Home కెరీర్ ఫస్ట్‌ జాబ్‌ కోసం వెతుకుతున్నారా.. ఇది మీ కోసమే

ఫస్ట్‌ జాబ్‌ కోసం వెతుకుతున్నారా.. ఇది మీ కోసమే

first job
Photo by Mihai Constantin from Pexels

స్ట్‌ జాబ్‌.. మీ ప్రొఫెషనల్‌ కెరీర్‌కు తొలి అడుగు. సాధారణంగా తొలి అడుగు ఆచితూచి వేయాలి. ఉద్యోగం విషయంలోనూ అంతే. అప్పుడే కాలేజీ చదువులు పూర్తి చేసుకొని జీవితంలో ఓ కొత్త అంకానికి తెర తీయబోతున్న స్టూడెంట్స్‌కు ఫస్ట్‌ జాబ్‌ వేట ఎన్నో సవాళ్లు విసురుతుంది. ఈ సవాళ్లను అధిగమించి కెరీర్‌లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా వరకు ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తూ భారంగా జీవితాన్ని గడుపుతుంటే కొందరు మాత్రం అలా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వాళ్లకు అసలు ఫస్ట్‌ జాబ్‌ ఎలా వెతుక్కోవాలన్నదానిపై స్పష్టత లేకపోవడమే ప్రధాన కారణం. కెరీర్‌లో తొలి ఉద్యోగం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న అంశాలపై కచ్చితంగా సరైన అవగాహన ఉండాలి. ఆ విలువైన సమాచారం అందించాలన్నదే ఈ డియర్‌ అర్బన్‌.కామ్‌ స్టోరీ ఉద్దేశం.

బాగా ఆలోచించండి..

చదువు పూర్తయింది.. ఇక ఉద్యోగ వేట మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఎక్కడ, ఎలా మొదలుపెట్టాలి? ఎలాంటి ఉద్యోగం చేయాలి అన్నదానిపై మొదట్లో కాస్త గందరగోళం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ముందుగా చేయాల్సిన పని ఆలోచించడం. అసలు మీకు ఏం కావాలి? కెరీర్‌లో ఏం సాధించాలి అని అనుకుంటున్నారు? జీవితాంతం అవసరానికి తగినంత సంపాదన ఉంటే చాలా లేక ఏదైనా లక్ష్యం ఉందా? దానిని చేరుకోవాలంటే ఏం చేయాలి? పని చేసే చోట ఎలాంటి వాతావరణం ఉండాలి.. ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు మీ దగ్గర ఉన్నాయంటే.. మీరు ఫస్ట్‌ జాబ్‌ వెతుక్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లే. ఇక్కడే మీ ఉద్యోగ వేటలో సగం పని పూర్తవుతుంది. ఎలాంటి ఉద్యోగం చేయాలో మీకో క్లారిటీ వస్తుంది.

ఒత్తిడికి తలొగ్గొద్దు..

ఇప్పటికే మీ టార్గెట్‌ ఏంటో మీకు తెలిసిపోయింది. ఇక జాబ్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏవేవో ఆఫర్లు వస్తుంటాయి. అయితే చాలా మంది తమకు వచ్చిన తొలి ఆఫర్‌కే ఓకే చెప్పేస్తుంటారు. ఇంట్లో వాళ్లు, బంధువులు, ఫ్రెండ్స్‌ నుంచి ఇలాంటి సమయంలో ఒత్తిడి సహజం. చదువు పూర్తవగానే మంచి ఆఫర్‌ వచ్చింది.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఓకే చెప్పెయ్‌ అంటుంటారు. ఒక్కోసారి వచ్చిన ఆఫర్‌ ఎందుకు వదులుకోవడం అనుకుంటూ.. మీకు మీరుగానే సరే అనేస్తారు. కానీ వచ్చిన తొలి ఉద్యోగాన్నే చేయాలని ఏమీ లేదు. ఆ ఉద్యోగం మీ ఆలోచనలకు అనుగుణంగానే ఉందా.. మీ కెరీర్‌ గోల్స్‌ సాధించడం సాధ్యమేనా.. ఇంతకంటే మంచి ఆఫర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయా.. ఇలా అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఇష్టం లేని, మీ కెరీర్‌కు ఉపయోగపడని జాబ్‌ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మీ ఆసక్తి, అభిరుచులకు తగిన ఉద్యోగం వెతుక్కోగలిగితే.. కెరీర్ ఎక్కడా బోర్‌ కొట్టదు.. గాడి తప్పదు.

ఎక్కువ ఆప్షన్లు ఉండాలి

మీరు చదివిన చదువు, మీ లక్ష్యానికి అనుగుణంగా ఓ కెరీర్‌ను ఎంచుకోవాలని అనుకుంటారు. కానీ కచ్చితంగా ఆ కెరీర్‌ మీ సొంతమవుతుందో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు, మూడు కెరీర్‌ ఆప్షన్లు ఉంచుకోవడం అన్నది ముఖ్యం. అందుకు తగిన నైపుణ్యాలను కూడా సమకూర్చుకుంటే.. ఒకదాంట్లో కాకపోయినా మరో దాంట్లో సక్సెస్‌ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి.

ఫస్ట్‌ జాబ్‌ ఏదో ఒకటిలే అనుకోవద్దు..

చదువు పూర్తవగానే జాబ్‌లో జాయిన్‌ కావాలని అందరూ అనుకుంటారు. ఏదైనా జాబ్‌ రాగానే సంతోషంగా వెళ్లి జాయిన్‌ అవుతారు. కానీ ఎక్కువ కాలం అందులో నిలదొక్కుకోలేరు. దీనికి ప్రధానంగా ఓ బలమైన కారణం ఉంది. ఇలా జాబ్‌లో జాయినై మానేసిన వాళ్లు ముందుగానే తమ ప్రాధాన్యతలు ఏంటో తెలుసుకోలేకపోవడం. మంచి జాబ్‌, జీతం కూడా బాగానే ఉంది అనగానే ఓకే చెప్పేస్తారు. కానీ ఆ జాబ్‌ నేచర్‌ ఏంటి? మీకు సెట్‌ అవుతుందా లేదా? జాబ్‌ టైమింగ్స్‌ ఓకేనా? అవసరమైనప్పుడు మరో ప్లేస్‌కి వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అందులో పని చేసే వాతావరణం మీరు అనుకుంటున్నట్లు ఉందా లేదా? ఇలా.. ఫస్ట్‌ జాబ్‌ వచ్చిన సంతోషంలో ఇవేమీ పట్టించుకోరు. తీరా జాబ్‌లో జాయిన్‌ అయిన తర్వాత ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినా వెంటనే మానేస్తారు.

ప్రశ్నలు అడగండి..

ఇంతకుముందు ఉద్యోగం చేసిన అనుభవం లేదు.. బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు.. ఏం అడిగితే ఏమనుకుంటారో అన్న మొహమాటం ఉంటుంది. అందువల్ల చాలా మంది తమకున్న డౌట్లను క్లారిఫై చేసుకోకుండానే జాబ్‌లో జాయిన్‌ అయిపోతారు. నిజానికి ఫస్ట్‌ జాబ్‌ జాయిన్‌ అయ్యే ముందు ప్రతి ఒక్కరికీ ఎన్నో సందేహాలు ఉంటాయి. మీరు అప్లై చేసుకున్న ఉద్యోగానికి సంబంధించి జాబ్‌ డిస్క్రిప్షన్‌లో అన్ని అంశాలు ఉన్నా కూడా.. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేధిస్తుంటాయి. వాటిని జాబ్‌లో జాయిన్‌ అయ్యే ముందే అడిగి తెలుసుకుంటే మంచిది. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగితే.. మీరు చేయబోయే జాబ్‌ గురించి అంత స్పష్టత మీకు వస్తుంది. ఇది భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. మీరు ఎంచుకున్న కెరీర్, కంపెనీ గురించి సందేహాలు ఉంటే వాటికి సమాధానం తెలుసుకునేందుకు గ్లాస్ డోర్ వంటి వెబ్ సైట్ లో ఇదివరకే సంబంధిత కంపెనీ, లేక సంబంధిత కెరీర్ గురించి రివ్యూ ఉంటుంది. శాలరీ, నైపుణ్యాలు, కంఫర్ట్ తదితర అన్ని విషయాలు వాటిలో తెలుసుకోవచ్చు.

ఐదేళ్ల ప్లాన్‌..

ఫస్ట్‌ జాబ్‌ వేట మీ లక్ష్యాలకు అనుగుణంగా, ఓ వ్యూహాత్మక పద్ధతిలో ఉండేలా చూసుకుంటే మంచిది. దీనివల్ల మీరు ఎప్పుడూ కెరీర్‌లో దారి తప్పకుండా ఉంటారు. దీనికోసం ముందుగానే ఓ ఐదేళ్ల ప్లాన్‌ను సిద్ధం చేసుకోండి. అంటే..

– వచ్చే ఐదేళ్లలో కెరీర్‌లో ఏం సాధించాలి?
– ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేయాలి?
– ఆ టార్గెట్‌ను చేరుకున్నట్లు ఎలా తెలియాలి?
ఈ ప్రశ్నలు ముందుగానే మీకు మీరు వేసుకొని, అందుకు తగినట్లు వ్యూహాత్మకంగా జాబ్‌ వేట మొదలుపెడితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఫస్ట్‌ జాబ్‌ లెవల్‌ తక్కువైనా పర్వాలేదు

పెద్ద పెద్ద చదువులు చదివినా.. చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారంటే దానికి కారణం.. నా లెవల్‌ జాబ్‌ దొరకడం లేదన్న ఫీలింగ్‌. ఇంత చదువు చదివి ఈ ఉద్యోగం చేయాలా అని అనుకుంటారు. కానీ ఎలాగోలా ఓ అడుగు వేస్తేనే కదా.. కెరీర్‌ ముందుకు సాగేది.. పైగా ఎలాంటి అనుభవం లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే.. చిన్న కంపెనీ లేదా చిన్న స్థాయి ఉద్యోగంలో అయినా చేరి అవసరమైన అనుభవం, నైపుణ్యం సాధిస్తే మంచిదే కదా. వచ్చిన జాబ్‌లో జాయిన్‌ అవండి.. అలాగని అందులోనే సెటిలైపోవద్దు. ముందుగానే ఓ టైమ్‌ లిమిట్‌ పెట్టుకోండి. అంతలోపు మీ స్థాయికి తగిన జాబ్‌ సాధించడానికి ప్రయత్నించండి. మరీ ఎక్కువ కాలం మీ లెవల్‌ కంటే తక్కువ జాబ్‌ చేస్తే.. ఆ తర్వాత మంచి జాబ్‌ దొరకడం కష్టమవుతుంది.

వీటి ఉచ్చులో పడకండి..

స్టూడెంట్స్‌గా ఉన్నప్పటి నుంచే మనలో ఓ కన్ఫ్యూజన్‌ ఉంటుంది. స్కూల్‌ తర్వాత ఏ కోర్స్‌ తీసుకోవాలి అని. మన ఆసక్తిని బట్టి తీసుకోవాలా.. మంచి కెరీర్‌ ఉన్న కోర్స్‌ తీసుకోవాలా.. లేక పేరెంట్స్‌, ఇతర బంధువులు, ఫ్రెండ్స్‌ చెప్పిన కోర్స్‌ తీసుకోవాలా అన్నది తేల్చుకోలేకపోతాం. ఒక్కోసారి మనకు తెలియకుండానే పైపై మెరుపులకు ఆకర్షితులమై ఊహించని కోర్స్‌లో చేరిపోతాం. తర్వాత బాధపడతాం. అలాగే ఫస్ట్‌ జాబ్‌ విషయంలోనూ జరుగుతుంది. కొన్ని రకాలు ఉచ్చులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వాటిలో పడ్డామంటే ఇక అంతే.. కెరీర్‌ మొత్తం గాడి తప్పుతుంది. సాధారణంగా ఫస్ట్‌ జాబ్‌ ఎంపిక చేసుకునే వాళ్లు ఎలాంటి ఉచ్చుల్లో పడతారో ఓసారి చూద్దాం..

ఎక్కువ జీతం

మీకు మొదట్లోనే రెండు రకాల ఉద్యోగాలు వచ్చాయి అనుకుందాం. అందులో ఒక ఉద్యోగంలో శాలరీ తక్కువగా ఉంది.. మరోదాంట్లో ఎక్కువ జీతం ఉంది.. సహజంగానే రెండోదాని వైపే చాలా మంది మొగ్గు చూపుతారు. ఎక్కువ జీతం ఎవరినైనా ఆకర్షిస్తుంది. పైగా అప్పటి వరకూ చదువుకే చాలా ఖర్చు పెట్టేశాం.. ఇక ఆ పెట్టుబడికి తగిన రిటర్న్స్‌ రావాలన్న ఆలోచనతో ఉంటారు. అయితే ఇక్కడే మీరు ఈ శాలరీ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం జీతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటే బోల్తా పడతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కెరీర్‌ తొలినాళ్లలో మీకు కావాల్సింది ఎక్కువ జీతం కాదు.. కెరీర్‌లో ఎదగడానికి కావాల్సిన అవకాశాలు, అనుభవం, జ్ఞానం. ఇవి ఏ జాబ్‌లో ఉంటాయో చూసుకోండి. జీతం తక్కువైనా సరే తొలి ఉద్యోగంలో ఇవన్నీ మీరు పొందగలరు అనుకుంటే.. కచ్చితంగా దాన్నే ఎంపిక చేసుకోండి. కెరీర్‌లో డబ్బు దానంతట అదే మీ దగ్గరికి వస్తుంది. భవిష్యత్తులో పెద్దగా అవకాశాలు కల్పించలేని ఉద్యోగం.. ఎంత ఎక్కువ జీతం ఇచ్చినా దండగే.

ఏ రంగంలోకి..

కొంత మంది స్టూడెంట్స్‌గా ఉన్నపుడే ఏ రంగంలో పని చేయాలి.. అందులో కెరీర్‌ ఎలా బిల్డ్‌ చేసుకోవాలి అన్న అంశాలపై స్పష్టంగా నిర్ణయించేసుకుంటారు. మరికొంత మంది ఎవరి సలహా మేరకైనా ఓ రంగంలోకి వెళ్లాలి అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ఫస్ట్‌ జాబ్‌ కచ్చితంగా మీ కెరీర్‌ను డిసైడ్‌ చేస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఒకసారి ఓ కెరీర్‌ ఎంపిక చేసుకున్న తర్వాత మరోదాంట్లోకి వెళ్లలేమన్న భావన సరికాదు. కెరీర్‌ ముందుకు సాగుతున్న కొద్దీ మీరు సంపాదిస్తున్న అనుభవం, జ్ఞానం, అవకాశాలు మిమ్మల్ని మరో రంగంలోకి కూడా తీసుకెళ్లే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఒకే రంగాన్ని పట్టుకొని కూర్చుంటే ఫలితం ఉండదు.

మొదట్లో మరో రంగంలో అవకాశం వచ్చినా దానిని వదులుకోవద్దు. అందులో మీ కెరీర్‌ ఎలా సాగుతుంది? మీరు సంపాదించే అనుభవం.. భవిష్యత్తులో మీరు కోరుకున్న రంగంలోకి మిమ్మల్ని తీసుకెళ్లగలదా చూడండి. అలాంటి అవకాశం ఉంటే.. వెంటనే ఆ జాబ్‌లో చేరండి. భవిష్యత్తులో ఎలాంటి జాబ్‌ అయినా చేయగలిగేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశం ఇచ్చే జాబ్‌ అయితే అస్సలు వదులుకోవద్దు. అది మీరు కోరుకోని రంగం అయినా జాయిన్‌ అవడం మంచిది.

పేరున్న కంపెనీ.. అయితే ఏంటి?

ఎక్కువ జీతంలాగే చాలా మంది తమ ఫస్ట్‌ జాబ్‌ను ఓ పేరున్న కంపెనీలో చేయాలని అనుకుంటారు. అందరికీ గొప్పగా చెప్పుకోవచ్చు అన్నది వాళ్ల ఫీలింగ్‌. ప్రతిష్టాత్మక కంపెనీల్లో పని చేయడం వల్ల పేరు వస్తుందేమోగానీ.. చిన్న చిన్న కంపెనీల్లో ఉన్నన్ని అవకాశాలు, ప్రయోజనాలు సాధారణంగా వాటిలో ఉండవు. ఇది తెలియక చాలా మంది పేరున్న కాలేజీల్లో చదివినట్లే.. పెద్ద పేరున్న కంపెనీలో పని చేయాలని కలలు కంటుంటారు. దాని కోసమే ప్రయత్నిస్తూ.. వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంటారు.

సొంతంగా ఓ బిజినెస్‌ ప్రారంభించడం, ఓ పెద్ద వ్యాపారవేత్త కావడం, కంపెనీలో టాప్‌ పొజిషన్‌కు చేరడంలాంటివి మీ లక్ష్యాలైతే.. ఆ అవకాశాన్ని స్టార్టప్స్‌ కల్పిస్తాయి. అందువల్ల కంపెనీ పేరు కాకుండా.. అందులో మీరు వేగంగా ఎదగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూడండి.

ఫస్ట్‌ జాబ్‌ వేటలో ఈ తప్పులు చేయొద్దు

ఫస్ట్‌ జాబ్‌ కోసం వెతికే వాళ్లు సాధారణంగా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఏం చేయాలో తెలియక.. గైడ్‌ చేసే వాళ్లు లేక వాళ్లు ఈ పొరపాట్లు చేస్తుంటారు. ముందు వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. 

– జాబ్‌ కోసం రెజ్యుమె ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. మిమ్మల్ని చూడకుండానే మీ గురించి కంపెనీ ఓ అంచనాకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాంటి రెజ్యుమెలో కొంతమంది తమకు లేని నైపుణ్యాలు కూడా ఉన్నట్లుగా చెబుతుంటారు. అది చాలా పెద్ద పొరపాటు.

– ఏదో ఒక జాబ్‌ వస్తే చాలు అనుకుంటూ.. కనిపించిన ప్రతి జాబ్‌కూ దరఖాస్తు చేయడం కూడా సరికాదు.

– జాబ్‌ కోసం అప్లై చేస్తే సరిపోదు.. ఎప్పటికప్పుడు దాని స్టేటస్‌ తెలుసుకుంటూ ఉండాలి. చాలా మంది ఈ పని చేయరు.

– ఈ స్మార్ట్‌ వరల్డ్‌లో మీ సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ కూడా జాబ్‌పై ప్రభావం చూపిస్తాయని గుర్తుంచుకోండి. అందుకే సాధ్యమైనంతగా మీ ప్రొఫైల్స్‌ను ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలి.

ఫస్ట్‌ జాబ్‌.. ఇవీ కీ పాయింట్స్‌

– మీ ఫస్ట్‌ జాబ్‌ అన్నది మీ కెరీర్‌, మీ పని అలవాట్లను నిర్ధారిస్తుంది.

– మీరు జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నారన్నదానిపైనే మీ ఫస్ట్‌ జాబ్‌ ఆధారపడి ఉంటుంది.

– కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేని అనుభవాన్నిస్తుంది.

– కెరీర్‌లో ఎదిగేందుకు అవసరమైన బిజినెస్‌ కాంటాక్ట్స్‌ పెరుగుతాయి.

– మీ ఫస్ట్‌ జాబే సెక్యూర్డ్‌ జాబ్‌ కావాల్సిన అవసరం లేదు. ఈ జాబ్‌ వల్ల మీకు అంతకంటే విలువైన జ్ఞానం, అనుభవం వస్తాయి.

– మీకు నచ్చిన లేదా మీరు నైపుణ్యం సాధించిన రంగంలో ఏదైనా కంపెనీలో వలంటీర్‌గా పని చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడే అనుభవం, జ్ఞానం మీ సొంతమవుతుంది. మీ ఫస్ట్‌ జాబ్‌లోనే మీదైన ముద్ర వేయడానికి ఇది తోడ్పడుతుంది.

ఇవీ చదవండి

Exit mobile version