర్నాజ్‌ కౌర్‌ వాళ్ల కుటుంబంలో చాలా స్పెషల్‌ వ్యక్తి. ఆమె తండ్రికి 17 మంది అన్నదమ్ములు కానీ ఎవరికీ ఆడపిల్లలు పుట్టలేదు. వారందరికీ హర్నాజ్‌ ఒక్కతే ఆడపిల్ల. అందుకే అల్లారు ముద్దుగా చూసుకుంటారు. హర్నాజ్‌ తండ్రి మాట్లాడుతూ ‘దేవుడు మా కలల్ని సాకారం చేశాడు. ఇంతకన్నా ఆయన్ను ఇంకేం అడగాలి. హర్నాజ్‌ ఇంటికి రాగానే పంజాబీ స్టైల్లో వేడుక చేస్తాం, బాంగ్రా డ్యాన్సులు వేస్తాం’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

పంజాబీ ఫుడ్‌ మానేసి…

అందాల పోటీల కోసం సిద్ధమయ్యేందుకు హర్నాజ్‌ చాలా కష్టపడిందని చెబుతున్నారు ఆమె తల్లి రవీందర్‌. ‘మేము పంజాబీలం. మా ఆహారంలో నేతిలో కాల్చిన పరాటాలు బాగా తింటాం. కానీ హర్నాజ్‌ అన్నీ మానేసింది. సలాడ్లు, పండ్లనే ఎక్కువగా తినేది. ఆమె చాలా బాగా వంట చేస్తుంది. మా అందరికీ వడ్డిస్తుంది’ అని చెప్పుకొచ్చింది. హర్నాజ్‌ తల్లి మొహాలీలోని సోహన ఆసుపత్రిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ గా పనిచేస్తున్నారు. కూతురి విజయ వార్త వినేందుకు చాలా ఆత్రుతగా ఉన్న కుటుంబం పోటీలు జరిగిన రాత్రి నిద్రపోలేదు. కూతురి విజయ వార్త కోసం వేచి ఉంది. సెక్విన్డ్‌ గౌనులో మెరిసిన హర్నాజ్‌ విజేతగా ప్రకటించగానే ఇక్కడ వీరింట్లో టపాసులు పేలాయి.

అందమే కాదు వ్యక్తిత్వం కూడా…

అందాల కిరీటం కేవలం ముఖంలో మెరుపుకే కాదు, మెదడులో తెలివిని కూడా చూసి అందిస్తారు. వేదికపైనే అందగత్తెలను ఎన్నో ప్రశ్నలను సంధిస్తారు న్యాయనిర్ణేతలు. సంధు తాను ఎదుర్కొన్న ప్రతి ప్రశ్నకు సమర్థవంతంగా సమాధానమిచ్చింది. ఆత్మవిశ్వాసం లేకపోవడమే యువతలో పెద్ద లోపమని, ఇతరులతో పోల్చుకుని తమను తాము ఎక్కువ చేసుకుంటారని అభిప్రాయపడింది హర్నాజ్‌. ‘నాపై నాకు చాలా నమ్మకముంది… అందుకే నేను ఈ విశ్వ వేదికపై నిల్చున్నా’ అని చెప్పి న్యాయనిర్ణేతల మనసు గెలుచుకుంది.

మిస్‌ యూనివర్స్‌ గెలుపు తరువాత న్యూయార్క్‌లో నివసించాల్సి ఉంటుంది హర్నాజ్‌. అక్కడే ఉండి ఒక ఏడాది పాటూ ప్రపంచవ్యాప్తంగా జరిగే చైతన్య కార్యక్రమాలకు హాజరవ్వాల్సి ఉంటుంది.

– మానస్‌, ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌

https://dearurban.com/wp-content/uploads/2021/12/harnaaz-kaur-sandhu.mp4
Harnaaz kaur sandhu (Video Credit: harnaaz official Instagram account)
Exit mobile version