కిడ్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అంత సులువైన పని కాదు. వాళ్లకు ఇళ్లలో బుజ్జగించి తినిపించడమే చాలా కష్టమైన పని. ఇక స్కూల్‌లో లంచ్ అంటే చెప్పేదేముంది? కనీసం మూత కూడా తెరవని లంచ్ బాక్స్‌లు అలాగే ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఇది దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే సమస్యే. దీనిని ఎలా ఎదుర్కోవాలో చాలా మందికి అంతుబట్టదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పిల్లలు లంచ్ తినడం లేదన్నది తల్లిదండ్రుల తరుచూ చెప్పే మాట. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఆ సమస్యను అధిగమించవచ్చు. అసలు కిడ్స్ లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి? అందులో ఏవి ఉండాలి? ఏవి ఉండకూడదు? బాక్స్ ఎలా ఉండాలి? ఇలాంటి సమాచారంతో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న స్టోరీ ఇది.
వాళ్లకూ చాన్స్ ఇవ్వండి
పిల్లలను అడగాలేగానీ మనకు వంటింట్లో సాయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. అందులోనూ వాళ్లు తినబోయే ఫుడ్ అయితే ఎగిరి గంతేస్తారు. అందువల్ల వాళ్లు ఏం తినాలనుకుంటున్నారో ముందుగానే తెలుసుకొని, దాని తయారీలో వాళ్లను భాగం చేస్తే బాగుంటుంది. వాళ్లు కోరుకున్న, వాళ్లే తయారు చేసుకున్న ఫుడ్ తినడానికి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. లంచ్‌కి ఏం తీసుకెళ్లాలని అనుకుంటున్నారో ఓ రెండు, మూడు ఆప్షన్లు ఇవ్వండి. వాళ్లు సెలెక్ట్ చేసుకున్న ఫుడ్‌ని ప్రిపేర్ చేయడంతోపాటు దానిని లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేయడానికి కూడా వాళ్ల సాయం తీసుకోండి. ఇది ఒక రకంగా లంచ్ బ్రేక్ కోసం ఎదురు చూసేలా చేస్తుంది.
అన్నీ కలిసిపోకుండా చూడండి
మామూలుగా పిల్లల లంచ్‌లో రెండు, మూడు రకాల ఐటమ్స్ ఉండేలా చూసుకుంటాం. చాలా వరకు వాళ్లకు నచ్చిన ఐటమ్సే పెట్టడానికీ ప్రయత్నిస్తాం. అయినా కొంతమంది పిల్లలు ఆ బాక్స్‌ను అలాగే ఇంటికి పట్టుకొస్తారు. దీనికి ప్రధాన కారణం.. ఆ బాక్స్‌లో మీరు పెట్టిన ఐటమ్స్ అన్నీ కలిసిపోవడమే. బాక్స్‌లో ఉన్న అన్ని ఐటమ్స్ వాళ్లకు నచ్చినవే అయినా.. అవన్నీ ఒకదానితో మరొకటి కలవకుండా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అందువల్ల లంచ్ బాక్స్ కొనేటప్పుడే అందులో ఎక్కువ కంటేనర్స్ ఉండేలా చూసుకుంటే మంచిది.
డెకొరేట్ చేస్తున్నారా?
పిల్లలకు ఫుడ్‌పై ఆసక్తి కలిగించడానికి వాటిని అందంగా డెకొరేట్ చేయడం కూడా ముఖ్యమే. పెద్ద వాళ్లు ఆఫీస్‌లకు తీసుకెళ్లినట్లు రోజూ రొటీన్‌గా లంచ్ బాక్స్ ఉండటాన్ని వాళ్లు ఇష్టపడరు.
♦ లంచ్ బాక్సుల్లో పెట్టే క్యారెట్, టమాటా, కీర దోసలాంటి వెజిటబుల్స్‌ను వెరైటీ షేపుల్లో కట్ చేసి పెట్టండి. మార్కెట్‌లో ప్రత్యేకంగా షేప్ కటర్స్ దొరుకుతాయి.
♦ చెపాతీ, దోశ, పిజ్జాల్లాంటి ఐటమ్స్‌పై సాస్ లేదా ఇతర వెజిటబుల్ ముక్కలతో ఓ స్మైలీని తయారు చేసి పెట్టండి. ఇలాంటి పిల్లలను వెంటనే ఆకర్షిస్తాయి.
♦ సాధ్యమైనంత వరకు లంచ్ బాక్స్ కలర్‌ఫుల్‌గా ఉండేలా చూసుకోండి. వివిధ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలతో బాక్స్ లోపల డెకొరేట్ చేయగలిగితే పిల్లలు ఇష్టంగా తింటారు.
తక్కువగా పెట్టండి
ఇంట్లో పిల్లలు ఎలా తిన్నా.. స్కూల్‌లో అయితే ఎక్కువ తింటారు అన్నది చాలా మంది ఫీలింగ్. టీచర్లకు భయపడో లేక.. ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ తింటారనో అనుకుంటారు. అందుకే లంచ్ బాక్స్‌లను సాధ్యమైనంత నింపేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. వాళ్లు ఇంట్లో ఉన్నపుడు ఒక పూట ఎంత తినగలుగుతున్నారో అంతే పెట్టండి. ఇక పండ్లు, కూరగాయల్లాంటివి లంచ్ బాక్స్‌లో ఉంచితే.. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టడం మరిచిపోవద్దు. చాలా మంది యాపిల్స్‌లాంటి పండ్లను కట్ చేయకుండా అలాగే పెట్టేస్తుంటారు. ముఖ్యంగా ప్రీప్రైమరీ చదివే పిల్లలకు ఇలా అస్సలు చేయకండి.
కొత్త వాటితో ప్రయోగాలొద్దు..
రోజుకో లంచ్ పెడితేనే పిల్లలు ఇష్టపడతారు కదా అని కొంతమంది కొత్త కొత్త వంటకాలతో ప్రయోగాలు చేస్తుంటారు. కానీ లంచ్ టైమ్‌లో ఈ ప్రయోగాలు వద్దు. ఆ సమయంలో పిల్లలు చాలా వరకు వాళ్లకు తెలిసిన, ఇష్టమైన వంటకాలే తినడానికి ఇష్టపడతారు. కొత్త వాటిని ట్రై చేయాలంటే నైట్ డిన్నర్ టైమ్ బెస్ట్. రాత్రిపూట ఇలా కొత్త వంటకాలను వాళ్లకు అలవాటు చేసి తర్వాత లంచ్ బాక్స్‌లో వాటిని భాగం చేస్తే బాగుంటుంది.
కిడ్స్ లంచ్ బాక్స్‌లో ఉండాల్సినవి..
లంచ్ బాక్స్ సాధ్యమైనంత వరకూ తక్కువగా, హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌తోపాటు పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి.
ఆపిల్స్, అరటి, జామ, మామిడి, నారింజలాంటి పళ్లతోపాటు టమాట, క్యారెట్, క్యాప్సికమ్, కీర దోసలాంటి తాజా కూరగాయలు పిల్లల లంచ్ బాక్స్‌లో ఉండాల్సిందే. చీజ్, పెరుగులాంటి డెయిరీ ఉత్పత్తులు ఉండేలా చూసుకోండి. బిస్కెట్లు, చిప్స్, చాక్లెట్లు, జామ్, హనీలాంటి వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు. లంచ్ టైమ్‌లో వీటిని పక్కన పెట్టేయడమే మంచిది. వీటికి బదులు బాదాం, జీడిపప్పు, కిస్మిస్, డేట్స్, అంజీరా వంటి డ్రై ఫ్రూట్స్ రెండు మూడు కిడ్స్ లంచ్ బాక్స్ లో పెడితే వారికి పౌష్ఠికాహారం అందుతుంది. భారతీయులకు అవసరమైన పౌష్ఠికాహారానికి సంబంధించిన మార్గదర్శకాలు జాతీయ పౌష్ఠికాహార సంస్థ వెబ్ సైట్ లో కూడా చూడొచ్చు.
కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియాస్
♦ పనీర్ లేదా ఎగ్ పరాటా ♦ ఆలూ పరాటా
♦ క్యారెట్ రైస్, బీట్‌రూట్ రైస్, టొమాటో రైస్, పాలక్ రైస్, కిచిడీ
♦ రాజ్మా పులావ్
♦ తాజా కూరగాయలతో చేసిన సాండ్‌విచ్ ♦ ఓట్స్ ఇడ్లీ
♦ ఆలు, బ్రెడ్ రోల్స్ ♦ వెజ్ నూడిల్స్
♦ ఇడ్లీ ♦ వడ (మినప) ♦ బొబ్బెర గారెలు ♦ పెసర గారెలు
♦ బ్రెడ్ ఆమ్లెట్ ♦ పాస్తా ♦ సేమియా ఉప్మా ♦ బాస్మతి రైస్ తో చేసిన వెజ్ బిర్యానీ
♦ పనీర్ పకోడా ♦ బ్రెడ్ పకోడా ♦ చీజ్ ఆమ్లెట్
♦ క్యాప్సికం, బ్రకోలి ఉడికించి పెప్పర్ సాల్ట్ చల్లి ఇవ్వడం ♦ చపాతీ ఎగ్ రోల్స్
ఒత్తిడి చేయొద్దు
ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటూనే కిడ్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చినా వాళ్లు దాన్ని తినకుండా వస్తే సహజంగానే ఎవరికైనా కోపం వస్తుంది. దీంతో పిల్లలపై అరుస్తుంటాం. కచ్చితంగా లంచ్ అంతా తినేసి రావాల్సిందే అని ఒత్తిడి తెస్తాం. కానీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు ఎంతగా ఒత్తిడి తెస్తే పిల్లలు అంత మొండిగా తయారవుతారు. వాళ్ల జీర్ణక్రియకు అనుగుణంగానే వాళ్లను తిననివ్వండి. ఒత్తిడి చేసి తినిపించడం వల్ల వాళ్లలో సహజ జీర్ణక్రియ దెబ్బ తింటుంది. ఒక పూట లేదా ఒక రోజు తక్కువ తినడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు.
ఎందుకు తినడం లేదు?
చాలా మంది చిన్న పిల్లలు లంచ్ బాక్స్‌లను అలాగే ఇంటికి తీసుకొస్తుంటారు. అది చూసి పేరెంట్స్ వాళ్లపై అరుస్తుంటారు. కానీ వాళ్లు ప్రతి రోజూ అలా చేయడానికి కారణమేంటో కనుక్కొనే ప్రయత్నం చేయండి. దీనికి చాలా కారణాలే ఉంటాయి.
– లంచ్ బాక్స్ నచ్చకపోవడం కూడా దీనికి ఓ కారణమే. అందువల్ల బాక్స్‌లోని ఫుడ్‌లాగే నాలుగైదు వెరైటీ బాక్స్‌లు కూడా ఉంటే మంచిది. మార్కెట్‌లో దొరికే లేటెస్ట్, అట్రాక్టివ్ లంచ్ బాక్స్‌లను తెచ్చి పెట్టుకోండి. రోజుకో బాక్స్‌లో లంచ్ పంపించడం వల్ల వాళ్లు తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఏ బాక్స్ అయినా సరే వాళ్లకు తెరవడానికి సులువుగా ఉండేలా చూసుకోవడం మంచిది.
– రోజూ ఒకే రకమైన కిడ్స్ లంచ్ బాక్స్ బోర్ కొడుతుంది. ఒకవేళ ఒకే రకమైన వంటకం అయినా.. వాటిని వివిధ రకాలుగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. సాండ్‌విచ్‌లాంటివి రెగ్యులర్‌గా పంపిస్తుంటాం. కానీ ఇదే సాండ్‌విచ్‌ను ప్రతి రోజూ వెరైటీ షేప్స్‌లో కట్ చేసి పెడితే టేస్ట్ ఒకటే అయినా వాటిని తినడానికి పిల్లలు ఆసక్తి చూపుతారు.
– లంచ్ కోసం ఉదయమే బాక్స్ ప్రిపేర్ చేసి పంపిస్తాం. కొన్ని గంటల తర్వాత అదే ఫుడ్ తినాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అందువల్ల లంచ్ బాక్స్ సాధ్యమైనంత వరకూ కూల్‌గా ఉండేలా చూసుకుంటే మంచిది. ఫ్రీజర్ ఉన్న లంచ్ బాక్స్‌లాంటివి వాడితే బాగుంటుంది. అది కుదరకపోతే సాధారణ లంచ్ బాక్స్‌తోపాటు చల్లని వాటర్ బాటిల్‌ని కలిపి ఉంచండి. దీనివల్ల బాక్స్ చల్లగా ఉండి అందులోని ఫుడ్ డ్రైగా అవడంగానీ, పాడవడంగానీ జరగదు.
కిడ్స్ లంచ్ బాక్స్ షెడ్యూలు కూడా తయారు చేయండి..
ఏ రోజుకా రోజు ఏం చేయాలని మీరు ఒత్తిడి కొని తెచ్చుకోకుండా ఉండాలంటే.. మీరు మీ పిల్లలతో చర్చించి ఒక టైమ్ టేబుల్ తయారు చేయండి. మీ పిల్లలు ఏ రోజు ఏం చేయాలో అందులో చేర్చండి. ఇక లంచ్ బాక్స్ ఐడియా విషయంలో వారం రోజుల్లో ఏమేం తయారు చేయాలో కూడా వాళ్లతో చర్చించండి. చర్చించిన తరువాత వాటిని ఆ టైమ్ టేబుల్ లో చేర్చండి. ఉదాహరణకు సోమవారం: ఇడ్లీ లేదా కిచిడీ లేదా గారెలు, మంగళవారం వడ లేదా పాలక్ రైస్ లేదా వెజ్ నూడుల్స్.. ఇలా ప్రతిరోజూ ఒక పౌష్టికాహారం ఆ బ్రేక్ ఫాస్ట్ షెడ్యులులో ఉండేలా చూడండి. ఇంట్లో ఒక చోట, లేదా కిచెన్ లో ఈ టైమ్ టేబుల్ అంటించండి.
మీ వద్ద ఇంకా ఏవైనా కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియా ఉంటే మాకు రాయండి. ఇతర తల్లులకు ఉపయోగపడుతాయి. అలాగే బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం కూడా రాయండి. మేం మా సైట్ లో ప్రచురిస్తాం. ఈ జాబితా అవసరం ఉన్న తల్లిదండ్రులకు ఈ కథనం షేర్ చేయడం మరిచిపోకండి. థ్యాంక్యూ..