Home కెరీర్ జాబ్ పోతే ? డోంట్‌ వర్రీ.. నీకంటే తోపెవ్వరూ లేరిక్కడ!

జాబ్ పోతే ? డోంట్‌ వర్రీ.. నీకంటే తోపెవ్వరూ లేరిక్కడ!

job lost
Photo by Inzmam Khan from Pexels

సడెన్‌గా జాబ్ పోతే ఎలా? జాబ్‌ లేకపోతే ఇక జీవితమే లేదా? డోంట్‌ వర్రీ.. లాక్‌ డౌన్‌ వల్ల జాబ్‌ పోయి ఉండొచ్చు.. మీ బాస్‌కే కోపమొచ్చి ఉండొచ్చు.. లేదా మీకే కోపమొచ్చి వదిలేసి ఉండొచ్చు.. 3,500 ఉద్యోగాలు తీసేస్తున్నట్టు జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఓ సంస్థ చెప్పేసింది. అంటే సడెన్‌గా జాబ్‌ పోవడం మీకు ఒక్కరికే ఎదురైన సమస్య కాదు.. ఇలా ప్రపంచంలో చాలా మందికి ఎదురైన సమస్య. సరే.. మనకు కూడా ఎదురైంది. మరి ఏం చేయాలి..

జాబ్ పోతే మీకో టర్నింగ్‌ పాయింట్‌..

ఉద్యోగం ఊడితే ముందుగా మనం మానసికంగా చాలా క్షోభకు గురవుతాం. ఎందుకంటే మనం నెలనెలా ఒకటో తేదీన వచ్చే జీతానికి బానిసలయ్యాం. ఒక్క రోజు ఆలస్యమైతేనే కాళ్ల కింద భూమి కంపించినట్టవుతుంది. అలాంటిది ఇక జీతమే రాదని తెలిస్తే మనకు షాక్‌ కొట్టినంతపనైపోతుంది.

కానీ ఇదే క్షణం.. మీ జీవితానికి మరో టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఉన్న జాబ్‌ ఎవడి దయతోనే రాలేదు.. మీ కష్టార్జితం. మీ శ్రమ ఫలితం. ఇలాంటి జాబ్‌ మళ్లీ దొరక్కపోదు.

కానీ ఇలాంటి జాబే ఎందుకు మళ్లీ.. గొప్పగా బతకాలన్న మీ కలలను నిజం చేసుకునే సమయం ఇదే అని ఎందుకు అనుకోరాదు? మీరు ఇక ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. అత్యంత స్వేచ్ఛ లభించిందని ఎందుకు అనుకోరాదు?

జాబ్‌ పోయిందన్న వాస్తవాన్ని అంగీకరించండి..

జాబ్‌ పోయిందన్న వాస్తవాన్ని అంగీకరించి తీరాలి. సాధారణంగా మనం వాస్తవ స్థితిని అంగీకరించం. కోపానికి లోనవుతాం. కొద్దిగా దిగజారుడుకు గురవుతాం. దుఃఖంలో ఉండి మదనపడుతూ డిప్రెషన్‌కు లోనవుతాం. అందువల్ల ఈ స్థితి రాకుండా ఉండాలంటే మనం జాబ్‌ లేదన్న వాస్తవాన్ని అంగీకరించి.. ఈ సమస్యకు పరిష్కారం వెతకడమే.

లేదంటే కొంత సమయం తీసుకున్నా.. చివరకు జరిగేది ఇదే. కానీ సమయం తీసుకోవడం వల్ల మరింత నష్టం జరుగుతుంది. పైగా మీ దుఃఖం మీ కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది. మీకు ఏడవాలనిపిస్తే ఎవరూ లేకుండా చూసి ఏడ్చేయండి.

మీకు పరిష్కారం కనిపించకపోతే మీ జీవిత భాగస్వామితో లేదా ఆత్మీయ మిత్రులతో, మీ బంధువులతో మాట్లాడండి. మీకు కొంత ప్రోత్సాహం, ప్రేరణ లభించవచ్చు.

ఆర్థిక అవసరాలు అసలు సమస్య

మీరు ఎమోషనల్‌గా కుదుటపడ్డారు కదా.. ఇక మీ ముందున్న కర్తవ్యం డబ్బు అవసరాలు తీర్చుకోవడం. జాబ్‌ కోల్పోయినప్పుడు ఎదురయ్యే అసలైన సవాలు. ముందుగా మీకు ఉన్న ఇతర ఆదాయ మార్గాలు గుర్తు తెచ్చుకోండి. డబ్బు అవసరాలు గుర్తించి, దానికి తగిన ప్రణాళిక రాసిపెట్టుకోండి.

అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నట్లయితే వచ్చే ఆదాయ వనరులు, మీ స్నేహితులు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాటిని సమీకరించుకోవడం వంటి విషయాలు గుర్తు తెచ్చుకోండి. అలాగే మీకు ఎదురయ్యే నెలవారీ ఖర్చులు రాసిపెట్టుకోండి.

రెంట్, పిల్లలకు స్కూల్‌ ఫీజులు, ఫుడ్, లోన్లకు చెల్లించాల్సిన ఈఎంఐలు, యుటిలిటీ(మొబైల్, ఇంటర్నెట్, గ్యాస్, విద్యుత్తు, వాటర్‌) బిల్లులు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు వంటివన్నీ రాసిపెట్టండి.

మరి ఎలా మేనేజ్‌ చేయాలి..

మీలో ఆర్థిక క్రమ శిక్షణ ఉండి ఉంటే బహుశా మీరు ఒక మూడు నెలలకు సరిపడా అత్యవసర నిధి సమకూర్చుకుని ఉంటారు. వాటిని తెలివిగా వాడితే కనీసం ఆరు నెలల ఖర్చులకు పనికొస్తాయి. అంటే మీరు అవసరం లేనివాటిపై అస్సలు ఖర్చు పెట్టొద్దు.

అలాగే అవసరమైన వాటిపై కూడా ఖర్చు తగ్గించాలి. ఎందుకంటే చిన్న చిన్న ఖర్చులే ఆ అత్యవసర నిధిని కూడా ఖాళీ చేస్తాయి. మీకు తిరిగి ఆదాయం సమకూర్చుకోగలిగిన స్థితి వచ్చాక తిరిగి అత్యవసర నిధిని సమకూర్చుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డు వాడొద్దు..

మన దగ్గర క్రెడిట్‌ కార్డు ఉంది కదా.. 50 రోజుల వరకు క్రెడిట్‌ ఫెసిలిటీ ఉంది కదా అని వాడేస్తే అసలుకే మోసం వస్తుంది. మీ వద్ద ఉన్న నగదు నుంచే మీరు ఖర్చు పెట్టుకోవాలి తప్ప.. మీరు క్రెడిట్‌ కార్డు వాడితే నష్టపోతారు. మీకు ఆదాయం రాక ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలియదు.

అందువల్ల 50 రోజుల తరువాత మీరు చెల్లించనిపక్షంలో క్రెడిట్‌ కార్డు బిల్లు వడ్డీ వాతలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. ఇప్పటికే క్రెడిట్‌ కార్డు బిల్లు పెండింగ్‌లో ఉంటే వాటిని వెంటనే కట్టేయండి. మీ వద్ద ఏవైనా సేవింగ్స్‌ ఉంటే వాటి నుంచి తీసి ఈ బిల్లు తక్షణం కట్టేయండి.

జాబ్ పోతే వేటిని కొనసాగించాలి..

మీరు ఒకవేళ మ్యూచువల్‌ ఫండ్లలో నెలనెలా సిప్‌ పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్నట్టయితే ప్రస్తుతం జాబ్‌ లేనందున వాటిని ఆపేయొచ్చు. కానీ మీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం మాత్రం తప్పనిసరిగా చెల్లిస్తూ ఉండండి. ఇందుకు మీ వద్ద ఉన్న సేవింగ్స్‌ను వినియోగించండి.

ఎందుకంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆపదలో ఆదుకునేవి ఇవే. ఇక మీరు అప్పులు చెల్లించాల్సి ఉంటే ముందుగా ఎక్కువ వడ్డీ రేటు ఉన్న వాటిని చెల్లించేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం ఎవరినైనా సాయం కోరండి. మీ జీవిత భాగస్వామి సహా మీ తల్లిదండ్రులు, సమీప బంధువులు, స్నేహితుల సాయం కోరండి.

జాబ్‌ పోయిందని తెలియడం మంచిదే..

జాబ్‌ లేదన్న సంగతిని మీ ఆత్మీయులు, స్నేహితులు, బంధువులకు తెలిస్తే మంచిదే. దీని వల్ల మీ మనసు మరింత కుదుటపడుతుంది. దీని వల్ల మీ ఆర్థిక భారం కూడా కొంత తగ్గుతుంది. ఎలా అంటారా? మీరు వారి వేడుకల్లో ఖరీదైన కానుకలు ఇవ్వాల్సిన అవసరం రాదు. మీ నుంచి వారికి ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా తక్కువగా ఉంటాయి. పార్టీలకు వెళ్లాల్సిన అవసరం రాదు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ప్రయాణ ఖర్చులూ మిగులుతాయి. వాస్తవమే కదా..

అవకాశాల తలుపులు తెరవండి..

సో.. మీ కుటుంబ అవసరాలు, వాటిని తీర్చడంపై క్లారిటీ వచ్చింద కదా. ఇక ఇప్పుడు వాట్‌ నెక్స్‌ట్ అని ఆలోచించండి. మీరు మళ్లీ ఉద్యోగమే మొదలుపెట్టలనుకుంటే మీ సహోద్యోగుల చెవిలో వేయండి మీ కంపెనీల తరహా మార్కెట్లో మెరుగైన స్థానంలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగవకాశాలు ఉన్నాయేమో చూడండి. అప్పటి వరకు ఏదైనా ఫ్రీలాన్స్‌ జాబ్‌ ఉంటే వాటిలో ఉన్న అవకాశాలు పరిశీలించండి.

మీ హాబీలేమైనా ఆర్థిక వనరులుగా పనికొస్తాయేమో చూడండి. ఎప్పటి నుంచో మీరు కలలుగన్న మీ కలల ప్రాజెక్టుకు ప్రాణం పోసే అవకాశాలు పరిశీలించండి. మీ స్టార్టప్‌ ఆలోచనను అమల్లోకి తీసుకురండి. ఎవరైనా పెట్టుబడి పెట్టి స్లీపింగ్‌ పార్టనర్‌గా ఉంటారేమో మీ స్నేహితులను అడిగి చూడండి. తక్కువ పెట్టుబడితో కోవర్కింగ్ స్పేసెస్ లో మీ స్టార్టప్ ప్రారంభించండి.

చూశారా.. మీరు గట్టిగా ఆలోచిస్తే.. ఇంత గట్టిగా నిలబడగలరని మీరే అనుకుని ఉండకపోవచ్చు. అందుకే ముందే హెడ్డింగ్‌లోనే చెప్పినట్టు మీ కంటే తోపెవ్వడూ లేడిక్కడ. జాబ్ పోతే ఎలా అన్న బెంగను వీడండి.

మీకు ఈ కథనం నచ్చితే మీ స్నేహితులకు ఈ కథనం షేర్‌ చేయడం మరిచిపోవద్దు.. ఎక్కడో ఒక్కరికి ఈ కథనం ఉపయోపడుతుందేమో.. వారికి సాయంగా ఉంటుంది..

Exit mobile version