Home ఎంటర్‌టైన్‌మెంట్‌ జాతి రత్నాలు మూవీ ఎందుకు హిట్ అయ్యింది?

జాతి రత్నాలు మూవీ ఎందుకు హిట్ అయ్యింది?

jathi ratnalu

జాతి రత్నాలు .. పేరుకు తగ్గట్టుగానే తెలుగు సినిమాల్లో ఆణిముత్యంలా నిలిచి బంపర్ కలెక్షన్లు సాధిస్తోంది. లాక్‌డౌన్‌ ముందు షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను నిర్మాతలు ఓటీటీలకు అమ్ముకున్నారు. కానీ కొందరు మాత్రం తమ సినిమాపై నమ్మకం పెట్టుకొని వాటిని ఓటీటీలకు అమ్మలేదు. అలా ఓటీటీలకు అమ్మకుండా తమ చిత్రాన్ని థియేటర్లులో విడుదల చేసి మంచి లాభాలను ఆర్జించిన చిత్రమే జాతి రత్నాలు.

నవీన్‌ పోలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ఈ జాతి రత్నాలు. ఏ ముహుర్తాన ఈ పేరు పెట్టారో కానీ రత్నం లాగానే ప్రకాశిస్తూ మొదటి వారానికే రూ. 20 కోట్ల షేర్‌ మార్క్‌ను దాటినట్లు తెలుస్తుంది. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మంచి క్రేజ్‌తో ముందుకు సాగుతుంది.

మొదటి రోజు రూ. 3.94 కోట్లు, రెండవ రోజు రూ. 2.80 కోట్లు, మూడవ రోజు రూ. 4.28 కోట్లు, నాలుగవ రోజు రూ. 5.33 కోట్లు, ఐదవ రోజు రూ. 2.74 కోట్లు, ఆరవ రోజు రూ. 2.05 కోట్లు, 
ఏడవ రోజు రూ. 1.78 కోట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 23.09 కోట్ల కలెక్షన్లు సాధించింది. కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో కలిపి రూ. 1.18 కోట్లు వసూలు చేసింది జాతి రత్నాలు. ఓవర్సీస్‌లో రూ. 3.43 కోట్లు రాబట్టింది.

దీంతో మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.70 కోట్లతో పాటు రూ. 46 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతి రత్నాలు సినిమా రూ. 10.80 కోట్ల వరకూ థియేట్రికల్‌ బిజినెస్‌ జరుపుకుంది. పలు సినిమా రికార్డులను బద్దలు కొట్టి సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెట్టింది.

జాతి రత్నాలు టీజర్ నుంచి విడుదల వరకూ స్పెషలే

ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జాతి రత్నాల టీజర్‌ విడుదలయ్యే వరకు సినిమా గురించి ఎవరికి అంతగా తెలీదు. దాంట్లో ఉన్న కామెడీ సీన్లతో టీజర్‌ ప్రేక్షకులను తన వైపు కట్టిపడేసిందనే చెప్పాలి. అలా ఒక మంచి అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కల్పించింది.

ముంబైలో మార్చి 4న హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. అప్పటికి ప్రజల్లో టీజర్‌పై ఉన్న మంచి అభిప్రాయం కాస్తే ట్రైలర్‌ బాగా క్లిక్‌ అవ్వటానికి కారణమైంది. ఇక ట్రైలర్‌ విషయానికొస్తే 2 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌లో తమ కామెడీ టైమింగ్‌తో నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ ఆకట్టుకున్నారు. ట్రైలర్‌లో నవ్వులు తెప్పించే సన్నివేశాలు సినిమాపై మరింత హోప్‌ పెంచాయి. 

ట్రైలర్‌ విడుదలైన తర్వాత నవీన్‌, ఫరీయా, అనుదీప్‌ ఇలా చిత్ర బృందం అంతా ప్రమోషన్స్‌ బాట పట్టారు. టీవీ నుంచి సోషల్‌ మీడియా వరకు ప్రతి దాంట్లో తమకు తెలిసిన రీతిలో సినిమా ప్రమోషన్స్‌ చేయటం మొదలు పెట్టారు. అదిరిపోయే రేంజ్‌లో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయడంతో జాతి రత్నాలు మూవీపై విడుదలకు ముందే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దాంతో విడుదలైన రెండు రోజుల వరకు సినిమా టికెట్లు దొరకలేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల హోస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌తో నడుస్తోంది. 

గెస్ట్‌ పాత్రల్లో కీర్తి సురేశ్, విజయ్‌ దేవరకొండ కనిపించారు. మొదటి సినిమాతోనే దర్శకుడు అనుదీప్ కేవీ మంచి పేరును సంపాదించారు. ఈ సినిమాతో దర్శకుడు నాగ అశ్విన్‌ నిర్మాతగా మారాడు. చిత్రానికి సంగీత దర్శకుడిగా రథన్‌… తన పాటలతో అందరిని ఆకట్టుకున్నాడనే చెప్పాలి. 

జాతి రత్నాలు కథ ఇదీ..

మెదక్‌ జిల్లా జోగిపేట శ్రీకాంత్‌ (నవీన్‌ పొలిశెటి) తన తండ్రి నడిపే లేడిస్‌ ఎంపోరియంలో అయిష్టంగా పని చేస్తుంటాడు. తన ఇద్దరు మిత్రులు రవి (రాహుల్‌ రామకృష్ణ), శేఖర్‌ (ప్రియదర్శి). బాధ్యత లేకుండా అల్లరిచిల్లరగా కాలం గుడుపుతుంటారు. లేడిస్‌ ఎంపోరియం నడపడం అవమానంగా భావిస్తూ ఉద్యోగం వెతుక్కొని హైదరాబాద్‌లో స్థిరపడాలనుకుంటాడు శ్రీకాంత్.

అలా హైదరాబాద్‌ వెళ్తున్న సమయంలోనే… తన ఇద్దరు స్నేహితులు రవి, శేఖర్ కూడా రావటంతో అందరూ కలిసి హైదరాబాద్‌ చేరుకుంటారు. ఆ తర్వాత చిట్టి (ఫరియా)తో ప్రేమలో పడతాడు. తరువాత ముగ్గురు స్నేహితుల జీవితంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి.

మంత్రి చాణక్యపై హత్నాయత్నం ఆరోపణలతో ముగ్గురు స్నేహితులను అరెస్ట్‌ చేస్తారు. అసలు మంత్రి చాణక్యపై హత్యాయత్నం ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఆ కేసు నుండి ముగ్గురు స్నేహితులు ఎలా తప్పించుకున్నారు? చిట్టి శ్రీకాంత్‌ను వదిలేసి పోతుందా? సహాయం చేస్తుందా? అనేది మనం సినిమాలో చూడాలి. జోగిపేటను వదిలి వచ్చిన మన జాతిరత్నాలు కేసు నుండి తప్పించుకుని చివరకు ఏం చేశారనేదే ఆసక్తికరంగా నిలిచే పాయింట్. 

ఆకట్టుకున్న నవీన్ పొలిశెట్టి నటన

నవీన్‌ పొలిశెట్టి మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది నవీన్‌కి తెలుగులో రెండవ సినిమా. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే విజయం సాధించిన విషయం తెలిసిందే. జాతి రత్నాలు సినిమా చూసిన వారందరు సినిమా ఆద్భుతంగా ఉందంటున్నారు.

ఇలాంటి కామెడీ చిత్రాన్ని ఈ మధ్య కాలంలో చూడలేదని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ కామెడీ టైమింగ్‌ బాగుందని.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వామని ప్రశంసలు కురిపిస్తున్నారు. యువ దర్శకుడు అనుదీప్‌ దర్శకత్వం బాగుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

కాగా సినిమా విడుదల అయిన రోజే చిత్రబృందానికి ఊహించని సంఘటన ఎదురైంది. విడుదలైన రోజే ఫైరసీ రావటం చిత్రబృందాన్ని నిరాశకు గురిచేసింది. కొన్ని ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు ఫైరసీని విడుదల చేయటంతో… కొత్త మేర సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ మంచి కలెక్షన్లే రాబట్టింది.

ఫ్యామిలీతో కలిసి అందరూ ఎంజాయ్‌ చేసే సినిమా. బాగా నవ్వుకోవాలనుకుంటున్నవారు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే.

– స్వాతి యాపాల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

ఇవీ మీకు నచ్చుతాయి..

సండేస్ ఇల్ నెస్ .. మూవీ రివ్యూ

ది గర్ల్ ఆన్ ది ట్రైన్ మూవీ రివ్యూ

Exit mobile version