Home ఎంటర్‌టైన్‌మెంట్‌ money heist: మనీ హెయిస్ట్ రివ్యూ: ప్రతీ సీన్ క్లైమాక్సే

money heist: మనీ హెయిస్ట్ రివ్యూ: ప్రతీ సీన్ క్లైమాక్సే

moneyheist

Money heist web series review: మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉందన్న మాట ఆ నోట ఈ నోటా పాకి, అచ్చంగా మౌత్ పబ్లిసిటీతోనే సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ సూపర్ హిట్. netflix లో ప్రసారమయ్యే ఈ సిరీస్ లో తాజాగా ఐదో సీజన్ రిలీజ్ అయింది. అసలు మనీ హెయిస్ట్ కు ఇంత క్రేజ్ రావడానికి కారణాలేంటి?

ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ టీవీ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువమంది చూసిన నాన్‌–ఇంగ్లీష్‌ సిరీస్‌ కూడా ఇదే. ఓటీటీ వాడకం పెరిగాక లోకల్, నాన్ లోకల్ అనే తేడా లేకుండా ఎలాంటి కంటెంట్‌నైనా జనం ఆదరిస్తున్నారు. ఈ దొంగల ముఠా కథకు ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

మనీ హెయిస్ట్‌ .. సింపుల్ బట్ ఇంట్రెస్టింగ్

మనీ హెయిస్ట్‌ ఒరిజినల్‌ స్పానిష్‌  టైటిల్‌ ‘లా కాసా డె పాపెల్‌’. బ్యాంకు దోపిడీ నేపథ్యంలో సాగే కథ. కాన్సెప్ట్ చాలా సింపుల్.. స్పెయిన్‌లోనే ప్రతిష్టాత్మకమైన బ్యాంక్, మ్యూజియంలను దోచుకోడానికి ప్రయత్నించే ఓ గ్యాంగ్‌.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసే పోలీసులు. ఇదే లైన్‌తో సిరీస్ మొదలవుతుంది.

కానీ ఈ గ్యాంగ్ లోని క్యారెక్టర్లు వారి మధ్య ఎమోషన్స్.. మరో పక్క పోలీసుల వీర ప్రయత్నాలు, మధ్యలో ట్విస్ట్‌లు ఇలా.. ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్‌లా ఉంటుంది. సీజన్‌లో ఒక ఎపిసోడ్ అయిపోతుందంటే.. ఆడియెన్స్‌లో టెన్షన్ మొదలవుతుంది ‘నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతోందా’ అని. అంతలా కట్టిపడేసేలా ఉంటుందీ కథనం.

అంతుచిక్కని సస్పెన్స్

సగటు ప్రేక్షకుడికి అంతుపట్టని సస్పెన్స్ ఈ సిరీస్ సొంతం. కథలో నెక్స్ట్ సీన్‌ ఏం జరుగుతుందనేది వ్యూయర్స్‌ అస్సలు అంచనా వేయలేరు. ఒక్కోసారి కథ మధ్యలో ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. స్క్రీన్‌ప్లే వెనక్కు ముందుకు మారుతుంటుంది. సిరీస్‌లో ప్రధానంగా ఆకట్టుకునే అంశం ఇదే.

కట్టిపడేసే క్యారెక్టర్స్

కథలో క్యారెక్టర్స్‌కు, వారి ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారు. దోపిడీకి మాస్టర్ ప్లాన్ వేసే ప్రొఫెసర్ మైండ్‌సెట్‌కు అందరూ ఫిదా అవుతారు. అలాగే ప్రొఫెసర్‌కు అన్న అయిన బెర్లిన్ క్యారెక్టర్ ఇప్పటివరకూ ఎక్కడా చూడని ఓ కొత్తరకం క్యారెక్టర్. ఇక వీరితో పాటు గ్యాంగ్‌లో ఉండే ప్రతీ క్యారెక్టర్‌కు కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. ప్రతీ క్యారెక్టర్‌కి సమాన ప్రాధాన్యం ఉంటుంది.

గుబులు పుట్టించే మనీ హెయిస్ట్

ఈ కథ నరేటర్‌.. దోపిడీ ముఠాలో ఫస్ట్‌ మెంబర్‌ ‘టోక్యో’. మొదట్లో ఒక బ్యాంక్‌ దొంగతనం చేయబోయి ఫెయిల్ అవుతుంది. ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్‌.  ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్‌ గీస్తాడు. అందరూ దొంగతనానికి బ్యాంక్ లోకి చొరబడతారు. అక్కడున్నవారిని బంధిస్తారు.

ఈ దోపిడీ గ్యాంగ్‌లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. కానీ.. ఎక్కడో దూరంగా ఉండి ప్రొఫెసర్‌ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు. మరోపక్క పోలీసులు భారీ బలగాలతో బందీలను, డబ్బును రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.

ఈ క్రమంలో జరిగే యాక్షన్స్ సీన్స్, గ్యాంగ్‌లోని క్యారెక్టర్ల మధ్య రిలేషన్స్‌, ఎమోషన్స్‌, లవ్‌ ట్రాక్స్‌, బందీలతో వచ్చే ఇబ్బందులు.. ఇలా ఇంట్రెస్టింగ్ గా కథ సాగుతూ ఉంటుంది. చివరగా దోపిడీ సక్సెస్ ఫుల్‌గా చేయగలిగారా లేదా ఎవరినైనా కోల్పోయారా అనేది సిరీస్‌లో చూడాల్సిందే.

మాస్టర్ మైండ్ ప్రొఫెసర్

మనీ హెయిస్ట్ కథలో అందరినీ ఆకట్టుకునేది ప్రొఫెసర్ తెలివితేటలు. హెయిస్ట్‌లో ఎలాంటి కష్టం వచ్చినా.. తన మాస్టర్ మైండ్‌తో ఆ కష్టం నుంచి బయటపడేయడం ప్రొఫెసర్ స్పెషాలిటీ. మామూలుగా దొంగతనంలో ఒక ప్లాన్ ఫెయిల్ అయితే తప్పించుకోడానికి మరో ప్లాన్-(ప్లాన్ బీ) మాత్రమే వారి దగ్గర ఉంటుంది. కానీ మనీ హెయిస్ట్‌లో అలా కాదు. ఒక ప్లాన్‌లో ఎన్నో సబ్ ప్లాన్‌లు, ప్రతి ప్లాన్‌కు బ్యాకప్ ప్లాన్.. ఇలా చాలా ఇంటెలిజెన్స్‌తో ఈ సిరీస్ సాగుతుంది.

దోపిడీ కొత్త రూపం..

కథలో ఆకట్టుకునే మరో విషయం.. పేరుకి దోపిడీ దొంగలయినప్పటికీ మన గ్యాంగ్ అనుకున్నంత చెడ్డవాళ్లు కాదు. “మనం డబ్బు దొంగిలించబోవడం లేదు. కేవలం ప్రభుత్వ సమయాన్ని మాత్రమే దొంగిలించి మనమే సొంతగా డబ్బు ప్రింట్ చేసుకోబోతున్నాం. ఇది తప్పు కాదు”  అని ప్రొఫెసర్ చెప్పేమాటలు కొత్తగా అనిపిస్తాయి. ఎవరినీ హింసించకుండా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా హెయిస్ట్ చేయాలనేది ఈ గ్యాంగ్ ముఖ్య లక్ష్యం. కానీ అలా చేయగలిగారా లేదా అనేది సిరీస్‌లో చూడాలి.

మనీ హెయిస్ట్ కు ఈ పాటే ప్రాణం

‘బెల్లా సియావో’ అనే ఒక ఇటాలియన్‌ జానపద గేయం సీరీస్‌లో చాలాసార్లు వినిపిస్తుంది. దానర్థం ‘గుడ్‌బై బ్యూటిఫుల్’ అని. పాత రోజుల్లో ఇటలీలోని వ్యవసాయ మహిళా కూలీలు తమ కష్టాల్ని గుర్తించాలని భూస్వాములకు గుర్తు చేస్తూ ఈ పాటను పాడేవాళ్లు. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో ఆ పాటను రీమేక్ చేస్తూ వచ్చారు. ఈ సిరీస్‌లో మాత్రం ఈ పాట మెయిన్ యాంథమ్‌లా వినిపిస్తుంది.

మనీ హెయిస్ట్ కథ అయిపోయిందా?

రీసెంట్‌గానే ఈ సిరీస్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు దొంగతనం పూర్తి చేసుకుని గ్యాంగ్ బయటపడుతుందా లేదా? ఎవరైనా మరణించారా? అనేది ఈ లాస్ట్ సీజన్ చూసి తెలుసుకోవాలి. మొత్తానికి థ్రిల్ చేస్తూనే కన్విన్సింగ్‌గా ముగింపునిచ్చారు.

అయితే అన్ని ముడులూ విప్పినా బెర్లిన్ అనే ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ స్టోరీని అలాగే వదిలేశారు. 2023లో రానున్న బెర్లిన్ క్యారెక్టర్ ప్రత్యేక స్పిన్-ఆఫ్ సిరీస్‌లో ఈ కథ కంటిన్యూ అవుతుందని టీం వెల్లడించింది. మొత్తగా ఒక్కమాటలో చెప్పాలంటే.. చూడటం మొదలుపెడితే అయిపోయే దాకా అస్సలు ఆపలేని ఏకైక సిరీస్ మనీ హెయిస్ట్.

ఇప్పటి వరకు మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ లో 13 ఎపిసోడ్లు, రెండో సీజన్లో తొమ్మిది ఎపిసోడ్లు, మూడో సీజన్లో ఎనిమిది ఎపిసోడ్లు, నాలుగో సీజన్లో ఎనిమిది ఎపిసోడ్లు, ఐదో సీజన్లో పది ఎపిసోడ్లు ఉన్నాయి. మనీ హెయిస్ట్ అన్ని సీజన్లకు ఇప్పుడు తెలుగులో ఆడియో అందుబాటులో ఉంది.

Exit mobile version