Home ఎంటర్‌టైన్‌మెంట్‌ పెళ్లితో కలిసొస్తుందంటే.. మర్డర్ చేసి..

పెళ్లితో కలిసొస్తుందంటే.. మర్డర్ చేసి..

jeevajothi biopic
Image: Junglee Pictures

తనకి జరిగిన అన్యాయంపై 18 ఏళ్లు ఒంటరిగా పోరాడి గెలిచిన సాధారణ మహిళ. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి హోదాను, డబ్బును చూసి భయపడకుండా, అతడిని కటకటాల వెనక్కి నెట్టే వరకు ధైర్యంగా నిలబడిన ధీశాలి. అందుకే ఆమె పోరాటమే సినిమాగా త్వరలో రాబోతోంది. ఆమె పేరు జీవజ్యోతి. ఓ బడా వ్యాపారవేత్త దురాశకు 20 ఏళ్లకే భర్తను, జీవితాన్ని కోల్పోయిన మహిళ.

శరవణ హోటల్స్… దేశవిదేశాల్లో వెలిగిపోతున్న చైన్ హోటళ్ల సామ్రాజ్యం. దాన్ని స్థాపించింది రాజగోపాల్. దోశ కింగ్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించాడు.

తమిళనాడులోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన రాజగోపాల్‌కు చదువు కూడా లేదు. తండ్రి ఉల్లిపాయలమ్మి కుటుంబాన్ని పోషించేవాడు.

రాజగోపాల్ బతుకుదెరువు కోసం చెన్నై వచ్చి కిరాణ కొట్టు పెట్టుకున్నాడు. వ్యాపారంలో బాగా కలిసొచ్చి, శరవణ భవన్ పేరుతో 1981లో ఒక హోటల్ ప్రారంభించాడు. ఏ ముహూర్తాన పెట్టాడో కానీ ఆ ఒక్క హోటల్ కాస్త చైన్ గా మారి వంద హోటళ్లను దాటింది. ఒక మనదేశంలోనే కాదు దాదాపు 22 దేశాల్లో విస్తరించింది.

కోట్లకు పడగెత్తాడు రాజగోపాల్. ఇంతటి విజయం ఆయనకు ఆనందాన్ని ఇవ్వలేదు, అంతటి సంపద కూడా సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా ఇంకా కలిసి రావాలన్న అత్యాశ. ఆ అత్యాశ అతని చేత చేయకూడని పనులు చేయించింది. రెండు నిండు జీవితాలను నాశనం చేసేలా చేసింది.

కలిసి రావాలంటే మళ్లీ పెళ్లి చేసుకో..

రాజగోపాల్ కు పెద్దలు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. హోటల్స్ పెట్టాక జ్యోతిష్యాన్ని నమ్మడం ప్రారంభించాడు. ఓసారి జ్యోతిష్కుడు మీకు ఇంకా కలిసిరావాలంటే శరవణ భవన్లో పనిచేస్తున్న సీనియర్ మేనేజర్ కూతురిని రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. మేనేజర్‌ను ఎలాగోలా ఒప్పించి అతడి కూతురిని రెండో పెళ్లి చేసుకున్నాడు రాజగోపాల్. ఏళ్లు గడిచాయి. మరలా జ్యోతిష్కడు మూడో పెళ్లి చేసుకుంటే ఇంకా కలిసొస్తుందని చెప్పాడు. తన దగ్గరే పనిచేసే చిన్న మేనేజర్ రెండో కూతురు జీవజ్యోతి పేరును ప్రతిపాదించాడు జ్యోతిష్కుడు.

1999వ సంవత్సరం మూడో పెళ్లి ప్రతిపాదనను జీవజ్యోతి తల్లిదండ్రుల ముందు పెట్టాడు రాజగోపాల్. అప్పటికి అతడి వయసు యాభై ఏళ్ల పైనే. జీవజ్యోతికి 19 ఏళ్లు. అప్పటికే ఆమె ప్రేమలో పడింది. తన తమ్ముడికి ట్యూషన్ చెప్పడానికి వచ్చే టీచర్ ప్రిన్స్ శాంతకుమార్‌తో ప్రేమబంధంలో ఉంది. అయినా అంత వయసు తేడా ఉన్న వ్యక్తిని ఎలా చేసుకుంటానంటూ ఆ పెళ్లి ప్రతిపాదనను తోసిపుచ్చింది.

అప్పట్నించి జీవజ్యోతి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. రకరకాలుగా బెదిరింపులు వచ్చాయి. అంతేకాదు నగలు, డబ్బులు కూడా ఆశగా చూపించారు. చివరికి శాంతకుమార్‌ను కూడా చంపేస్తామని బెదిరించారు. ఏవీ ఆ ప్రేమ జంటను విడదీయలేకపోయాయి. రాజగోపాల్ బెదిరింపులు తట్టుకోలేక ప్రేమ జంట పారిపోయి పెళ్లి చేసుకుంది.

వారిద్దరినీ తీసుకొచ్చి రాజగోపాల్ మనుషులు తీవ్రంగా కొట్టి బెదిరించారు. దీంతో జీవజ్యోతి భర్తను తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు ఇచ్చింది. కానీ డబ్బుకు లొంగని వారెవరు. ఆ ఫిర్యాదు కాపీ రాజగోపాల్ చేతికి చిక్కింది. మళ్లీ ఆ జంటను కిరాయి గూండాలు ఎత్తుకొచ్చి రాజగోపాల్ ముందు పడేశారు. ఆ జంట అతడి కాళ్లపై పడి వదిలేయమని ప్రాధేయపడింది. అయినా జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మే ఆ మొరటు మనిషి కరగలేదు.

2001 అక్టోబర్ 26న శాంతకుమార్ డెడ్ బాడీ కొడైకెనాల్ అడవుల్లో దొరికింది. అతడిని చంపిందెరో జీవజ్యోతితో పాటూ శరవణభవన్ లో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు తెలుసు. భర్త లేడు కనుక ఆమెను పెళ్లి చేసుకోవడం సులువవుతుందనుకున్నాడు రాజగోపాల్. కానీ ఆమె అతనికి లొంగలేదు సరికదా హత్య కేసు పెట్టింది.

చంపుతామని బెదిరించినా..

చంపుతామని బెదిరింపులు వచ్చినా బెదరలేదు. ఆమెకు సాయం చేసేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. రాజగోపాల్ డబ్బులో, పరపతిలో పేరున్న వ్యక్తి. అతనితో ఢీ కొట్టే ధైర్యం చేయొద్దని చాలా మంది చెప్పారు. అయినా తనకు జరిగిన అన్యాయంపై పోరాడటానికే నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు అండగా నిలిచారు. కేసు మీడియాలో చర్చకు వచ్చింది.

జీవజ్యోతి అప్పటి ముఖ్యమంత్రి జయలలితను నేరుగా కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. సీఎం ఆదేశాలతో పోలీసు శాఖలో కదలిక వచ్చింది. అంతవరకు రాజగోపాల్‌కు అండగా నిలిచిన కొంతమంది పోలీసులు సీఎం ఆదేశాలతో అతడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించక తప్పలేదు. జీవజ్యోతి పోలీస్ కమిషనర్ ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది. సీఎం స్వయంగా కల్పించుకోవడంతో ఈ కేసు అంతుతేల్చేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. సాక్ష్యాలన్నీ రాజగోపాల్ కు వ్యతిరేకంగా లభించాయి.

శ్రీ పెరంబుదూర్ కోర్టు రాజగోపాల్‌తో పాటూ తొమ్మిది మందిని దోషులుగా తేల్చి రూ. 50 లక్షల జరిమానాతో పాటూ పదేళ్ల కఠిన కారగార శిక్ష విధించింది. రాజగోపాల్ అప్పీలుకు వెళ్లారు. జీవజ్యోతి కేసును వదల్లేదు. తిరిగి హైకోర్టులో కేసు విచారణకు వచ్చింది. అక్కడ కూడా రాజగోపాల్‌కు శిక్ష ఖరారైంది.

కాళ్లబేరానికి వచ్చినా..

రాజగోపాల్ చివరికి కాళ్లబేరానికి వచ్చాడు. జీవజ్యోతికి కోట్ల రూపాయలు ఇస్తానని కేసు ఉపసంహరించుకోమని వేడుకున్నాడు. జీవజ్యోతి లొంగలేదు. తన వయసు, ఆరోగ్య సమస్య రీత్యా శిక్ష తగ్గించమంటూ సుప్రీంకోర్టు కెళ్లాడు రాజగోపాల్. అక్కడా చుక్కెదురైంది. చివరికి సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు 71 ఏళ్ల వయసులో 2019, జులై 9న పోలీసులకు లొంగిపోయాడు. జులై 13, 2019న గుండె పోటు వచ్చింది. జులై 18న ఆసుపత్రిలోనే మరణించాడు.

అతడి మరణం కూడా జీవజ్యోతికి సంతృప్తినివ్వలేదు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండానే చనిపోయాడన్న బాధ ఆమెది. 20 ఏళ్లకే భర్తను కోల్పోయిన ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అతడినే తలచుకుని జీవిస్తోంది. ఈ కేసుల గొడవలోనే తండ్రి కాలం చేశారు. తల్లితో కలిసి తంజావూరులో ఉంటోంది.

బతుకుదెరువు కోసం టైలరింగ్ షాప్ పెట్టుకుంది. ఒక పక్క భుక్తి కోసం ఆ పని చేస్తూనే, మరో పక్క తన భర్తను చంపిన వ్యక్తికి శిక్ష పడేలా చేయడం కోసం కోర్టులు, పోలీసులు, అధికారుల చుట్టూ తిరిగింది. విచిత్రమేంటంటే ఇప్పుడు ఆమె కూడా హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది. చిన్న హోటల్ తంజావూరులో నడిపిస్తోంది. శాంతకుమార్, తానూ ఎంతో ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని, కానీ రాజగోపాల్ దురాశకు మా జీవితాలు బలయ్యాయని ఇప్పటికీ ఆవేదన చెందుతోంది.

జీవ జ్యోతి బయోపిక్..

జీవజ్యోతి  జీవితాన్ని సినిమాగా మలిచేందుకు జంగ్లీ పిక్చర్స్ చిత్ర నిర్మాణ సంస్థ సిద్ధమైంది. ఇందుకు నటీనటుల ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది. తన జీవితంలో జరిగిన అన్యాయాన్ని సినిమాగా తీసేందుకు ముందుకు రావడంపై జీవజ్యోతి ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఒక పెళ్లి, ఒక హత్య.. మరియు మసాలా దోశ పేరుతో ఇటీవలే జింగ్లీ పిక్చర్స్ సంస్థ ప్రమోషన్ ప్రారంభించింది.

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version