Home న్యూస్ Israeli Palestinian conflict: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం.. అసలు వివాదం నేపథ్యం ఇదీ…

Israeli Palestinian conflict: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం.. అసలు వివాదం నేపథ్యం ఇదీ…

Israeli Palestinian conflict: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం, వివాదం ఇప్పటిది కాదు. ఇది ఒక భూభాగం కోసం యూదులు – అరబ్బులకు మధ్య శతాబ్ద కాలంగా జరుగుతున్న ఘర్షణ. నిజానికి వీరిద్దరూ.. ప్రాచీన సెమెటిక్ జాతికి చెందిన దాయాదులే. ఒకరికిది ‘పవిత్రభూమి’. మరొకరికిది ‘మాతృభూమి’.

వేల ఏళ్ల కిందట ఈ భూమిలోనే తాము పుట్టామని.. దీనిని తమ దేవుడు తమకు రాసిచ్చాడని యూదుల విశ్వాసం. చరిత్రలో చెల్లాచెదురైన తామంతా తిరిగి తమ ‘జన్మభూమి’కి వచ్చి నివసించే హక్కు తమకుందని వారి వాదన.

వేల ఏళ్లుగా అదే భూమిలో నివసిస్తున్న వారు అరబ్బులు. చినుకుల్లా మొదలై ఉప్పెనలా ముంచెత్తిన యూదులు తమను బలప్రయోగంతో వెళ్లగొట్టి తమ ‘మాతృభూమి’ని ఆక్రమించుకుంటున్నారని వీరి ఆవేదన.

రెండు వేల ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో యుద్ధాలు, దాడుల నుంచి పారిపోయి.. వెళ్లిన చోట కూడా వివక్షకు, అణచివేతకు, దారుణ మారణహోమాలకు గురైన వారు యూదులు.

అదే యూదులు విరుచుకుపడటంతో.. ఇళ్లూ ఊళ్లూ పొలమూ పుట్రా వదిలి.. ప్రాణాలు దక్కించుకోవటానికి పారిపోయి పొరుగు దేశాల్లో శరణార్థులుగా బతుకీడుస్తున్న వారు అరబ్బులు.

ఒకరు పీడకల లాంటి గతం నుంచి బయటపడి.. ‘పవిత్రభూమి’కి చేరుకున్నారు. దానిని కాపాడుకోవటం, బలోపేతం చేసుకోవటం వారి ఆరాటం. వీరికి సంపన్న దేశాల అండ.

మరొకరి వర్తమానం నిలువ నీడ లేని పీడకలగా మారిపోయింది. మళ్లీ గౌరవంగా బతకటానికి ‘మాతృభూమి’ని తిరిగి పొందటం వీరి పోరాటం. అందులో సొంత ప్రాణాలే పణం.

ఇజ్రాయిల్ – పాలస్తీనా మధ్య ఘర్షణ వందేళ్లుగా యూదులు – అరబ్బుల మధ్య జరుగుతున్న హింసాత్మక సంఘర్షణ.

రెండు వేల ఏళ్ల కిందట చరిత్ర…

చరిత్రను చూస్తే.. దాదాపు మూడు, నాలుగు వేల ఏళ్ల కిందట పశ్చిమాసియాలో సంచార జాతులు స్థిరావాసాల్లో స్థిరపడటం మొదలైంది.

ఇప్పటికి రెండు వేల ఏళ్ల కిందటి కాలంలో అరబ్బులకు ఒక మతం లేదు. ఎంతో మంది దేవుళ్లను కొలిచేవారు. యూదులకు మాత్రం అప్పటికే జుడాయిజం అనే మతం బలంగా వేళ్లూనుకుంది. యెహోవా వారి ఏకైక దేవుడు. పవిత్ర గ్రంథం పేరు తోరా. జెరూసలేం వారి పవిత్ర కేంద్రం. అక్కడే వారి పవిత్ర దేవాలయం ఉంది. అప్పుడు ఈ ప్రాంతాన్ని జుడాయియా అనే వారు.

ఈ యూదుల్లో పుట్టిన జీసస్‌ క్రైస్ట్‌ను.. ఆనాడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోమ్ సామ్రాజ్య పాలకులు శిలువ వేసి చంపారు. అందుకు నాటి యూదు మతం – జుడాయిజం పెద్దల ఫిర్యాదులూ కారణమని కొందరు భావిస్తారు.

క్రైస్తవం విస్తరణ, యూదుల పలాయనం..

జీసస్ మరణానంతరం క్రైస్తవం వృద్ధి చెందింది. వారి పవిత్ర నగరం కూడా జెరూసలేం అయింది. క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్‌లో ప్రధమ భాగం.. యూదుల పవిత్ర గ్రంధమైన తోరాయే. వారి దేవుడు కూడా యెహోవానే. జీసస్‌ను.. తమను రక్షించటానికి వచ్చిన దేవుడి కుమారుడిగా కొలుస్తారు.

అయితే.. జుడాయిజంలోని కఠిన సంప్రదాయాలను క్రైస్తవం తిరస్కరించింది. క్రైస్తవాన్ని సంప్రదాయవాద యూదులు తిరస్కరించారు. జీసస్‌ను బూటకపు ప్రవక్తగానే పరిగణించారు. తమ పవిత్ర గ్రంథం వస్తాడని చెప్తున్న తమ రక్షకుడు ఇంకా రావాల్సి ఉందనే నమ్ముతారు.

క్రైస్తవం.. అనతి కాలంలోనే పాలక రోమన్ సామ్రాజ్య మతంగా ఎదిగింది. ఆ సామ్రాజ్యంలో పాలితులుగా ఉన్న యూదులు తమ మత, సంప్రదాయాలను కాపాడుకోవటానికి కట్టుబడ్డారు. ఈ క్రమంలో సంఘర్షణలు జరిగాయి. రోమన్ పాలకులు.. జెరూసలేం లోని యూదుల పవిత్ర దేవాలయాన్ని రెండు సార్లు ధ్వంసం చేశారు.

రెండోసారి 135వ సంవత్సరంలో తిరుగుబాటులో పాల్గొన్న యూదులపై రోమన్ పాలకులు విరుచుకుపడ్డారు. అప్పుడు యూదులు చెల్లాచెదురైపోయారు. అత్యధికులు యూరప్ వలస పోయారు. వివిధ దేశాల్లో పట్టణ ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

రోమన్ సామ్రాజ్య విస్తరణతో క్రైస్తవం కూడా యూరప్ అంతటా విస్తరించింది. ఆ సామ్రాజ్యం పతనమైనా క్రైస్తవం కొనసాగింది. యూరప్‌లోని వివిధ దేశాల్లో స్థిరపడ్డ యూదులు కొందరు అక్కడి ప్రాంతాల్లో మతం, సంస్కృతీ సంప్రదాయాల్లో కలిసిపోయారు. కానీ చాలా మంది యూదులు తమ మత సంస్కృతులకే కట్టుబడి ఉన్నారు.

జుడాయియాను రోమన్ చరిత్రకారులు.. పిలిస్తైన్లు నివసించే ప్రాంతం కనుక.. పాలస్తీనా అని వ్యవహరించేవారు. అలా ఈ ప్రాంతానికి పాలస్తీనా అనే పేరు అనంతర కాలంలో స్థిరపడింది. ఈ ప్రాంతం మీద అనేక రాజ్యాలు దండెత్తాయి. పలు సామ్రాజ్యాలు పాలించాయి. అనేక జాతులు ఇక్కడి జన స్రవంతిలో సమ్మిళితమయ్యాయి.

ఇస్లాం పుట్టుక, సామ్రాజ్య వ్యాప్తి..

మరోవైపు.. ఏడో శతాబ్దంలో అరబ్ ప్రాంతంలో మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించారు. ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ తొలి భాగం కూడా యూదుల పవిత్ర గ్రంథమైన తోరాయే. వీరి దేవుడూ యెహోవానే. జీసస్‌ను వీరు కూడా ఒక ప్రవక్తగా పరిగణిస్తారు. మహమ్మద్‌ను చివరి ప్రవక్తగా నమ్ముతారు.

అరబ్ ప్రాంతంలో ఇస్లాం విస్తరించింది. అనేకానేక దేవుళ్లను పూజించే అరబ్బులు చాలా మంది ఇస్లాం స్వీకరించి ముస్లింలయ్యారు. వారికి కూడా జెరూసలేం పవిత్రనగరంగా మారింది.

అంటే.. అప్పటికి ఈ ప్రాంతంలో వలస వెళ్లిపోగా మిగిలిన యూదులు కొందరున్నారు. కొందరు అరబ్బులు క్రైస్తవులుగా మారారు. అత్యధిక అరబ్బులు ఇస్లాం స్వీకరించి ముస్లింలయ్యారు. ఈ ప్రాంతం ఇస్లాం రాజ్యాల పాలనలోకి వచ్చింది.
అయితే.. రాజ్యంలో సర్వోన్నత స్థానం గల మతం.. మధ్యయుగాల్లో తన హోదాను కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి.

జీవన పరిస్థితులు దిగజారుతుండటంతో ప్రజల్లో అసంతృప్తులు చెలరేగాయి. ఆ క్రమంలో తన పట్టును నిలుపుకోవటానికి మతాలకు శత్రువులు అవసరమయ్యారు. పదో శతాబ్దంలో రోమన్ క్రైస్తవం.. క్రూసేడులకు పిలుపునిచ్చింది. జెరూసలేంలోని తమ పవిత్ర కేంద్రాన్ని హస్తగతం చేసుకోవటానికి లక్షలాది మంది క్రైస్తవులు ఆయుధాలు ధరించి కాలినడకన బయలుదేరారు. జెరూసలేంను స్వాధీనం చేసుకుని దీనిని దాదాపు వందేళ్లు పాలించారు.

అనంతర యుద్ధాల్లో ఈ ప్రాంతం మళ్లీ చేతులు మారింది. అలా పదహారో శతాబ్దం నాటికి ఇది ఆటమన్ సామ్రాజ్యం కిందకు వచ్చింది. అంటే ఇప్పటి టర్కీ అని చెప్పొచ్చు. 1919 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ వారి పాలనలో ఉంది.

యూరప్‌లో యూదుల అణచివేత, పాలస్తీనాకు వలస…

ఇదిలావుంటే.. యూరప్‌కు వలస వెళ్లిన యూదులు చాలా మంది ఆయా దేశాల్లో ఉంటూనే వందల ఏళ్లుగా తమ ప్రత్యేక మత సంస్కృతులను కొనసాగిస్తూ వచ్చారు. మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు.. వ్యాపారానుభవం గల యూదులకు కలసివచ్చాయి. కొందరు ఆర్థికంగా బలపడ్డారు. అయితే అధిక సంఖ్యాకులైన స్థానికులు చాలా మంది వెనుకబడిపోయారు. ఆ పైన మతపరమైన తేడాలూ ఉన్నాయి.

యూదుల వల్లే జీసస్‌ను శిలువ వేసి చంపారనే ప్రచారమూ ఊపందుకుంది. ఇవన్నీ కలిసి యూదుల పట్ల వివక్ష, వారిపై అణచివేత ధోరణులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. క్రూసేడుల సమయంలో కొన్ని చోట్ల యూదుల ఊచకోతలూ జరిగాయి. పద్దెనిమిదో శతాబ్దం చివర్లో యూదులపై అత్యాచారాలు పెరిగాయి. కొన్ని దేశాల నుంచి కొందరు యూదులను బహిష్కరించటం కూడా జరిగింది. అందులో ఇంగ్లండ్ కూడా ఉంది.

దీంతో చాలా మంది పశ్చిమ యూరప్ నుంచి తూర్పు యూరప్, రష్యా, అమెరికాలకు వలస వెళ్లారు. కొందరు తమ ‘పవిత్రభూమి’ అయిన పాలస్తీనాకు వచ్చారు. అలా ఆధునిక కాలంలో 1882లో పాలస్తీనాకు యూదుల వలస మొదలైంది. అప్పటికి ఈ ప్రాంతం ఆటమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది.

ఈ పరిస్థితుల్లో తమ ‘పవిత్రభూమి’ అయిన పాలస్తీనాకు వెళ్లే హక్కు యూదులకు ఉందని.. అది వారి ధర్మమని చెప్పే ‘జియోనిజం’ సిద్ధాంతం రూపొందింది. యూదులు పాలస్తీనాకు వెళ్లి అక్కడి ప్రజలతో ఉమ్మడిగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవటం తమ లక్ష్యంగా ఆరంభంలో ఈ సిద్ధాంతకర్తలు చెప్పిన మాట.

అలా పాలస్తీనాకు వలస వస్తున్న యూదులకు అక్కడి అరబ్బు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఎందుకంటే.. అంతగా అభివృద్ధి చెందని ఈ ప్రాంతానికి యూదులు పెట్టుబడులతో, సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చారు. యూరప్ ఆధునిక భావజాలాన్నీ వెంట తీసుకొచ్చారు. వారు ముందుగా పాలస్తీనాలో భూములను కొనడం మొదలుపెట్టారు. వీరికి యూరప్ దేశాల్లోని సంపన్న యూదులు నిధులు సమకూర్చేవారు.

బ్రిటిష్ సామ్రాజ్య పాలనలోకి…

బ్రిటన్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ తదితర మిత్ర రాజ్యాల కూటమికి.. జర్మనీ, హంగరీ, ఆటమన్ సామ్రాజ్యాలతో కూడిన అక్ష రాజ్యాల కూటమికి.. మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాలు గెలిచాయి. అక్ష రాజ్యాలు ఓడాయి. ఓడిన దేశాల భూభాగాలను – గెలిచిన దేశాలు నానాజాతి సమితి మాండేట్ పేరుతో పంచుకున్నాయి. ఆటమన్ సామ్రాజ్యాన్ని.. బ్రిటన్, ఫ్రాన్స్‌లు వాటాలు వేసుకున్నాయి. పాలస్తీనా ప్రాంతం బ్రిటిష్ వలస పాలనలోకి వచ్చింది.

అప్పటికే బ్రిటన్‌లో ఆర్థికంగా బలపడ్డ యూదులు కొందరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలిగే శక్తిని సంతరించుకున్నారు. దాని ఫలితంగా వెలువడింది బాల్ఫోర్ ప్రకటన.

పాలస్తీనా మీద తనకు మాండేట్ దక్కిన తర్వాత.. అక్కడ యూదులకు ఆవాస స్థలం ఏర్పాటు చేయటానికి సుముఖంగా ఉన్నామని బ్రిటన్ ప్రకటించింది. అయితే అక్కడ యూదుల రాజ్యం స్థాపించాల్సిన అవసరం లేదని చెప్పింది. దీనిపట్ల యూదుల నుంచే కాదు అమెరికా నుంచీ వ్యతిరేకత వ్యక్తమైంది.

మరోవైపు.. బ్రిటన్ వలస పాలనలో ఉన్న పాలస్తీనాలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేయాలని స్థానికుల నుంచి డిమాండ్లు కూడా బలపడుతున్నాయి. ఇక జెరూసలేం లోని పవిత్ర స్థలం గురించి యూదులకు, ముస్లిం అరబ్బులకు గొడవలు మొదలయ్యాయి.

ఇంకోవైపు.. 1933 తర్వాత యూరప్‌లో నాజీయిజం, ఫాసిజం బలపడ్డాయి. ముఖ్యంగా జర్మనీ, పోలండ్ తదితర దేశాల్లో యూదు వ్యతిరేకత భయంకరంగా పెరిగిపోయింది. హిట్లర్ పాలనలో యూదు జాతిహననం జరిగింది.

అప్పటికి యూరప్‌లో 95 లక్షల మంది యూదులు ఉండగా.. 57.5 లక్షల మందిని హతమార్చారు. ఇది మానవాళి చరిత్రలోనే మహావిషాదం. ఈ పరిస్థితుల్లో యూరప్ నుంచి పాలస్తీనాకు యూదుల వలస పెరిగింది. ఇక్కడ ఘర్షణలు కూడా పెరిగాయి. యూదులు సొంత మిలీషియాలను ఏర్పాటు చేసుకోవటం మొదలైంది.

అదే సమయంలో పాలస్తీనా చుట్టూ ఉన్న పలు అరబ్ దేశాలు స్వతంత్రమయ్యాయి. 1932లో ఇరాక్, 1936లో జోర్డాన్, సిరియా, ఈజిప్టులు స్వతంత్ర దేశాలయ్యాయి. ఇక.. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు ఒక దేశం, అరబ్బులకు మరొక దేశం ఏర్పాటు చేయాలని బ్రిటన్ 1937లో ప్రతిపాదించింది. దానికి అరబ్బు దేశాలు వ్యతిరేకించాయి.

పాలస్తీనాకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలని అరబ్బులు చేసిన తిరుగుబాటును బ్రిటన్ సైన్యం అణచివేసింది. ఈలోగా రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది.

ఈ యుద్ధంలో అరబ్ దేశాల మద్దతు కోసం బ్రిటన్ తన వైఖరిని మార్చుకుంది. పాలస్తీనాను రెండు ముక్కలు చేయాల్సిన అవసరం లేదని.. అరబ్బులూ, యూదులూ కలిసి మెలిసి జీవించాలని సూచించింది. కానీ ఇద్దరం కలిసి ఒకే దేశంగా ఉండటం సాధ్యం కాదని ఇరువురూ తిరస్కరించారు.

అయితే.. అరబ్ దేశాల కోరిక మేరకు పాలస్తీనాకు యూదుల వలస మీద బ్రిటన్ ఆంక్షలు పెట్టింది. అయినా.. యూరప్‌లో మారణహోమాన్ని తప్పించుకుని వస్తున్న యూదులు పాలస్తీనా చేరుకుంటూనే ఉన్నారు.

పాలస్తీనాలో 1919లో లక్ష మంది కూడా లేని యూదు జనాభా.. యుద్ధం ముగిసే సరికి ఆరు లక్షలకు పెరిగింది. అరబ్బుల జనాభా కూడా నాలుగున్నర లక్షల నుంచి పది లక్షలకు పెరిగింది.

1919లో పాలస్తీనా జనాభాలో యూదులు పది శాతం కన్నా తక్కువే ఉండేవారు. 1945 నాటికి వారి జనాభా 35 శాతానికి పెరిగింది.

ఇజ్రాయెల్ ఏర్పాటు ప్రకటన.. యుద్ధాలు…

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత.. యుద్ధంలో గెలిచినా తీవ్రంగా దెబ్బతిన్న బ్రిటన్ తానిక పాలస్తీనా మాండేట్ కొనసాగించలేనని చెప్పి ఆ ప్రాంతాన్ని 1947లో ఐక్యరాజ్యసమితికి అప్పగించింది.

ఒకవైపు యూదు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటూ బ్రిటన్‌లో ప్రభుత్వం మీద యూదు సంపన్నుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి.. మరోవైపు పాలస్తీనాను చీల్చవద్దంటూ అరబ్ దేశాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత.. ఇందుకు ప్రధాన కారణాలు.

ఇక పాలస్తీనాలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. దీంతో పాలస్తీనాను.. అప్పుడే కొత్తగా ఏర్పాటైన ఐరాసకు అప్పగించి చేతులు దులుపుకుంది.

పాలస్తీనాలో ఒక యూదుల రాజ్యం, ఒక అరబ్బుల రాజ్యం ఏర్పాటు చేయాలని ఐరాస నిర్ణయించింది. దీనికి యూదులు అంగీకరించారు. కానీ తమ దేశాన్ని చీల్చడాన్ని అరబ్బులు వ్యతిరేకించారు. 1948 మే 15వ తేదీన పాలస్తీనా నుంచి బ్రిటన్ నిష్క్రమించింది. అదే రోజు ఇజ్రాయెల్ దేశం ఏర్పాటైనట్లు యూదులు ప్రకటించుకున్నారు. దీనిని ముస్లిం మత పెద్దల సారథ్యంలోని పాలస్తీనా అరబ్బులు వ్యతిరేకించారు. ఇరు వర్గాల మధ్య దాడులు, హింస చెలరేగింది. ఎంతో మంది పౌరులు చనిపోయారు. ఒక గ్రామంలో 100 మంది అరబ్బులను యూదు మిలీషియా చంపితే.. ఒక యూదు మెడికల్ కాన్వాయ్‌లో 77 మందిని పాలస్తీనా అరబ్బులు చంపేశారు. ఇటువంటి మారణకాండలు చోటు చేసుకున్నాయి.

అయితే.. అప్పటికే ప్రపంచ యుద్ధాల్లో మిత్ర రాజ్యాల సైన్యాల్లో పనిచేసి రాటుదేలిన యూదు సైనిక జనరళ్లు స్వయంగా యూదుల తరఫున రంగంలోకి దిగారు. ఏమాత్రం యుద్ధ అనుభవం లేని అరబ్బులను తేలికగా ఓడించారు.

యూదు మిలీషియా చొచ్చుకొస్తుండగా అరబ్బులు చాలా మంది ఇళ్లు వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దక్కించుకోవటానికి పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టులకు పారిపోయారు. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం బలవంతంగా తరిమికొట్టింది.

ఇజ్రాయెల్ దేశ ప్రకటనను ఐరాస, అమెరికా, రష్యా తదితర చాలా దేశాలు వెంటనే గుర్తించాయి. దీంతో ప్రపంచంలో ఇజ్రాయెల్ అధికారికంగా ఒక దేశంగా గుర్తింపు పొందింది. అయితే.. దీనిని వ్యతిరేకించిన చుట్టుపక్కల అరబ్ దేశాలు ఈజిప్టు, ఇరాక్, లెబనాన్, సిరియా, ట్రాన్స్‌జోర్డాన్‌లు అరబ్ లీగ్‌గా ఏర్పడి.. పాలస్తీనా అరబ్బులకు సాయంగా ఇజ్రాయెల్ మీద యుద్ధానికి దిగాయి.

కొత్తగా ఏర్పడిన ఇజ్రాయెల్ సైనిక బలం.. ఈ అరబ్ దేశాల సైనిక బలంతో పోలిస్తే ఏ మూలకూ రాదు. కానీ.. ఈ దేశాల మధ్య ఐక్యత లేదు. వీటి సైన్యానికి శిక్షణ లేదు. ఈ ప్రాంతం మీద పైచేయి సాధించటమే ఆయా దేశాల ఉద్దేశం కానీ.. పాలస్తీనా అరబ్బులకు సాయం చేసే ఉద్దేశం కనిపించలేదని కొందరు చరిత్రకారులు చెప్తారు.

ఇజ్రాయెల్‌కు రష్యా ఆయుధ సాయాన్ని అందించింది. ఇజ్రాయెల్ సైన్యం చిన్నదే అయినా.. అరబ్ దేశాల సైన్యం టెల్ అవీవ్ వద్దకు రాకుండా నిలువరించింది. యుద్ధం మధ్యలో కాస్త ఆగినా.. దాదాపు రెండేళ్ల పాటు సాగింది. జెరూసలేం నగరంలోని కొంత భాగంతో పాటు వెస్ట్ బ్యాంక్‌ను జోర్డాన్ ఆక్రమించింది.

గాజాను ఈజిప్టు ఆక్రమించింది. గోలన్ హైట్స్‌ను సిరియా ఆక్రమించింది.

ఈ యుద్ధంలో మొత్తం 16,000 మంది చనిపోగా.. అందులో ఇజ్రాయెల్ సైనికులు ఆరు వేల మంది వరకూ ఉన్నారు. ఐరాస జోక్యంతో మధ్యవర్తిగా శాంతి యత్నాలు చేసిన స్వీడన్ రాయబారి సెప్టెంబర్‌లో హత్యకు గురయ్యాడు.

ఆ తర్వాతి ఏడాది.. 1948 సెప్టెంబరులో కాల్పుల విరమణ కుదిరింది. అప్పటికి.. తొలి విభజన ప్రణాళిక కన్నా ఐదో వంతు భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. విభజన ప్రణాళిక ప్రకారం హద్దులకు ఉపసంహరించుకోవాలన్న సూచనను తిరస్కరించింది.

అంటే.. విభజన ప్రణాళికలో ఇంకా పుట్టని పాలస్తీనా దేశం కోసం కేటాయించిన భూభాగంలో కూడా ఐదో వంతు ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్లింది.

పాలస్తీనా కోసం కేటాయించిన ప్రధాన ప్రాంతమైన వెస్ట్ బ్యాంక్.. జోర్డన్ ఆక్రమణలో ఉంది.
అప్పటికి ఆరు లక్షల మందికి పైగా పాలస్తీనా అరబ్బులు దేశం నుంచి పారిపోయారు. గాజాలో, వెస్ట్ బ్యాంక్‌లో, సిరియాలో, లెబనాన్‌లో ఐరాస ఏర్పాటు చేసిన శిబిరాల్లో శరణార్థులయ్యారు. వారు కొత్తగా ఏర్పాటైన ఇజ్రాయెల్ లోని తమ ఇళ్లకు తిరిగి రావటానికి ఇజ్రాయెల్ అంగీకరించలేదు. డెబ్బై ఏళ్లకు పైగా ఆ శిబిరాల్లో శరణార్థులుగానే బతుకుతున్నారు.

మరోవైపు.. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించుకున్నపుడు సుమారు లక్షన్నర మంది పాలస్తీనా అరబ్బులు అక్కడే ఉండిపోయారు. వీరిలో అత్యధికులు పశ్చిమ గెలీలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు. అనంతర కాలంలో వీరి భూములను స్వాధీనం చేసుకోవటంతో అత్యధికులు కూలీలుగా మారిపోయారు.

ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా గుర్తించటానికి అరబ్ దేశాలు నిరాకరించాయి. ఇజ్రాయెల్‌తో తమకు యుద్ధ పరిస్థితి కొనసాగుతూనే ఉందని అరబ్ దేశాలు 1949లో ప్రకటించాయి. దానిని ఆర్థికంగా, రాజకీయంగా బహిష్కరించాయి.

ఆ తరువాత 1956లో, 1967లో, 1973లో, 1982లో ఇజ్రాయెల్‌కు అరబ్ దేశాలకు మధ్య యుద్ధాలు జరిగాయి.
1956లో సూయిజ్ కెనాల్‌ను జోర్డాన్ జాతీయం చేయటంతో.. ఇజ్రాయెల్, ఫ్రాన్స్, బ్రిటిష్ సైన్యాలు జోర్డాన్ మీద దాడి చేసి ఆ కెనాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. కానీ అంతర్జాతీయ ఒత్తిడితో ఉపసంహరించుకున్నాయి.

ఫిదాయీ దాడులు, ప్రతి దాడులు…

1950వ దశకంలో జోర్డన్, ఈజిప్టుల్లోని పాలస్తీనా శరణార్థులు ఇజ్రాయెల్ మీద ఫిదాయీ దాడులు ప్రారంభించారు. ఈ దేశాల్లోని శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ ప్రతి దాడులు మొదలుపెట్టింది.

మరోవైపు.. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే.. 1959లో అది రద్దయింది. గాజా స్ట్రిప్ ఈజిప్టు మిలటరీ పాలనలోకి వెళ్లింది.

1964లో యాసర్ అరాఫత్ పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ)ను నెలకొల్పారు. దీనికి అరబ్ లీగ్ దేశాలు గుర్తింపునిచ్చాయి.
1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో జోర్డన్ నుంచి వెస్ట్ బ్యాంక్‌ను, ఈజిప్టు నుంచి గాజాను, సిరియా నుంచి గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది.

దీంతో పీఎల్ఓ ప్రధాన కార్యాలయం జోర్డాన్‌లో ఏర్పాటైంది. అక్కడి పాలస్తీనా అరబ్బులకు జోర్డాన్ తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చింది. కానీ స్థానికులకు, పాలస్తీనీయులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.

1970లో జోర్డాన్ – పాలస్తీనీయులకు మధ్య జరిగిన అంతర్యుద్ధంలో పీఎల్ఓ ఓడిపోయింది. పీఎల్ఓ మిలిటెంట్లు లెబనాన్‌కు మకాం మార్చారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం, విమానాల హైజాకింగ్ కార్యకలాపాలు నిర్వహించేవారు. దీనికి ఇజ్రాయెల్ ఎదురు దాడులు చేసేది.

మరోవైపు 1979లో జోర్డాన్ ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు చేసుకుంది. 1982లో లెబనాన్ మీద దాడి చేసిన ఇజ్రాయెల్ పాలస్తీనా మిలీషియాలను ఓడించింది. పీఎల్ఓ ప్రధాన కార్యాలయాన్ని ట్యునీసియాకు మార్చారు.

శాంతి, సంఘర్షణల మధ్య ఊగిసలాట…

అంతర్జాతీయ కృషితో 1993లో ఇజ్రాయెల్ – పాలస్తీనా శాంతి ప్రక్రియలో భాగంగా ఓస్లో ఒప్పందాలు కుదిరాయి. దీంతో.. పీఎల్ఓ ట్యునీసియా నుంచి వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌కు వచ్చి పాలస్తీనా నేషనల్ అథారిటీని ఏర్పాటు చేయగలిగింది.

అయితే.. ఈ శాంతి ప్రక్రియను.. పాలస్తీనా సమాజంలో అతివాద ఇస్లామిక్ బృందాలైన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ వంటివి వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ మీద దాడులు మొదలుపెట్టాయి.

మరోవైపు.. ఈ శాంతి ప్రక్రియను ఇజ్రాయెల్‌లోనూ అతివాద బృందాలు వ్యతిరేకించాయి. దీనిపై సంతకాలు చేసిన ప్రధానమంత్రి ఇష్హక్ రాబిన్‌ హత్య చేశారు. ఇది శాంతి ప్రక్రియను దెబ్బతీసింది. ఆ తర్వాత 1996లో ఎన్నికైన కొత్త ప్రభుత్వం ఈ శాంతి ప్రక్రియ నుంచి వైదొలగింది.

శాంతి ప్రక్రియ ఖరారుపై జరిగిన చర్చలు విఫలమవటంతో 2000 సెప్టెంబర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఇజ్రాయెలీ నగరాల్లో పాలస్తీనా మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడటం పెరిగింది.

2005లో గాజా నుంచి ఇజ్రాయెలీ సెటిలర్లు, సైనికులను ఉపసంహరించాలని నాటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏరియల్ షరాన్ ఆదేశించారు.

అయితే.. గాజా స్ట్రిప్ గగనతలం, ప్రాదేశిక జలాలు ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉన్నాయి. గాజా నుంచి ప్రజలు సరకుల కోసం వాయుమార్గంలో కానీ, జల మార్గంలో కానీ వచ్చి వెళ్లాలంటే ఇజ్రాయెల్ నియంత్రణలోనే జరగాలి.

పీఎల్ఓ నుంచి హమాస్ చేతికి అధికారం…

ఇక 2006 పాలస్తీనా పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ గెలిచింది. ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య గతంలో జరిగిన ఒప్పందాలను హమాస్ అంగీకరించాలని.. ఇజ్రాయెల్ మనుగడ హక్కును హమాస్ గుర్తించాలని, హింసను విడనాడాలని.. లేదంటే ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అందుకు హమాస్ తిరస్కరించింది.

2007లో గాజా స్ట్రిప్ సముద్ర మార్గాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. ఈజిప్టుతో చేసుకున్న సహకార ఒప్పందాల ఫలితంగా అటువైపు భూమార్గాన్నీ మూసేసింది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. మళ్లీ ప్రాణనష్టం సంభవించింది. హమాస్ నియంత్రణలోని గాజా నుంచి ఇజ్రాయెల్ మీదకు రాకెట్ల దాడి.. ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయటం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.

కొన్నిసార్లు శాంతియత్నాలు, మరికొన్నిసార్లు సాయుధ సంఘర్షణలు.. అపార ప్రాణనష్టం. ముఖ్యంగా పాలస్తీనా ప్రజల జీవితాలు కల్లోలం కావటం నిత్యకృత్యంగా మారిపోయాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.

ఇక.. సంపూర్ణ సార్వభౌమ దేశంగా ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం పాలస్తీనా అథారిటీ 2011లో చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే.. ఐరాసలో పాలస్తీనా ప్రాతినిధ్యాన్ని 2012 నవంబరులో.. సభ్యత్వంలేని పరిశీలక దేశం హోదాకు పెంచారు.

Exit mobile version