ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ .. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు, హిందీ, తమిళ్ వెర్షన్లలో అమెజాన్ ఒరిజినల్ సిరీస్ గా అందిస్తున్న వెబ్ సిరీస్ ఇది. ఇన్‌సైడ్ ఎడ్జ్ క్రికెట్‌లో తరచూ వినిపించే పదం ఇది. అంటే ఓ బ్యాట్స్‌మన్ బ్యాట్ లోపలి వైపు బంతి తగిలి వెళ్లడం. అది వికెట్లకు తగిలి ఔటైనా కావచ్చు లేక అదృష్టం బాగుంటే తృటిలో తప్పించుకోవచ్చు.
క్రికెట్‌ను ఓ మతంగా భావించే దేశంలో అదే క్రికెట్‌ను ప్రధాన సబ్జెక్ట్‌గా మార్చి ఓ వెబ్ సిరీస్‌లా అందించడంతోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సగం సక్సెసైంది. ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)తో ఇన్‌స్పైర్ అయి తీసిన ఈ వెబ్ సిరీస్.. అదే ఐపీఎల్‌ను మించిన సస్పెన్స్ థ్రిల్లర్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించింది. సూపర్ హిట్ టాక్ కొట్టేసింది.
ఈ మధ్యే ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ సీజన్ 2 కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్‌సైడ్ ఎడ్జ్ ఓవరాల్ రివ్యూను డియర్ అర్బన్.కామ్ మీ ముందుకు తీసుకొస్తోంది.
ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి?
క్రికెట్, బాలీవుడ్, పాలిటిక్స్, సెక్స్, డ్రగ్స్, ఫిక్సింగ్, డోపింగ్.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇన్‌సైడ్ ఎడ్జ్ కథాంశం ఇదే. క్రికెట్ అభిమానులు ఎప్పుడూ చూడని తెర వెనుక సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఈ వెబ్‌సిరీస్ మేకర్స్ మంచి సక్సెస్ సాధించారు.
చివరి బాల్ వరకు ఎవరు గెలుస్తారో తెలియకుండా సాగే ఐపీఎల్ మ్యాచ్‌లాగే ఈ వెబ్ సిరీస్ కూడా ప్రతి ఎపిసోడ్‌కు కావాల్సినంత సస్పెన్స్‌ను మిగిల్చుతూ ముందుకు సాగుతుంది. ఇండియన్ ప్రిమియర్ లీగ్.. సింపుల్‌గా ఐపీఎల్. ఈ లీగ్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. క్రికెట్‌ను వేల కోట్ల బిజినెస్‌గా.. ఆట కంటే ఓ ఫక్తు ఎంటర్‌టైనర్‌గా మార్చింది ఈ లీగే. గల్లీ క్రికెట్‌కే పరిమితమైన ఎంతో మంది యంగ్‌స్టర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా ఈ లీగే.
అదే సమయంలో ఎన్నో వివాదాలు కూడా ఈ లీగ్‌ను చుట్టుముట్టాయి. అందులో ముఖ్యమైనది.. ఫిక్సింగ్. 2013 సీజన్ సందర్భంగా బయటికొచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం ఐపీఎల్‌తోపాటు క్రికెట్ ప్రపంచాన్నే కుదిపేసింది. సాక్షాత్తూ టీమ్ యజమానులే ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసి అభిమానులు నివ్వెర పోయారు.
స్టార్ క్రికెటర్ ధోనీ కెప్టెన్సీలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కోఓనర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ఇదే స్పాట్ ఫిక్సింగ్‌లో చిక్కుకొని రెండేళ్లు నిషేధానికి కూడా గురయ్యాయి. ఈ ఫిక్సింగ్‌నే ప్రధాన కథాంశంగా తీసుకొని ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు.
ఈ సిరీస్ అంతా పవర్ ప్లే లీగ్ చుట్టూ నడుస్తుంది. అందులోని టీమ్స్, యజమానులు, బాలీవుడ్ లింకులు, రాజకీయాలు, ఫిక్సింగ్, దాని తాలూకు హత్యలు, ఆటగాళ్ల సెక్స్ వివాదాలు, డ్రగ్స్, డోపింగ్.. ఇలా ఒకటేమిటి.. అభిమానులకు తెలియని తెర వెనుక జరిగే ప్రతి అంశాన్ని ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. రెండు సీజన్‌లలో కలిపి మొత్తం 20 ఎపిసోడ్స్. అయితే ఏ ఎపిసోడ్‌కు ఆ ఎపిసోడ్ కావాల్సినంత థ్రిల్‌ను పంచుతాయి.
వివేక్ ఒబెరాయ్, రిచా చద్దా, అంగద్ బేడీలాంటి బాలీవుడ్ స్టార్లు తమ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. కాకపోతే సహజంగానే వెబ్‌సిరీస్‌కు సెన్సార్ కట్‌లాంటివి ఏమీ లేకపోవడం వల్ల కాస్త అడల్ట్ కంటెంట్ కూడా అనిపిస్తుంది.
ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ ఎలా మొదలైంది?
అంతర్జాతీయంగా తన ప్రధాన పోటీదారు అయిన నెట్‌ఫ్లిక్స్‌కు చెక్ పెట్టేందుకు 2017లో తన తొలి ఇండియన్ వెబ్ సిరీస్‌గా ఈ ఇన్‌సైడ్ ఎడ్జ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో. అప్పటికి నెట్‌ఫ్లిక్స్ ఇంకా తన తొలి వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్ మేకింగ్‌లోనే ఉంది.
అందులోనూ ఇండియన్స్‌కు ఎంతో ఇష్టమైన క్రికెట్, బాలీవుడ్‌ను మిక్స్ చేస్తూ వచ్చిన వెబ్ సిరీస్ కావడంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ ప్రేక్షకుల మనసును దోచుకుంది. తొలి సీజన్ మొత్తం పది ఎపిసోడ్ల పాటు సాగింది.
ఇన్‌సైడ్ ఎడ్జ్ ఫస్ట్ సీజన్ లో ఏం జరిగింది?
పవర్ ప్లే లీగ్‌లో ప్రధాన టీమ్ అయిన ముంబై మ్యావరిక్స్ కో ఓనర్‌గా ఉన్న బాలీవుడ్ నటి జరీనా మాలిక్ (రిచా చద్దా).. తన టీమ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో విక్రాంత్ ధవన్ (వివేక్ ఒబెరాయ్)తో చేతులు కలపడంతో అసలు కథ మొదలవుతుంది.
అతడు ఓ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఓనర్. అయితే ఆటపై ప్రేమ కంటే ఎక్కువగా.. ఆటను ఫిక్స్ చేసి డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యంగా విక్రాంత్ లీగ్‌లో అడుగు పెడతాడు.
స్పాట్ ఫిక్సింగ్ కోసం ఆటగాళ్లను ఎలా ట్రాప్ చేస్తాడు? ఆ ప్లేయర్స్ అభిమానుల కళ్లకు గంతలు కట్టి ఎలా ఫిక్సింగ్‌కు పాల్పడతారు? ఈ ఫిక్సింగ్‌లు చేస్తూ విక్రాంత్ వేల కోట్లు ఎలా సంపాదిస్తాడు? ఈ ఫిక్సింగ్ ఊబిలో చిక్కుకొని ముంబై టీమ్ కోచ్ నిరంజన్ సూరి (సంజయ్ సూరి) ఎలా ప్రాణాలు కోల్పోతాడులాంటి ఘటనలతో తొలి సీజన్ అంతా అభిమానులకు ఎంతో థ్రిల్‌ను పంచుతుంది.
మంచి దూకుడైన ఆటతో ఆకట్టుకునే సత్తా ఉన్నా.. ఎప్పుడూ వివాదాలతోనే కాలం గడిపే క్రికెటర్ వాయు రాఘవన్ (తనూజ్ వీర్వాణీ), ఫిక్సింగ్ మకిలి అంటకుండా దానిని పక్కా జెంటిల్మన్ గేమ్‌లాగా పవిత్రంగా చూసుకునే ముంబై కెప్టెన్ అరవింద్ విశిష్ట్ (అంగద్ బేడీ), బాలీవుడ్‌లో క్రమంగా తన స్టార్ స్టేటస్ కోల్పోతున్న హీరోయిన్, ముంబై టీమ్ కోఓనర్ జరీనా మాలిక్ (రిచా చద్దా), గల్లీ క్రికెట్ నుంచి వచ్చి స్టార్ క్రికెటర్‌లా ఎదగాలని కలలు కంటున్న ప్రశాంత్ కనూజియా (సిద్ధాంత్ త్రివేదీ), తక్కువ కులం వాడంటూ అతన్ని ఏడిపించే దేవేందర్ మిశ్రా (అమిత్ సియాల్)ల చుట్టూ కథ నడుస్తుంది.
ఫిక్సింగ్‌తో వేల కోట్లు సంపాదించి పవర్ ప్లే లీగ్‌పై పూర్తిగా పట్టు సాధించిన విక్రాంత్ ధవన్ ఒక్క మ్యాచ్‌తో తన సర్వస్వం ఎలా కోల్పోతాడు? అతన్ని వదిలించుకోవడానికి జరీనా మాలిక్‌కు ఇండియన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు యశ్‌వర్ధన్ పాటిల్ అలియాస్ భాయ్‌సాబ్ (అమీర్ బషీర్) ఎలాంటి సాయం చేస్తాడన్న ఎపిసోడ్‌తో తొలి సీజన్ ముగిసిపోతుంది.
సెకండ్ సీజన్.. పాలిటిక్స్ ఎక్కువ
2017లో ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ రాగా.. అది మంచి సక్సెస్ సాధించింది. దీంతో దానికి కొనసాగింపుగా రెండో సీజన్ తీసుకొచ్చారు. అయితే దీనికి రెండేళ్లకు పైనే సమయం పట్టింది. 2019 డిసెంబర్‌లో ఈ రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండో సీజన్ కూడా పది ఎపిసోడ్ల పాటు సాగుతుంది.
తొలి సీజన్‌లో ఎక్కువగా క్రికెట్, ఫిక్సింగ్‌లాంటి వాటి చుట్టూ తిరిగే స్టోరీ.. రెండో సీజన్‌లో రాజకీయాల వైపు మళ్లుతుంది. తొలి సీజన్‌లో కంటికి కనిపించకుండా విక్రాంత్ ధవన్‌తో ఫిక్సింగ్ బాగోతాన్నంతా నడిపించే ఇండియన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు యశ్‌వర్ధన్ పాటిల్.. రెండో సీజన్‌లో ప్రముఖంగా కనిపిస్తాడు.
కథ చాలా వరకు అతని చుట్టే నడుస్తుంది. లోక్‌శక్తి పార్టీ అధ్యక్షుడు కూడా కావడంతో రాజకీయంగా కేంద్ర హోంమంత్రితో అతనికున్న విభేదాలు.. దాని ద్వారా పవర్ ప్లే లీగ్‌కు ఎదురయ్యే ఇబ్బందులు ఈ సీజన్‌లో ప్రధానంగా కనిపిస్తాయి.
క్రికెట్‌ను ఫిక్సింగ్‌లాంటివే కాదు రాజకీయాలు కూడా ఎలా దెబ్బతీస్తున్నాయో ఈ సీజన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
రెండో సీజన్.. స్టోరీ ఏంటి?
ఇంతకుముందు చెప్పినట్లు రెండో సీజన్ చాలా వరకు యశ్‌వర్ధన్ పాటిల్, అతని రాజకీయాలు, ఫిక్సింగ్‌తో క్రికెట్ ప్రభను అతను మసకబారుస్తున్న తీరు చుట్టే తిరుగుతుంది. అత్యంత వివాదాస్పదంగా జరిగిన పవర్ ప్లే లీగ్ గురించి బోర్డు అధ్యక్షుడిగా యశ్‌వర్ధన్ అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఓ జర్నలిస్ట్ అతన్ని ఇంటర్వ్యూ చేయడంతో రెండో సీజన్ ప్రారంభమవుతుంది.
ఈ ఇంటర్వ్యూలో భాయ్‌సాబ్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు సదరు జర్నలిస్ట్ అడగడం, తద్వారా ఇంటర్వ్యూ ముగియగానే ఒక్క మెసేజ్‌తో అతడు తన ఉద్యోగాన్ని కోల్పోయే తీరు.. ఇండియన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా యశ్‌వర్ధన్ పవర్ ఎలాంటిదో చూపిస్తుంది.
ఇక ముంబై టీమ్ ఓనర్‌షిప్ నుంచి విక్రాంత్ ధవన్‌ను తప్పించిన తర్వాత అందులో మెజార్టీ వాటా తన కూతురు మంత్రా పాటిల్ (సప్నా పబ్బి)కు దక్కేలా చేస్తాడు యశ్‌వర్ధన్. ఆమెకు తెలియకుండా మరో కోఓనర్ జరీనా మాలిక్‌తో కలిసి ఫిక్సింగ్ బాగోతాన్నంతా నడిపిస్తుంటాడు.
ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ మొదట్లోనే పవర్ ప్లే లీగ్ కొత్త సీజన్ కోసం వేలం పాట మొదలవుతుంది. అంతవరకు ముంబై కెప్టెన్‌గా ఉన్న అరవింద్ వశిష్ట్‌ను తన టీమ్‌లోకి తీసుకోవడానికి ముందుగానే డీల్ కుదుర్చుకుంటాడు హర్యానా ఓనర్ మనోహర్‌లాల్ హాండా (మను రిషి).
ముంబై టీమ్ కోచ్ మృతికి కారణమైన విక్రాంత్ ధవన్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటానన్న హాండా హామీ మేరకు.. ఆ టీమ్‌కు ఆడటానికి ఒప్పుకుంటాడు అరవింద్. అరవింద్ తప్పుకోవడంతో ఇటు ముంబై కెప్టెన్సీ వాయు రాఘవన్‌కు దక్కుతుంది.
ఈ ఇద్దరి మధ్య లీగ్‌లో సాగే ఫైట్ కూడా రెండో సీజన్‌లో ఆసక్తి రేపుతుంది. రెండో సీజన్‌లో పాలిటిక్స్, ఫిక్సింగ్‌తోపాటు క్రికెట్‌కు మకిలి అంటించే డోపింగ్ అంశాన్ని కూడా చూపించారు.
ఫీల్డ్ బయట పవర్ ప్లే
రెండో సీజన్‌లో ఫీల్డ్‌లో ఆటతోపాటు బయట ఆ ఆటపై పట్టు కోసం సాగే పవర్ ప్లేను అద్భుతంగా చూపించారు. యశ్‌వర్ధన్, జరీనాల చేతిలో దెబ్బతిని కొంత కాలం లీగ్‌కు దూరంగా ఉన్న విక్రాంత్ ధవన్.. బెంగళూరు టీమ్ ఓనర్‌షిప్‌ను పరోక్షంగా దక్కించుకొని లీగ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో అసలైన పవర్ ప్లే మొదలవుతుంది.
బోర్డు అధ్యక్ష పదవి నుంచి యశ్‌వర్ధన్ పాటిల్‌ను తప్పించేందుకు విక్రాంత్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తాడు? దానికోసం బోర్డులో యశ్‌వర్ధన్ ప్రత్యర్థికి ఎలా సాయం చేస్తాడు? తన పదవిని కాపాడుకునేందుకు యశ్‌వర్ధన్ చేసే ప్రయత్నాలు ఏంటి? చివరికి క్రికెట్ బోర్డుకు కొత్త అధ్యక్షుడు వస్తాడా రాడా? అన్న అంశాలు రెండో సీజన్‌లో ఆసక్తి రేపుతాయి.
ఓవైపు ఈ పవర్ ప్లే.. మరోవైపు ముంబై టీమ్ ఓనర్లు జరీనా మాలిక్, మంత్రా పాటిల్ మధ్య నడిచే ఆధిపత్య పోరు.. ఇంకోవైపు కోచ్ మృతికి కారణమైన విక్రాంత్ ధవన్‌ను పట్టుకోవడానికి అరవింద్ వశిష్ట్ చేసే ప్రయత్నాలు.. అదే సమయంలో లీగ్ నుంచి ఫిక్సింగ్‌ను దూరం చేయడానికి వాయు రాఘవన్‌తో కలిసి అతడు ఎలాంటి ప్లాన్ వేశాడన్నది రెండో సీజన్‌లో చూడొచ్చు.
తొలి సీజన్‌కు ఏమాత్రం తగ్గకుండా రెండో సీజన్‌నూ తెరకెక్కించడంలో మేకర్స్ సక్సెసయ్యారనే చెప్పాలి.
ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ చూడొచ్చా?
కచ్చితంగా చూడొచ్చు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులకు ఈ వెబ్ సిరీస్ బాగా నచ్చుతుంది. క్రికెట్ అంటే పెద్దగా ఇష్టపడని వాళ్లను కూడా ఈ కథనం కట్టి పడేస్తుంది. బింజ్ వాచింగ్ అలవాటు ఉన్న వాళ్లు వరుస పెట్టి అన్ని ఎపిసోడ్‌లు చూసేయొచ్చు.
అయినా ఒక ఎపిసోడ్ ఎండింగ్ చూసిన తర్వాత ఆ తర్వాతి ఎపిసోడ్‌ను వెంటనే చూడాలనిపించేలా ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. తొలి సీజన్ తొలి ఎపిసోడ్ నుంచి రెండో సీజన్ చివరి ఎపిసోడ్ వరకూ ప్రతి ఎపిసోడ్‌లోనూ ఓ థ్రిల్లింగ్ క్రికెట్ మ్యాచ్‌ను చూసిన అనుభూతి కలుగుతుంది.
కరణ్ అన్షుమన్ సృష్టించిన ఈ ఇన్‌సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్‌కు అతనితోపాటు గుర్మీత్‌సింగ్, ఆకాశ్ భాటియా దర్శకత్వం వహించారు. ప్రతి ఎపిసోడ్‌కు క్రికెట్‌తో సంబంధం ఉన్న పదాలు అంటే… పవర్ ప్లే1, మ్యాగ్జిమమ్, రనప్, హాక్‌ఐ, ప్యాడిల్ స్వీప్, టర్న్, యొయొ, స్విచ్ హిట్, ఫ్లోర్ స్లిప్స్ అండ్ ఎ గల్లీ, క్రాసింగ్ ద లైన్‌లాంటి టైటిల్స్‌తో క్రికెట్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఎవరెలా చేశారు?
ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ చూస్తే ఇందులోని ప్రధాన క్యారెక్టర్లు పోషించిన అందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు యశ్‌వర్ధన్ పాటిల్ పాత్రలో అమీర్ బషీర్, విక్రాంత్ ధవన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్, జరీనా మాలిక్ పాత్రలో రిచా చద్దా, అరవింద్ వశిష్ట్ పాత్రలో అంగద్ బేడీ, వాయు రాఘవన్ పాత్రలో తనుజ్ వీర్వానీ, ప్రశాంత్ కనూజియా పాత్రలో సిద్ధాంత్ చతుర్వేది జీవించేశారు.
క్రికెట్, బాలీవుడ్, రాజకీయాలు, వివాదాలు.. ఇలా ఇండియన్స్‌కు ఇష్టమైన అన్ని అంశాలూ ఈ ఇన్‌సైడ్ ఎడ్జ్‌లో ఉన్నాయి. దీంతో సహజంగానే అభిమానులకు ఈ వెబ్ సిరీస్ తెగ నచ్చేసింది.
సినిమా, టీవీ, వెబ్‌సిరీస్‌ల రేటింగ్‌లను చాలా మంది ప్రామాణికంగా భావించే ఐఎమ్‌డీబీలో ఈ ఇన్‌సైడ్ ఎడ్జ్‌కు అభిమానులు మంచి రేటింగ్ (8.1)ను ఇచ్చారు. ఇప్పటి వరకు మీరు ఈ వెబ్ సిరీస్ చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి. తొలి సీజన్ నుంచి మొదలు పెడితేనే మీరు స్టోరీతో కనెక్ట్ అవుతారు.
ఇవి కూడా మీకు నచ్చుతాయి